రాజకీయాలు, బాసు భజన లేకుండా ఈ మంత్రులు ఒక్క క్షణం కూడా ఉండలేరా..? హాయిగా సతీసమేతంగా, భక్తిభావనతో, ఆ భద్రాద్రి రాముడిని దర్శించుకుని, కాసేపు ఆ వాతావరణంలోనే గడపకుండా… అక్కడికి వెళ్లి కూడా కేసీయార్ భజన తప్పదా..? ఒక దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడైనా వేరేవాళ్లను కీర్తించకుండా సంయమనం పాటిస్తే తప్పేముంది…? ఈ భక్తుడికి నాకన్నా వాళ్ల బాసే దేవుడిలా కనిపిస్తున్నాడు, నేనెందుకులే ఇక అని ఆ రాముడు కూడా ఆశీర్వదించడం మానేస్తాడు… లేకపోతే కేసీయార్ అప్పుడెప్పుడో చేసిన అయుత చండీయాగంతోనే దేశమంతా సుభిక్షంగా ఉందట… అన్నా సీనన్నా, జనం నవ్వుతారని కూడా అనుకోకపోతే ఎలా..? సరే, కేసీయార్ చల్లనిచూపులు కావాలి కాబట్టి, ఏదో కీర్తించినవ్ సరే, కానీ భద్రాద్రి రాముడి మీద కేంద్రం కుట్ర పన్నిందా..? ఎట్టెట్టా…? మళ్లీ ఓసారి చెప్పన్నా… ప్లీజు… తను భవిష్యత్తులో కట్టించబోయే అయోధ్య భవ్యమైన మందిరానికి దీటుగా కేసీయార్ భద్రాచలం గుడిని పునర్నిర్మాణం చేయిస్తాడేమో అని సందేహించి… మోడీ కుట్ర పన్నాడంటావా కొంపదీసి..?
Ads
నువ్వు అక్కడికి పోయింది దేనికి..? మాంచి ఎక్సయిజు భవనాన్ని ప్రారంభించడానికి…! పనిలోపనిగా దర్శనం చేసుకున్నవ్, అయిపాయె… అక్కడికి పోయి ఈ కుట్ర సిద్ధాంతాలను ఏకరువు పెట్టడం దేనికి..? కేంద్ర ప్రభుత్వానికి భద్రాద్రి (అసలు ఈ పేరే దారుణం… అనేక తరాలుగా భద్రాచలం అనేదే రాముడికి ఇష్టమైన పేరు)… మీద కుట్ర పన్నాల్సిన అవసరం ఏమిటో వివరించాలి… రాముడి గుడి మాత్రమే ఉంచి, ఏడు మండలాలను, రాముడి భూములను కూడా ఏపీలో కలిపారు కాబట్టి కుట్రా..? అవి తెలంగాణలో ఉన్నా మునిగిపోయేవి కాదా..? ఈ లాజిక్ గోదావరిలో కలిపేశావా అన్నా… పోనీ, ఏపీలో కలపడం కుట్రే అనుకుందాం… మరి 2014 నుంచి మనం చేసిందేమిటి..? మనం చేసిన పోరాటం ఏమిటి దీనిపై..? ఇప్పుడు అది కుట్రలా కనిపిస్తోందా..? ఇప్పుడు అకస్మాత్తుగా భద్రాచలం రాముడి మీద పాలకుడికి దయకలిగిందా..?
ఏమంటివి అన్నా… యాదాద్రికి 1400 కోట్లు ఇచ్చిన కేసీయార్ భద్రాద్రికి 100 కోట్లు ఇస్తున్నాడా..? ఆయన ప్రకటించి ఎన్నేళ్లయింది..? ఆ మాస్టర్ ప్లాన్ ఏమైంది..? రూపాయి ఖర్చు పెట్టారా..? గుడి అంటే కేవలం యాదగిరి గుట్టేనా..? అసలు భద్రాచలానికి కేసీయార్ ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లడం ఎందుకు మానేసినట్టు..? రాముడు మన దేవుడు కాదా..? అన్ని దేవాలయాలకూ కేసీయార్ ప్రాధాన్యం ఇస్తున్నాడని అంటున్నావు కదా… వేములవాడకు ఎన్ని డబ్బులిచ్చాడు..? ధర్మపురి గుడికి ఏమిచ్చాడు..? పోనీ, ఎములాడ మీకు పడని శివాలయం అనుకుందాం, ధర్మపురి, భద్రాచలం వైష్ణవాలయాలు కాదా..? అసలు యాదగిరిగుట్టకు గాకుండా కేసీయార్ వేరే గుళ్లకు ఏం డబ్బులిచ్చాడో చెప్పండి సార్… ఇవ్వడం కాదు, దేవాలయాల సొమ్ము తీసుకుపోయి, తన మొక్కుల పేరిట ఎక్కడెక్కడి దేవుళ్లకో సంతర్పణ చేసొచ్చాడు తన కుటుంబ సొంత విరాళం అన్నట్టుగా..! ఒక మాట అంటున్నామంటే నాలుగుసార్లు ఆలోచించాలి… కేసీయార్ అయుత చండీయాగం వల్లే దేశం సుభిక్షంగా ఉందంటున్నవ్ సరే… అంటే దేశం సుభిక్షంగా ఉందని పరోక్షంగా నువ్వే మోడీకి సర్టిఫికెట్ ఇస్తున్నట్టే కదా… అదే మరి…!!
Share this Article