.
మీరు ప్రపంచాన్ని గెలిచి రండి… తెలంగాణను గెలవలేరు… మీరు మీ పార్టీపరంగా విశ్వవ్యాప్తంగా విజయకేతనాలు ఎగరేయండి… కానీ తెలంగాణలో మీ పార్టీ అయినా సరే, మీ పప్పులు ఉడకవు… ఇక్కడ కోవర్టు కథలు ఎక్కువ…
ఎందుకు చెప్పుకోవడం అంటే.., పాపం, మోడీ…తెలుగు ఎంపీలను అర్థం చేసుకోవడంలో అట్టర్ ఫ్లాప్… అసలు తన సన్నిహిత అనుచరుడు అమిత్ షా కూడా ఏనాడో తెలంగాణ బీజేపీని వదిలేసి, తూర్పు దిక్కుకు తిరిగి దణ్నం పెట్టాడనే సంగతి మోడీకి తెలియనట్టుంది…
Ads
అయ్యా, సారూ… 8 మంది ఎంపీలు, ఎనిమిది దిక్కులు… ఏ దిక్కుకూ మరో దిక్కుకు పడదు, కేడర్ దిక్కుతోచక బేర్‌మంటున్నారు… దిక్కుమాలిన రాజకీయం అర్థం గాక… బీజేపీయే దిక్కు అనుకున్న దిక్కుమాలిన సానుభూతిపరులు కూడా దిక్కులు చూస్తున్నారు…
అయ్యా, 8 ఎంపీల స్థానాల మాట అటుంచండి… మొన్నటి జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు దాసోహం అన్నది ఎవరు..? చాలా ఏళ్లుగా బీఆర్ఎస్ కోవర్టులుగా వ్యవహరిస్తున్న పెద్ద తలలు ఎవరివి..? ఎందుకు..? కేంద్ర ఇంటలిజెన్స్‌కు కూడా అర్థం గాక దిక్కుతోచడం లేదా..?
బీఆర్ఎస్‌లో విలీనం లేదా పొత్తు తప్ప తెలంగాణ బీజేపీకి దిక్కులేదు అని చిత్రీకరించడానికి జుబ్లీ హిల్స్ ఉపఎన్నికను చేజేతులా చేజార్చుకున్న సంగతి నీకు అర్థం కాదు… కాస్తో కూస్తో బండి సంజయ్ ప్రచారబరిలోకి దిగాక కదా, మేం కూడా బరిలో ఉన్నామనే సోయి బీజేపీ కేడర్‌కు కలిగింది…
ఇవన్నీ సరే గానీ అయ్యా, కనీసం ఏ ఇద్దరు తెలంగాణ ఎంపీల నడుమ సయోధ్య ఉందో చెప్పు, తెలంగాణను గెలిచి చూపిస్తాం అని బీజేపీ సానుభూతిపరులు సవాల్ చేస్తున్నారు… కమాన్, సవాల్‌కు సిద్ధమా..,

ఎస్, ఒవైసీ నీకు నచ్చడంలో సందేహం లేదు… దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా మైనారిటీ వోట్లు చీల్చడానికి, బీజేపీకి ఫాయిదా చేయడానికి రెడీగా ఉంటాడు కదా… కానీ పాపం మోడీ భాయ్, నువ్వు హైదరాబాద్ రాజకీయాలు తెలియక తప్పులో కాలేస్తున్నావు…
జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఒవైసీ అడుగులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పడ్డవని తెలుసా అసలు నీకు..? అసలు మజ్లిస్ పోటీలోనే లేదనే సంగతి తెలుసా..? అసలు సౌత్ పాలిటిక్స్ తెలియకుండా, అర్థం చేసుకోకుండా ఇంకెన్నిరోజులు ఈ అగచాట్లు..?
ఏ భాయ్= జెర దేఖ్‌కే ఛలో... యే తెలంగాణ హై...!! ఓ పింక్ దేవుడు నిన్ను బండబూతులు తిట్టి, నీ పార్టీ జాతీయ కార్యదర్శిని ఎత్తి బొక్కలో వేద్దామని ట్రై చేశాడు గుర్తుందా నీకు..!? ఐనాసరే, సిగ్గు చంపుకుని సాగిలపడదామా చెప్పు..!! పోనీ, పార్టీని పరాయి పాదాల మీద తాకట్టు పెడుతున్న పెద్దల తలలను ఉరితీయగలవా మోడీ సాబ్..?
Share this Article