మంత్రుల పోర్ట్‌ఫోలియోలకు సంబంధించి మోడీ పెద్ద కసరత్తేమీ చేయలేదు, ప్రయోగాలకూ పోలేదు… పేరుకు ఎవరు మంత్రయినా ప్రధాని కార్యాలయం నిశితంగా ఆయా మంత్రుల కార్యకలాపాలు, నిర్ణయాలు, ఫైళ్లను గమనిస్తూ ఉంటుంది… ఇతర నిఘాలూ ఉంటాయి… ఒకందుకు మంచిదే, గత పదేళ్లలో కుంభకోణాల మచ్చల్లేకుండా జాగ్రత్తపడటానికి దోహదపడింది… సరే, పొలిటికల్ ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి…
దాదాపు 12 మంది పాత మంత్రులవి పాత పోర్ట్‌ఫోలియోలే… నిర్మలా సీతారామన్‌కు మళ్లీ ఆర్తికశాఖ, నిజానికి ఆమె ఓ ఫెయిల్యూర్ మినిస్టర్ అని పేరు, ఐనా సరే, మళ్లీ ఆమెకే… బీజేపీ ఆర్థిక విధానాల్లో పెద్ద ప్రయోగాలు ఏమీ ఉండవు కాబట్టి ఆమె పనితీరులోనూ కొత్తదనం ఏమీ ఉండదు… ఎవరైనా మన్మోహన్‌సింగ్ వంటి ఆర్థిక నిపుణుల్ని వెతికి ఈ శాఖ అప్పగిస్తే బాగుండేది… గతంలో మన్మోహన్ కూడా అలా వచ్చినవాడే కదా…
మోడీ కూడా అలాంటి ప్రయోగాలు చేశాడు… అశ్విని వైష్ణవ్ మాజీ బ్యూరోక్రాటే… కీలకమైన రైల్వేలను అప్పగించాడు, సరే, ఆయన వృద్ధులు, జర్నలిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాడు, రైల్వేను కూడా ఓ ప్రజారవాణాగా గాకుండా ప్రైవేటు ఎంటిటీ అన్నట్టే చూస్తున్నాడు… కాకపోతే వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వంటి విషయాల్లో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తోంది…
Ads
సేమ్, జైశంకర్… తను విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి… పర్‌ఫెక్ట్ చాయిస్… పాత కేబినెట్‌లోకే విదేశాంగం అప్పగించారు, ఇప్పుడూ సేమ్… ఈ దిశలోనే ఆర్థికం మీద ఏదైనా ప్రయోగం చేయాల్సింది… హోం ఎలాగూ అమిత్ షా, ఊహించిందే, రక్షణ శాఖ రాజనాథ్ సింగ్, ఇదీ ఊహించిందే… ఐనా వీటి మీద కనిపించని పెత్తనం, నిర్ణయాధికారం అజిత్ ధోవల్‌ది ఉంటుందంటారు…
నితిన్ గడ్కరీ రోడ్లు, భవనాలు పాతదే… టోల్ వాయింపుల సిద్ధహస్తుడు… 100 రోజుల్లో 100 కిలోమీటర్ల రోడ్లు అని మొన్న ఏదో వార్త కనిపించింది… ఒక్కసారి తనను ఎవరైనా ఉప్పల్- ఘట్‌కేసర్ ఫ్లయిఓవర్ పనుల దగ్గరకు తీసుకొస్తే బాగుండు… ఈ ప్రాజెక్టు పెద్ద విషాదం, మచ్చ కేంద్ర ప్రభుత్వానికి…
కిషన్‌రెడ్డికి ఈసారి మాంచి ‘రెవిన్యూ’ వచ్చే మైన్స్, బొగ్గుగనుల శాఖ ఇచ్చాడు మోడీ, పర్లేదు… ఇండిపెండెంట్ సహాయ మంత్రులు, సహాయ మంత్రుల పోర్ట్‌ఫోలియోలు ఏమైనా సరే, దాదాపు ఇవన్నీ పొలిటికల్ అడ్జస్ట్‌మెంట్ పోస్టులే, పెద్దగా పనీ ఉండని ఛాంబర్లు… మోడీ బోయింగ్ 707 కేబినెట్‌లో అలా సీట్లలో కూర్చోవాలంతే…
బండి సంజయ్‌కు మొన్నమొన్నటిదాకా కిషన్‌రెడ్డి కూర్చున్న హోం సహాయ మంత్రి సీటు ఇచ్చారు… ఏదో గుర్తింపు, అంతే… ఐనా అమిత్ షా చూసే హోం మంత్రిత్వశాఖకు ఎవరి సహాయం దేనికి..? ఏదో ఫాలో అయిపోవడమే… రామ్మోహన్‌నాయుడికి సివిల్ ఏవియేషన్ శాఖ పర్లేదు, నిజానికి చురుకుదనం, సామర్థ్యం ఎక్కువే అని పేరు కాబట్టి ఇంకేదైనా పెద్ద పోర్ట్‌ఫోలియో ఇచ్చినా బాగుండేది… కుమారస్వామికి భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ ఇంట్రస్టింగ్…
శివసేనకు ఓ సహాయ మంత్రి పోస్టు పడేసి, అజిత్ పవార్ గ్రూపుకి అసలు ఏమీ ఇవ్వలేదు… ఇవ్వకపోయినా చేసేదేమీ లేదు… ఆ ఇద్దరితో మహారాష్ట్రలో బీజేపీకి వచ్చి పడిన ఫాయిదా లేదు… ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్సే… పంజాబ్‌లో ఓ నాయకుడు ఓడిపోయినా సరే మంత్రి పదవి ఇచ్చారు… పంజాబ్‌లో బీజేపీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం…
మంత్రి పదవులు, పోర్ట్‌ఫోలియోలకు సంబంధించి ఎన్డీయే మిత్రపక్షాల నుంచి ఒత్తిళ్లు, డిమాండ్లు చికాకు పెడతాయని అందరూ అనుకున్నా సరే, మోడీ చాలా జాగ్రత్తగా సంకీర్ణ ప్రభుత్వమే అయినా సరే, మిత్రపక్షాలకు 11, 12 మంత్రి పదవులతో సరిపెట్టాడు, కీలకమైన శాఖల్లో ఒక్కటీ ఇవ్వలేదు… ‘జాగ్రత్తపడ్డాడు’… ఎవరైనా ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే (అసలే ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు) ఆనక తను ఆ మరకల్ని, మచ్చల్ని మోయాల్సి ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేశాడు చాలావరకు…!!
Share this Article