పీవీ పాలనలో గొప్ప ఘటన హర్షద్ మెహతా స్కామ్
మన్మోహన్ హయాంలో ఘనకార్యం ఏపీ విభజన!
Ads
ప్రధానుల మ్యూజియంలో ‘రికార్డు చేసిన ’ మోదీ సర్కారు
––––––––––––––––––––––––––––––––––––
దిల్లీ, తీన్‌మూర్తిభవన్‌లో ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయం (మ్యూజియం)లో దేశ మూడో ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకూ 13 మంది మాజీ ప్రధానమంత్రుల విశేషాలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకూ నెహ్రూ కుటుంబం సొంత ఆస్తిలా కొనసాగిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో ఇతర మాజీ ప్రధానులకు చోటు కల్పించిన బీజేపీ సర్కారు మరోసారి తన చారిత్రక కర్తవ్యం నిర్వర్తించింది. బ్రిటిష్ వారి పాలనలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ (సుప్రీం కమాండర్) అధికార నివాసంగా కొనసాగిన తీన్ మూర్తి భవన్ ను స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ నెహ్రూ తన అధికార నివాసంగా మార్చేశారు.
త్రివిధ దళాల ఉమ్మడి అధిపతి అయిన సుప్రీం కమాండర్ పదవిని తర్వాత రద్దు చేసి, సైనిక తిరుగుబాటుకు ఆస్కారం లేకుండా చేశానని అనుకున్నారు పండిత్… 1964 మే 27న కన్నుమూసే వరకూ దాదాపు 16 ఏళ్లు అందులో నివాసం ఉన్నారు. అన్నేళ్లు తమ కుటుంబ పెద్ద ‘దేశాధినేత’ హోదాలో ఉన్న ఈ ఇంటిని ఆయన స్మృతికే అంకితం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాన్ని నెహ్రూ సంగ్రహాలయంగా తీర్చిదిద్దింది… ఈ సర్కారీ భవనంపై ‘భారత మొదటి పరివారం’ గుత్తాధిపత్యం తొలగించడానికి మోదీ ప్రభుత్వం ఈ తీన్ మూర్తి భవన్ లో మరో 13 మంది ప్రధానులకు కాస్త చోటు కల్పించే మిషతో నెహ్రూ సొంతాస్తిగా భావించే కేంద్ర సర్కారు భవనాన్ని ఇలా ‘జాతీయం’ చేసింది…
పీవీ ఘనత హర్షద్ మెహతా సెక్యూరిటీస్ కుంభకోణం అయితే, మన్మోహన్ చేసిన పని ఆంధ్రప్రదేశ్ విభజన!
–––––––––––––––––––––––––––––––
ఈ మాజీ పీఎంల మ్యూజియంలో మాజీ ప్రధానులు వాడిన వస్తువులతో పాటు వారి పాలనాకాలాల్లో విశేషాలు రాసి చూపిస్తున్నారు. కాంగ్రెస్ ఆరో ప్రధాని, మొదటి–చివరి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గారి హయాంలో దేశం మరువలేని పరిణామం–హర్షద్ మెహతా తెలివితేటలతో జరిగిన సెక్యూరిటీల స్కామ్ అని మ్యూజియం సందర్శించినోళ్లకు తెలుస్తుంది. అలాగే, కాంగ్రెస్ చివరి ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనాకాలంలోని ఘనకార్యాల జాబితాలో–తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మొదలై, మూడేళ్లలో మూడు కోట్ల తెలుగోళ్ల రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ విభజన అని ప్రధానుల సంగ్రహాలయంలో వివరించారు…
గురువారం దీని ప్రారంభ కార్యక్రమానికి– బీజేపీయేతర ప్రధానులైన చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ (బీజేపీ ఎంపీ), నరసింహారావు మనవడు ఎన్ వీ సుభాష్ (బీజేపీ నేత), చిన్న కూతురు సురభి వాణీదేవి (టీఆరెస్ ఎమ్మెల్సీ), చిన్న కొడుకు పీవీ ప్రభాకరరావు, ఇంకా ఇతర మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీని ఇతర మాజీ ప్రధానులకు కూడా స్థానం కల్సిస్తూ మార్చడాన్ని వ్యతిరేకించిన మన్మోహన్ అనారోగ్యం వల్ల రాలేదు.
తమ ‘కుటుంబ ఆస్తి’గా పరిగణించిన తీన్ మూర్తి భవన్ లో 13 మంది సాధారణ మాజీల బొమ్మలు, వారి విశేషాలకు చోటు దక్కడంతో నొచ్చుకున్న సోనియాగాంధీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండి అప్రకటిత నిరసన తెలిపారు. అవకాశమొచ్చినా ప్రధానమంత్రి పదవిని తను తీసుకోకపోవడం వల్ల ఒకప్పటి బ్రిటిష్ సుప్రీం కమాండర్ నివసించిన భవనం మోదీ శక్తియుక్తుల వల్ల తన పవిత్రత కోల్పోయిందనే సోనియా–రాహుల్–ప్రియాంక బాధను నేడు దేశంలో ఎవరు అర్ధం చేసుకుంటారు!? ఏదేమైనా నెహ్రూ తర్వాత అంతటి ప్రచారార్భాటంతో భారతాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ సుదీర్ఘ హయాంలో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందో…
Share this Article