సరిగ్గా రెండు వారాాల క్రితం… బాల్ ఠాక్రే కొడుకు ఉద్దవ్ ఠాక్రే శివసేన అధిపతి హోదాలో ఏకనాథ్ షిండే వర్గానికి అనర్హత నోటీసులు జారీచేయించాడు… ఇప్పుడు… అదే బాల్ ఠాక్రే మనమడు, అదే ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ఉల్టా తనే అనర్హత గండంలో చిక్కుకున్నాడు… రాజకీయాలు అంతే… ఏ పార్టీ వ్యవహారాలైనా ఓసారి గాడితప్పాయి అంటే, ఇలాగే రకరకాల మలుపులు తిరుగుతాయి… (ఒకరు ఓ అస్త్రాన్ని ప్రయోగిస్తే, అదే తిరిగి మన మీద దూసుకొస్తుంటే ఎలా ఉంటుంది… ఈ కథ అలాంటిదే…)
మహారాష్ట్ర రాజకీయాలు ఇంకాస్త చిక్కుముడిలా మారుతున్నాయి… ఒక ముడి మీద మరో ముడి చిక్కుపడుతూనే ఉంది… గవర్నర్ ఆదేశాల మేరకు ఏకనాథ్ షిండే వర్గం బలం నిరూపించుకుంది ఈరోజు జరిగిన బలపరీక్షలో… ఉద్దవ్ ఠాక్రే , తన డొల్ల అప్పాజీ సంజయ్ రౌత్ మొహాలు మాడిపోయేలా షిండేవర్గం ఏకంగా 164 వోట్లు సాధించింది… మెజారిటీకి అవసరమైన 144 వోట్లకు మించి… (పలు సాంకేతిక కారణాలతో నిజానికి మెజారిటీ మార్క్ ఇంకాస్త తక్కువే… అది వేరే లెక్క…)
ఇన్నాళ్లూ మహారాష్ట్రను ఉద్దరించిన ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కలిపి సాధించిన వోట్లు కేవలం 99 మాత్రమే… ఇక్కడ తాజా ఇంట్రస్టింగు కథ ఏమిటంటే… షిండే వర్గం కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్న సంగతి తెలుసు కదా… ఆయన షిండేను శివసేన అసెంబ్లీ పక్షనాయకుడిగా గుర్తించాడు… (అంతకుముందు ఠాక్రే తొలగించాడు కదా రెబల్ పేరిట…) షిండే వర్గం ఓ చీఫ్ విప్‌ను కూడా పెట్టేసింది… ఆయన్ని కూడా కొత్త స్పీకర్ గుర్తించాడు… ఇంకేముంది..? కొత్త చీఫ్ విప్ శివసేన ఎమ్మెల్యేందరూ షిండేకు అనుకూలంగా వోటేయాలని విప్ జారీ చేసేశాడు…
Ads
ఠాక్రే దగ్గర మిగిలిందే 13 మంది… అందులో ఇద్దరు తీరా బలనిరూపణ సమయానికి జైషిండే అంటూ ఇటు తిరిగిపోయారు… ఇక మిగిలింది 11 మంది… అందులో ఠాక్రే కొడుకు ఆదిత్య కూడా ఉన్నాడు… వాళ్లు విప్ ధిక్కరించి షిండేకు ప్రతికూలంగా వోట్లేశారు… సో, మీరంతా విప్ ఉల్లంఘించారు కాబట్టి మీపై అనర్హత వేటు వేస్తానంటోంది షిండే వర్గం… స్పీకర్ గనుక దీనికి సై అని అనర్హత వోటు వేస్తే, ఇంకా మహారాజకీయాలు రసకందాయంలో పడబోతున్నాయి…
అంతకుముందు షిండే వర్గం మీద అనర్హత అనే అంశం సుప్రీంకోర్టులో ఉంది… అది తేలకముందే, షిండేవర్గం ఒరిజినల్ శివసేన వర్గంపై అనర్హత వేటు వేయొచ్చా లేదా అనే డైలమా కాస్త ఆపుతూ ఉన్నట్టుంది… నేను స్పీకర్‌ను, నాదే నిర్ణయాధికారం అని ఒకసారి స్పీకర్ గనుక ఆదిత్య ఠాక్రే సహా 11 మందిని అనర్హులని ప్రకటిస్తే, రాజకీయాలు ఇంకాస్త సంక్లిష్టం అవుతాయి… (ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్సీ కాబట్టి ఈ బలనిరూపణ చిక్కుముడిలో ఇరుక్కోలేదు… ఐనా ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని ప్రకటించాడు…)
స్పీకర్ ఆదిత్య ఠాక్రేపై అనర్హత వేటు గనుక వేస్తే… సుప్రీంకోర్టు అంగీకరించకపోతే… విరుద్ధంగా తీర్పు చెబితే… అప్పుడిక స్పీకర్ విచక్షణ, నిర్ణయాధికార పరిధిలోకి న్యాయవ్యవస్థ ఎంటరవుతోందనే ఇంకో ఇష్యూ తలెత్తుతుంది… అది మరో రగడ… ఒకవేళ షిండేవర్గం గనుక రాష్ట్ర, జిల్లా కమిటీల ఆమోదం తీసుకుని, తమదే అసలైన శివసేన అని క్లెయిమ్ చేసుకుని, గెలిస్తే మాత్రం అది మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది… (ఎన్టీయార్, చంద్రబాబు, తెలుగుదేశం కబ్జా కథ తెలుసు కదా… సేమ్…)
సరే, ఏదయితేనేం… బలనిరూపణ అయిపోయింది… ప్రభుత్వానికి ఢోకా లేదు… ప్రస్తుతానికి ఠాక్రేవర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ షిండే మీద మళ్లీ అవిశ్వాసం పెట్టేంత సీన్ లేదు… అప్పనంగా వస్తే కుర్చీలు పంచుకోవడమే తప్ప, కొత్త నాటకానికి తెరతీసి, ఠాక్రే వెంట నిలబడేంత ఆసక్తి కూడా కాంగ్రెస్, ఎన్సీపీలకు లేవు… ఇప్పుడిక జనానికీ ఆసక్తి లేదు… రాజకీయ వ్యవహారాలపై ఇంట్రస్టు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ అనర్హత వేట్లు, ఆ ఎత్తుగడల మీద ఆసక్తి… అంతే…
Share this Article