Gr Maharshi…. (మొత్తం ఈ విషయంపై 17 వ్యాసాలు రాబోయే పుస్తకంలో….) సినిమాకి కథ రాయడం ఎలా?
సినిమాకి కథ రాయడం ఈజీ. ఎందుకంటే కథ వుండదు కాబట్టి. ఒకవేళ కథ చెప్పాలనుకున్నా నిర్మాతలు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ, బిల్డప్ సీన్‌లు ముందు చెప్పి, తర్వాత కథ చెప్పాలి. అంటే రైల్వే బోగీలో ఫైట్ పెడితే, హీరో దెబ్బలకి రౌడీలు బోగీ ఇనుప తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. (రజనీకాంత్ లింగాలో ఈ సీన్ వుంది.. ఆయన కొడితే బోగీ తలుపే వూడిపోతుంది. ఇంత అధ్వాన్నంగా బోగీలని తయారు చేస్తున్న రైల్వేశాఖపై విచారణ జరిపించాలి. రజనీ రాజకీయాల్లో కూడా ఇలాగే తంతాడని అభిమానులు భ్రమపడ్డారు. పాలిటిక్స్‌లో గ్రాఫిక్స్ వుండవు. ఇది తెలిసే రజనీ తప్పుకున్నాడు.
తెలుగు సినిమా లేదా తమిళ సినిమాలకి అదీ కాదంటే ఇండియన్ సినిమాకి కథ రాయాలంటే సైన్స్ జ్ఞానం వుండకూడదు. ఫిజిక్స్ అసలు తెలీకూడదు. ఎందుకంటే హీరో దైవాంశ స్వరూపుడు కాబట్టి. భౌతికశాస్త్రం ప్రకారం 80 కిలోల మనిషి గాల్లో ఎగిరి పడాలంటే , అది గొరిల్లా లాంటి జంతువుకి కూడా సరిగా సాధ్యం కాదు. మన హీరో కొడితే ఇద్దరు ముగ్గురు Sky Diving చేయడమే కాకుండా ఒక్కోసారి ఎలెక్ట్రిక్ పోల్ ఎత్తు ఎగురుతారు.
ఈ రూల్స్ మాకెందుకు? మేం సినిమా తీసేది మాస్ కోసం, మన దేశంలో సైంటిస్ట్‌లకే సైన్స్ అర్థం కాక, రాకెట్ లాంచింగ్‌ని అర్చనలు పూజలు చేయించి మరీ చేస్తున్నారు. జనంకి ఏది నచ్చితే అదే మంచి సినిమా, మాకు డబ్బులొస్తే అది హిట్ అని నిర్మాతలు దర్శకులు అంటారు.
మళయాల సినిమాల నుంచి బోలెడు డబ్బులు పోసి కథలు కొంటున్నాం. మాకు నేటివిటి వుండే కథలు చెప్పండి అని కొందరు నిర్మాతలు అడుగుతూ వుంటారు. అడిగారు కదాని నువ్వు రైతు కథ చెప్పడానికి ప్రయత్నిస్తే రైతు వీధుల్లో వుంటే ప్రభుత్వమే పట్టించుకోవడం లేదు. ఇక ఆ కథలు తీస్తే జనం ఏమి చూస్తారని అంటారు.
వెనుకటి రోజుల్లో రచయితలకి కొంచెం వెసులుబాటు వుండేది. NTR సినిమా అయితే మారువేషం, ANR అయితే అపార్థం కలిపితే వర్కవుటయ్యేది. NTR కనీసం వంద సినిమాల్లో మారువేషాలు వేసుంటారు. జనం చూసుంటారు. NTR ఎన్ని వేషాలు వేసినా మనం గుర్తు పడతాం. విలన్లు గుర్తు పట్టకపోతే అది వాళ్ల ఖర్మ.
ANR హీరోయిన్‌తో గొడవ పడడం, నాలుగు ప్రేమ గీతాలు , రెండు విరహ గీతాలు. కథ ఎవడికి కావాలి? జనం మెచ్చింది మనం తీయాలా? మనం వేసేది జనం చూడాలా? ఇది ఎప్పుడూ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే జనానికి ఏది నచ్చుతుందో నూరు శాతం ఎవరికీ తెలీదు.
Share this Article
Ads