మొన్నామధ్య హీరోయిన్ సాయిపల్లవిని అల్లు అరవింద్ ఏదో స్టూడియోలో సత్కరించాడని వార్త చదివాను, ఫోటో చూశాను… ఎక్కువసార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులు పొందినందుకు అభినందిస్తూ ఆ సత్కారం… గుడ్…
అప్పుడప్పుడూ తండేల్ సినిమా వార్తల్లో తప్ప పెద్దగా తెలుగు సినిమా వార్తల్లో వినిపించడం లేదు ఆమె పేరు చాన్నాళ్లుగా… అత్యంత భారీ ఖర్చుతో తీయబడుతున్న హిందీ రామాయణం ప్రాజెక్టులో సీత పాత్ర, మరో హిందీ సినిమా చేస్తోంది కదా, తెలుగు సినిమా సర్కిళ్లలో తక్కువగా కనిపిస్తోంది ఆమె…
ఎక్కువసార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అనేది ఘనతే… ఈ ఆరు అవార్డులు ఇవీ…
Ads
ప్రేమమ్ సినిమా – ఉత్తమ నటి (డెబ్యూ)
ఫిదా – ఉత్తమ నటి
లవ్ స్టోరీ – ఉత్తమ నటి
శ్యామ్ సింగరాయ్ – ఉత్తమ నటి (క్రిటిక్స్)
గార్గి – ఉత్తమ నటి
విరాటపర్వం – ఉత్తమ నటి (క్రిటిక్స్)
అసలు సౌత్ ఇండియాలో ఎక్కువ ఫిలిమ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్న తారలు ఎవరు అని చెక్ చేస్తే… నయనతార, త్రిష చాలా ఏళ్లుగా ఫీల్డులో ఉన్నారు… వాళ్ల సినిమాలతో పోలిస్తే సాయిపల్లవి సినిమా కెరీర్ వయస్సు తక్కువ, తన వయస్సు తక్కువ, తన సినిమాల సంఖ్య కూడా చాలా తక్కువ…
నయనతార 20 ఏళ్లలో 14 సార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులకు నామినేటైంది… కానీ గెలుచుకున్నది అయిదు మాత్రమే… అలాగే త్రిష నయనతారకన్నా ముందు ఫీల్డ్‌కు వచ్చింది… 10 సార్లు మాత్రమే నామినేటయితే తను కూడా గెలుచుకున్నది అయిదు ఫిలిమ్ ఫేర్లు మాత్రమే… సాయిపల్లవి కెరీర్ వయస్సు పదేళ్లు మాత్రమే…
సరే, సౌత్ ఇండియా వరకూ ఇవీ వివరాలు… మరి బాలీవుడ్ నుంచి ఇన్నేళ్ల ఇండస్ట్రీ చరిత్రలో ఎవరైనా ఆరుసార్లు ఫిలిమ్ ఫేర్లు కొట్టారా అని చెక్ చేస్తే అక్కడా ఎవరూ లేరని సమాచారం…
నూతన్, కాజోల్, ఆలియా భట్ అయిదేసిసార్లు గెలుచుకున్నారు… రాబోయే రోజుల్లో కూడా సాయిపల్లవి, ఆలియా భట్ నడుమే పోటీ ఉండొచ్చు బహుశా… మీనాకుమారి, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ నాలుగేసిసార్లు విజేతలు కాగా, వైజయంతిమాల, జయాబచ్చన్ , షబానా ఆజ్మీ మూడేసిసార్లు…
వహీదా రెహమాన్, డింపుల్ కపాడియా, రేఖ, శ్రీదేవి, కరిష్మా కపూర్, ఐశ్వర్యా రాయ్, రాణి ముఖర్జీ, దీపిక పడుకోన్ జస్ట్ రెండేసిసార్లు విజేతలు… వీరిలో అందరికన్నా ఎక్కువసార్లు, అంటే 14 సార్లు నామినేటైంది మాధురీ దీక్షిత్… సో, ఈ లెక్కల ప్రకారం చూస్తే మాథమెటికల్‌గా సాయిపల్లవిది ఘనతే… ఆమె అర్హురాలే…
1954 నుంచే ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి… మొదట తమిళం, తెలుగుతో మొదలై, తరువాత అన్ని భాషల చిత్రాలకూ ప్రకటిస్తున్నారు… రకరకాల కేటగిరీల్లో ఇస్తారు… అన్నేళ్ల నుంచి అవార్డుల చరిత్ర ఉంటే… ఒకప్పటి మేటి నటి స్మితా పాటిల్ పేరు, జయప్రద, జయసుధల పేర్లు జాబితాల్లో కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యమే… (Subject to correction)…
ప్రభుత్వం ఇచ్చే ప్రాంతీయ, జాతీయ అవార్డులకన్నా ఫిలిమ్ ఫేర్ అవార్డులకు కొంత విలువ ఎక్కువ… అఫ్‌కోర్స్, ఈమధ్య వాటికి ఎంపికలు కూడా బాగుండటం లేదనే విమర్శ కూడా ఉంది… సో, ఏ కోణంలో చూసినా ఆరు అవార్డులు అనే సంఖ్య ఖచ్చితంగా సాయిపల్లవికి ఓ కీర్తికిరీటమే..!
Share this Article