ఇదుగో లోకసభకు పోటీచేసిన అభ్యర్థుల్లో అందరికన్నా ధనికుడు… టాప్ టెన్… వీళ్లపై అధికంగా కేసులున్నాయి… ఇదుగో వీళ్ల విద్యార్హతలు అంటూ రకరకాల వార్తలు వస్తుంటాయి కదా… వృత్తులతో సహా… కానీ ఎప్పుడైనా నిరుపేదల గురించి చెప్పుకున్నామా..? అసలు ఎవరైనా సరే పోటీ పడగలగడం కదా మన డెమోక్రసీ బ్యూటీనెస్… కాకపోతే గెలుస్తారా, గెలవనిస్తారా అనేది వేరే సంగతి…
పార్టీల దన్ను ఉన్న నిరుపేదలు చాలామంది గెలిచారు… అవీ చెప్పుకున్నాం కూడా… మన ప్రధాని ఒకప్పుడు చాయ్‌వాలా కదా… ఇప్పుడంటే కోట్ల రూపాయలు జీతం రూపేణా సమకూరి ఉండొచ్చు గానీ, మొదట్లో అఫిడవిట్లలోనూ పెద్దగా ఏమీ చూపించలేదు కదా… మనం మరో చాయ్‌వాలా గురించీ చెప్పుకోవాలి…
ఈ చాయ్‌వాలా అభ్యర్థికి ఓ అరుదైన రికార్డు ఉంది.. గత లోకసభ ఎన్నికల్లో నిలబడిన వేలాది మంది అభ్యర్థుల్లో ఈమె అందరికన్నా పేద… కటిక పేద, నిరుపేద… ఆమె అఫిడవిట్ అదే చెబుతోంది… ఆమెఉత్కళ్ సమాజ్ నుంచి నిలబడింది భానుమతి దాస్…
Ads
భర్త టీకొట్టు… చాయ్ వాలా… సొంత ఇల్లు లేదు, వాహనం లేదు, తన చేతిలో 500, భర్త చేతిలో 1000… ఏ ఆస్తులూ లేవు, కేసుల్లేవు… సింపుల్… ఆమె ఆస్తి మొత్తం విలువ 1500 రూపాయలు మాత్రమే… గెలిచిందా..? లేదు, అలాంటోళ్లను మనం గెలనివ్వం కదా… 677 వోట్లు వచ్చాయి… పది వరకూ చదివింది…
పంజాబ్‌లో జనసేవ డ్రైవర్ పార్టీ అభ్యర్థి పేరు రాజీవ్ కుమార్ మెహ్రా… తను డ్రైవర్, భార్య గృహిణి… ఐదు వరకూ చదివాడు… నామినేషన్ వేసే సమయానికి తన చేతిలో 1000, భార్య చేతిలో 1000 రూపాయలున్నయ్… తన పేరిట బ్యాంకులో 500, భార్య ఖాతాలో 1000 రూపాయలున్నయ్… అంతే… మొత్తం ఆస్తుల విలువ 3500… తన అఫిడవిట్ ప్రకారం ఇల్లు లేదు, వాహనాల్లేవు… 1518 వోట్లు వచ్చాయి…
ఇక మూడో ప్లేసు… అనగా ఆస్తుల్లో కింద నుంచి… పేరు బలరాం మండల్… వెస్ట్ బెంగాల్… జాదవ్‌పూర్ నియోజకవర్గం… గ్రాడ్యుయేట్… రోజు కూలీ… నామినేషన్ వేసే సమయానికి చేతిలో 500 ఉన్నాయి… బ్యాంకులో 2000 రూపాయలు, అంతే ఇక ఏమీ లేవు… లభించిన వోట్లు ఎన్ని అంటారా..? 2835 వోట్లు… స్వతంత్రుడు…
అదే రాష్ట్రంలో అభ్యర్థిగా నిలబడిన స్వపన్ దాస్ నియోజకవర్గం కోల్‌కత్తా ఉత్తర్… సోషల్ వర్కర్… నిరక్షరాస్యుడు.,. బ్యాంకులో 700, చేతిలో 2000 మాత్రమే ఉన్నట్టు చూపించాడు… ఇల్లూ, ముంగిలి, వాహనం అన్నీ జీరో… వచ్చిన వోట్లు 1166… స్వతంత్రుడు… ఇదే పేరుతో కోల్‌కత్తా దక్షిణ నియోజకవర్గంలో ఒకాయన ఉన్నాడు… ఆయన లీస్ట్ టెన్ లిస్టులో లేడు…
లీస్ట్ ఫైవ్ గురించి చెప్పుకుని ఇక వదిలేద్దాం… ఈయన పేరు కనియా లాల్ (డాక్టర్ కిషన్ కుమార్)… పంజాబ్‌లోని లూథియానా నుంచి పోటీచేశాడు… పోస్ట్ గ్రాడ్యుయేట్… స్వతంత్రుడు… గత ఏడాది 4.5 లక్షలకు ఐటీ రిటర్న్ ఇచ్చాడు… నామినేషన్ సమయానికి చేతిలో 1100, భార్య దగ్గర 1000, బ్యాంకులో 1000 ఉన్నట్టు చూపించాడు… స్థిరాస్తులు, చరాస్తులు, కేసులు గట్రా ఏమీ లేవు… 820 వోట్లు వచ్చాయి…
అబ్బే, ఐనా అఫిడవిట్లలో చూపేవన్నీ వాస్తవాలా..? ఏవో చూపిస్తారు అంటారా..? అది ధనిక అభ్యర్థుల గురించయితే వోకే… బినామీ ఆస్తులు, ఇతర కుటుంబసభ్యుల పేర్లతో ఆస్తులు గట్రా బోలెడు ఉంటాయి… ఓన్లీ ఐటీ లెక్కల్లో భార్యాభర్తల పేర్లపై ఉండే ఆస్తులే చూపిస్తారు… నిజంగా పేదలకు అలా చూపించాల్సిన పనేముంది..? నామినేషన్ ఫీజుకే వాళ్లనూ వీళ్లనూ ప్రాథేయపడతారు… ప్రచారమా..? ఎంత మాట, ఎంత మాట..!!
Share this Article