టీవీలోగానీ, సినిమా తెరపై గానీ… కనిపించే మేకప్పు మొహాల మెరుపుల వెనుక ఎన్నెన్నో నిజజీవిత బాధావీచికలుంటయ్… భరించలేని వేదనలుంటయ్… వేధింపులు, వివక్షాపూరిత సాధింపులూ ఉంటయ్… పొట్ట తిప్పల కోసం లేడీ ఆర్టిస్టులు అన్నీ భరిస్తుంటారు… తప్పదు… మేకప్ మొహాలతో నవ్వాలి, నవ్వించాలి, వినోదపరచాలి… కార్వాన్‌లోకి వెళ్లాక గుక్కపట్టుకుని ఏడవాలి… చివరకు అదీ కరువుతీరా ఏడవటానికి లేదు.. మేకప్ చెరిగిపోతుంది… అలా కన్నీళ్లను పేపర్ న్యాప్‌కిన్‌తో అద్దాలి, అంతే…
శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ చాలామందికి కనెక్టయింది… జబర్దస్త్ కొత్త యాంకర్‌గా అనసూయ ప్లేసులో వచ్చిన కన్నడ తార సౌమ్యారావు అందగత్తె… మంచి ఈజ్ ఉంది… రష్మి, అనసూయ, శ్రీముఖి తరహాలో యాంకరింగు చేతగాకపోవచ్చు కానీ ఉన్నంతలో బెటరే… తనకు తెలుగు సరిగ్గా రాదు, ఐనా మేనేజ్ చేస్తుంది… రష్మి ఇన్నేళ్లుగా తెలుగు రాకపోయినా చేయడం లేదా ఏం..? సౌమ్యారావు కూడా చేయగలదు… పైగా చూడబుల్ మొహం, డాన్సాడగలదు… సో, చల్తా…
ఐతే వచ్చిన కొత్తలోనే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ‘సౌమ్యా అయితేనేం, మనకు సేమ్యా కావల్సిందేగా’ అంటూ వెగటు భాషలో పంచులు మొదలుపెట్టారు… ప్రతిసారీ ఆమె మీదే కన్నేసినట్టుగా హైపర్ ఆది మాటలు, చేష్టలు విసుగు తెప్పిస్తుంటాయి… మల్లెమాల కంపెనీ మొత్తం హైపర్ ఆది గ్రిప్‌లోకి వెళ్లింది కదా, ఇక తను ఆడింది ఆట, పాడింది పాట… సౌమ్యారావు కూడా తప్పనిసరై భరిస్తున్నట్టుగా కనిపించేది… జబర్దస్త్ ఎలాగూ మానేశాడు కదా… ఇక వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్ ప్లేసు భర్తీ చేయాాలని తాపత్రయం…
Ads
రాకపోయినా స్టెప్పులేస్తాడు… పాటలు పాడతాడు… మొనాటనీ వచ్చి విసుగెత్తిస్తున్న పంచులు ఏవో వేస్తుంటాడు… శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ కూడా ఆది ఆలోచనలకు అనుగుణంగానే ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్టున్నాడు… సౌమ్యారావుతో ఏకంగా ఆది డాన్స్ పెట్టేశాడు… ఆమె అంటీముట్టనట్టు కదులుతుంటే, ఆది తాకీతాకనట్టుగా డాన్స్… కెమిస్ట్రీకి పూర్తి భిన్నంగా… విచిత్రంగా, నవ్వొచ్చేలా సాగింది… కానీ తరువాత ఆది ఆమెకు ఓ ఫోటోఫ్రేమ్ కానుకగా ఇచ్చాడు…
అందులో సౌమ్య మదర్ ఉంది, సౌమ్య ఉంది… ఆమె ఏడుస్తూ తన కథ చెప్పుకుంది… చిన్నప్పటి నుంచీ పేదరికం… అక్కడిక్కడా అడుక్కువచ్చి అన్నం పెట్టేది అమ్మ, అన్నీ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు, బట్టలు… అక్కడిక్కడా చందాలు తెచ్చుకుని సౌమ్య చదువుకుంది… ఎప్పుడూ కడుపు నిండా తినని సిట్యుయేషన్‌లో బతికింది… ఈ స్థితిలో ఆమె అమ్మకు బ్రెయిన్ కేన్సర్ అని తేలింది… ఆమె క్రమేపీ ఓ ఎండిపోయిన కట్టెలా మారింది, ఎవరినీ గుర్తుపట్టని స్థితి… దాాదాపు జీవచ్చవంలా ఉన్న ఆమెకు సౌమ్య మూణ్నాలుగేళ్లు సేవ చేసింది… మంచమ్మీదే అన్నీ… చివరకు ఆమె వెళ్లిపోయింది…
‘‘నాకిప్పుడు డబ్బుంది, కారుంది, కానీ అమ్మ లేదు, చివరకు నన్ను కూడా గుర్తుపట్టేది కాదు, నన్ను అమ్మా అని పిలిచేది… నాకు ఇప్పుడు రెండే కోరికలు.., మా అమ్మ అనుభవించిన కష్టం, బాధ ఇంకెవరికీ రావొద్దు, మా అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలి…’’ సున్నిత హృదయులైతే వెంటనే కన్నీళ్లు వచ్చేలా ఆమె తన కథను హృదయవిదారకంగా వినిపించింది… డ్రామా కంపెనీ పిచ్చి పిచ్చి అల్లరి చిల్లర వినోదాంశాల నడుమ ఇది భిన్నంగా కనెక్టింగుగా ఉంది… సౌమ్యారావు మీద అక్కడో ఇక్కడో ఉన్న కాసింత నెగెటివిటీ కూడా ఈ ఎపిసోడ్ తరువాత దూరమైనట్టే… తన తల్లికి ఆమె చేసిన సేవ నిజంగా గ్రేట్… అమ్మే కదా, ఆమె కూతురే కాబట్టి చేసింది, అందులో వింత ఏముంది అనడక్కండి… ఎందరు కూతుళ్లు అమ్మల మీద అంత దయ చూపించగలరు..? ఐనా స్క్రిప్టులు కాదు, మన సొంత జీవితాలను మించిన మెలోడ్రామా, ట్రాజెడీ కల్పిత కథల్లో ఎక్కడుంటుంది..?!
Share this Article