.
Paresh Turlapati …….. సినిమాలు చూసి జనం చెడిపోతారా? సోషల్ మీడియాలో తరుచూ కనిపించే ప్రశ్న ఇది.
ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని సమాధానం చెప్పలేము. అలాగే కాదూ అని కూడా సమాధానం చెప్పలేమ్.
Ads
అయితే అంతో ఇంతో ప్రభావం మాత్రం ఉంటుందని నాకనిపిస్తుంది. ముఖ్యంగా క్రైమ్ సినిమాలు.. యూ ట్యూబ్ వీడియోల వల్ల….
సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి వెయ్యి మంది బాగుపడితే ఆనందమే కానీ ఒక్కడు చెడిపోయినా అది సమాజం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమాల వల్ల యెటువంటి దుష్ప్రభావాలు.. తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే పటిష్ఠమైన సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు
ముఖ్యంగా వాళ్ల పనేంటంటే మితిమీరిన హింస కానీ, మితిమీరిన అశ్లీలం కానీ ఉంటే కత్తెర వేయడం. కానీ ఏంచేతనో ఈ మధ్య కాలంలో సెన్సార్ కత్తెరకు పదును తగ్గినట్టు అనిపిస్తుంది.
మా చిన్నపుడు ఎన్టీయార్.. శ్రీదేవిని ముద్దు పెట్టుకోవాలంటే మధ్యలో ఓ పూల గుత్తి అడ్డం పెట్టి ఏవీ చూడకుండా చేసేవాడు…
మరి ఇప్పుడో, డైరెక్టర్ కట్ చెప్పినా ఒకళ్ళనోట్లో ఒకళ్ళు నోళ్ళు బెట్టుకుని రీళ్ళకు రీళ్ళు తాగేస్తున్నారు. ఖర్మ ఫ్యామిలీ సినిమాల్లో కూడా అవి చూడాల్సి వస్తుంది.
ఏ సినిమా చూసినా గ్యాలన్ల కొద్దీ రక్తాలు కారుతున్నాయి.. ఏ వెబ్ సిరీస్ చూసినా మితిమీరిన అశ్లీల సన్నివేశాలు ఉంటున్నాయి. అసలే హాయిగా ఫ్యామిలీతో ధియేటర్‌కెళ్ళి సినిమాలు చూసే రోజులు పోయాయి.
దానికి తోడు థియేటర్‌కు కూడా వెళ్ళే పనిలేకుండా ఇంట్లోనే కూర్చుని బూతు సినిమాలు చూసే ఫెసిలిటీ ఓటీటీలు కల్పిస్తున్నాయి. ఇగ యూతు బాగుపడేదేముంటుంది నా తలకాయ్
ఇళ్లల్లో ఓటీటీ ఆన్ చేద్దామంటే ఎప్పుడు ఏ సన్నివేశం వస్తుందో తెలిసి చావదు. అయ్యా సెన్సారూ జర మేల్కొని మీ కత్తెరలకు ఓటీటీ కంటెంట్ మీదా పదును బెట్టండి
ఆ మధ్య హైదరాబాద్ లో కొంతమంది మైనర్ పిల్లలు ఒక బాలికను కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా అని యూ ట్యూబ్ లో క్రైమ్ వీడియోలను సెర్చ్ చేశారట
కొన్నేళ్ల క్రితం ఉత్తరాదిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితులను పోలీసులు ఇంటరాగేట్ చేస్తే ఓ హిందీ సినిమాలో సన్నివేశాలు చెప్పారట. ఇది అప్పట్లో పేపర్లలో కూడా వచ్చింది (సినిమా పేరు గుర్తుకు రావడం లేదు)
అలాగే లేటెస్టుగా మీర్‌పేటలో ఒక వ్యక్తి భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆనక ఎముకలను పౌడర్ చేసి చెరువులో కలిపేసి ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్ లో భార్య మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు…
దుర్మార్గానికి పరాకాష్ట ఇది
అతగాడి హిస్టరీ సెర్చ్ చేస్తే హత్య చేసి తప్పించుకోవడం ఎలా అని చాలా యూట్యూబ్ ఛానళ్ళు సెర్చ్ చేసినట్టు తెలిసిందట. ఈ క్రూర నేరం ఈ మధ్య విడుదలైన మళయాళం సినిమా సూక్ష్మదర్శినిలో సన్నివేశాలను పోలి ఉందని కొందరు అంటున్నారు
ఆ మూవీలో కూడా విలన్ అమ్మాయిలను ముక్కలుముక్కలుగా నరికి సంచుల్లో ప్యాక్ చేస్తాడు. ఇక ఇంకో మళయాళం మూవీ బోగన్ విల్లెలో కూడా విలన్ అమ్మాయిలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేస్తాడు
కేవలం ఈ సినిమాలు చూడటం వల్లనే అతడు ఈ హత్యలు చేశాడని నేను అనడం లేదు. హత్యకు అసలు కారణాలు అనేకం ఉండొచ్చు గాక కానీ హత్య చేయడంలో కొంత ప్రేరణ పొంది ఆ నాలెడ్జి ని ఇక్కడ ప్రయోగించినట్టు తెలుస్తుంది.
సరే సినిమాలు.. యూ ట్యూబ్‌లు చూసి పట్టుబడని రీతిలో నేరం చేసినా చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యం అని అతగాడికి తెలీదనుకుంటా…
అపరాధ పరిశోధనలో పోలీసులు ఎవరైతే కంప్లయింట్ ఇస్తారో ముందు వాళ్ళనే అనుమానిస్తారని ఇతగాడికి అస్సలు తెలిసినట్టు లేదు… అలా బుక్కై పోయాడు !
Share this Article