భాగ్యశ్రీ బోర్సె మాత్రమే బాగుంది… అనే శీర్షిక చూసి మరి రవితేజ మాటేమిటి అనడక్కండి… రవితేజకు ప్రత్యేకంగా ఎవరూ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పనిలేదు… ఈ వయస్సులోనూ ఆ ఎనర్జీ, ఆ ఈజ్ తనకు బలం… తన అన్ని సినిమాల్లాగే తనే ఈ సినిమాకు బలం, తనే మోశాడు, ఐతే… సగటు రొటీన్ తెలుగు ఫార్ములా మాస్ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా రవితేజ సినిమాల జాబితాలో ఒకటి మాత్రమే… పెద్ద విశేషాల్లేవు, మెరుపుల్లేవ్… జస్ట్, ఒక తెలుగు సినిమా…
నిజానికి హిందీలో వచ్చిన రైడ్ దీనికి ఒరిజినల్… అది సీరియస్ సినిమా… ఐటీ రైడ్స్ నేపథ్యంగా సబ్జెక్టును సీరియస్‌గానే డీల్ చేశారు… అజయ్ దేవగణ్ బాగా చేశాడు, సూపర్ హిట్ మూవీ… రియల్ సంఘటనల ఆధారంగా రచించబడిన కథ అది… కానీ మిస్టర్ బచ్చన్ పేరిట దర్శకుడు హరీష్ శంకర్ దీన్ని రీమేక్ చేసే క్రమంలో… జస్ట్, ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ సినిమాగా మార్చాలని అనుకున్నాడు… తనదైన స్టయిల్ మార్పులు చేశాడు… అన్నీ ఎలాంటివి…? మాస్ వాసనలుండేలా… ఓ నాలుగు ఫైట్లు, ఓ నాలుగు పాటలు, ఓ నాలుగు జోకులు… బస్, ఖతం, సినిమా అయిపోయింది…
రవితేజ నుంచి భిన్నమైన పాత్రల్ని ఆశించే కాలం ఎప్పుడో పోయింది… నిజానికి తను మంచి నటుడు, కానీ కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని ఆ నటుడు ఎటో వెళ్లిపోయాడు ఎప్పుడో… అవే కథలు, అవే స్టెప్పులు, అవే ఫైట్లు, అదే బాడీ లాంగ్వేజీ… మొనాటనీ… మరి హరీష్ శంకర్ ఏం కొత్తగా చూపిస్తున్నట్టు ప్రేక్షకులకు..? ఏమీ లేదు… భాగ్యశ్రీ బోర్సె అనే ఓ కొత్త అందాన్ని పరిచయం చేశాడు… అంతే…
Ads
అవును, అందంగా ఉంది, నాజూగ్గా ఆకర్షణీయంగా ఉంది… నటన కూడా పర్లేదు, కాకపోతే సొంత డబ్బింగ్ అంతగా నప్పలేదు, ఆ ప్రయాస అనవసరం… మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటే నాలుగు రోజులు తెలుగులోనే ఉండగలదు… శ్రీలీలలాగా అడ్డదిడ్డం పాత్రలు ఎంచుకుంటే ఈమె కెరీర్ కూడా నాలుగునాళ్లే… పాటల్లో కూడా రవితేజ సరసన దీటుగా చేసింది… మిక్కీ జే మేయర్ పాటల్లో మోత ఎక్కువ, డబడబా… మెలొడీ జాడే లేదు…
ఎందుకో తెలియదు గానీ… పలు టీవీ షోలకు ప్రమోషన్ కోసం వెళ్లినప్పుడు హరీష్ శంకర్ వెంట రవితేజ లేడు… కొన్నిచోట్లకు భాగ్యశ్రీతో మాత్రమే వెళ్లాడు హరీష్ శంకర్… రవితేజకు కూడా సినిమా నాసిరకం ఔట్‌పుట్ మీద క్లారిటీ వచ్చేసి, అవాయిడ్ చేశాడా..? ఇక సినిమాలో విలన్ గా అంతటి జగపతిబాబును పెట్టుకున్నా సరే, ఆ రేంజ్ ‘ఘర్షణ’ రవితేజ, జగపతిబాబు నడుమ కనిపించదు… ఏదో ఓ అల్లాటప్పా విలన్, ఇరగదీసే హీరో… అదే ముతక వాసన…
పేలవమైన కామెడీ ట్రాకులు… హిందీ రైడ్ చూసిన ప్రేక్షకులకైతే ఈ మిస్టర్ బచ్చన్ తెగ విసిగిస్తాడు… అది చూడని ప్రేక్షకులకు జస్ట్, మరో రవితేజ సినిమా అనిపిస్తుంది… అంతే… అక్కడక్కడా లాజిక్కులు గట్రా ఏమీ కనిపించవు, పూర్ క్లైమాక్స్… హిందీ సినిమాలతో పరిచయం, ఆసక్తి ఉన్న ప్రేక్షకులకైతే ఆ హిందీ పాటల గోల కాస్త ఎక్కొచ్చునేమో గానీ… ప్యూర్ తెలుగు ప్రేక్షకులకు అది గోలగోలగానే ఉంది… ఓ మిత్రుడు చెప్పినట్టు… ‘‘హరీష్ శంకర్ దురదృష్టం మీద నా నమ్మకం వమ్ముకాలేదు…’’
Share this Article