‘‘అవసరమైతే’’…. ఈ పదం రాజకీయాల్లో దుర్మార్గమైనది… ఆ అవసరాన్ని ఎవరు నిర్దేశించాలి..? తప్పించుకోవడానికి అత్యంత అనువైన పదం ఇది… ఎటంటే అటు మార్చుకోగల ఫ్లెక్సిబులిటీ ఉన్న పదం… అమెరికా దాకా వెళ్లిన రేవంతుడు ఏమన్నాడు..? ‘అవసరమైతే’ సీతక్కను సీఎం చేస్తాం అన్నాడు… అంటే సీఎం అభ్యర్థిగా సీతక్కను చెప్పడం లేదు తను… (సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ, సీతక్క అనేది నక్సల్స్ దళంలో ఉన్నప్పుడు పెట్టిన విప్లవనామం… ఉనికి బయటపడకుండా ఉండేందుకు నక్సలైట్లు అసలు పేర్లకన్నా వేరే పేర్లు పెట్టుకోవడం సహజమే)…
నిజానికి కాంగ్రెస్‌లో సీఎం కావడానికి చాలా లెక్కలు, అందులో ఎక్కాలు ఉంటయ్… అంతకుమించి తెలంగాణ సీఎం ఎవరో చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు..? తను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మాత్రమే… అసలు కాంగ్రెస్‌లో అనధికారికంగా చాలామంది అధ్యక్షులు ఉంటారు… పైగా బోలెడు మంది సీఎం అభ్యర్థులు… అసలు నిర్ణయం తీసుకునేది అక్కడ ఢిల్లీలో… ఇక్కడ రేవంత్ కాదు… (ఇక్కడే మరోమాట చెప్పుకోవాలి… ఇదే రేవంత్ గతంలో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీయార్ సీఎంలు అయ్యాక… అంతా వెల్‌కమ్ గ్రూపేనా అని తీవ్ర నిరాశను వ్యక్తపరిచాడు… అంటే అక్కడ కమ్మ, ఇక్కడ వెలమ రాజ్యం అనే అర్థంలో… ఏపీలో రెడ్డి సీఎం అయ్యాడు గానీ తను ఆరాధించే చంద్రబాబు ఓడిపోయి అందరికన్నా ఎక్కువగా రేవంతే నిరాశకు గురయ్యాడు… సో, కమ్మ, రెడ్డి, వెలమ కులాలు దాటి ఇంకెవరినైనా వీళ్లు సీఎంను చేయనిస్తారా..?)
Ads
ఏ సామాజికవర్గాన్ని చూపి రేవంత్ ఆమెను సీఎం అంటున్నాడో, అదే సామాజికవర్గం నుంచి కూడా సీఎం ఆశావహులు, అదీ బలమైన పార్టీ ట్రాక్ రికార్డు, సీనియారిటీ ఉన్నవాళ్లున్నారు… అంతేకాదు, ఎస్టీ, బీసీలు, మైనారిటీల నుంచి కూడా ఉన్నారు… పైగా ఇప్పుడు మైనారిటీలను కేసీయార్ ట్రాక్ తప్పించి, కర్నాటకలోలా తమవైపు తిప్పుకోవాల్సిన అవసరమూ ఉంది… దానికి మైనారిటీ సీఎం అనే హామీ ఉపకరించవచ్చు కూడా…
ఇదుగో ఇన్నిరకాల వాదనలుంటయ్… ఐనా రేవంత్ రెడ్డి చెప్పిన కాంటెక్స్ట్ వేరు… మన జర్నలిజం స్థాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసు కదా… ఏదేదో రాసేశారు… తను అన్నది ఏమిటంటే..? మా కాంగ్రెస్‌లో పేదలకు, ఆదివాసీలు, దళితులకూ ఉన్నతావకాశాలుంటయ్… ఈ స్థితి ఇతర పార్టీల్లో ఉండదు… అవసరమైతే సీతక్కను సీఎంను చేయగలం అన్నాడు… అంటే వివక్షకు ఇన్నేళ్లు గురైన వాళ్లను కూడా కుర్చీలెక్కించగల పార్టీ అని చెప్పుకోవడం, మల్లిఖార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడిని చేయడాన్ని ఓ ప్రబల ఉదాహరణగా చెప్పుకొచ్చాడు తను… అదే ఖర్గేను రాబోయే కాలానికి కాబోయే ప్రధాని అని చెప్పగలదా కాంగ్రెస్..?
కేసీయార్ ఈవిషయంలో తెలంగాణ ఎస్సీలకు చేసిన మాటద్రోహం అందరికీ తెలిసిందే… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పాడు కదా… ఏమైంది..? ఏవో సాకులతో కుర్చీ ఎక్కాడు… పోనీ, రెండోసారి చేశాడా..? అదీ లేదు… మరి ఇప్పుడు మూడోసారి గెలిస్తే చేస్తాడా..? చేయడు… కొడుకును సీఎంను చేస్తాడు… పోనీ, తన కుటుంబేతరుడిని చేస్తాడా..? అదీ చేయడు… ఇక వేరే కులాల దాకా ఎందుకు..? రేప్పొద్దున రేవంత్ చేసేది కూడా ఏమీ ఉండదు… ‘‘అవసరమైతే’’ సీఎంను చేస్తారట… అవసరం వస్తే కదా, అవసరాన్ని గుర్తిస్తే కదా…
ఈ వార్తలకు మరోకోణం చూద్దాం… పైన ఫోటోలో కనిపిస్తున్నది సీతక్కే… ఓ పూర్ కుటుంబం నుంచి వచ్చి, వివక్షలకు గురై, తుపాకీ పట్టుకుని ఉద్యమించిన నేపథ్యం ఆమెది… బయటికొచ్చింది, రాజకీయాల్లో చేరింది… ఎమ్మెల్యే అయ్యింది… మొన్నటి కరోనా సీజన్‌లో సంచులు మోసుకుంటూ అనేక గిరిజన గ్రామాల్లోకి వెళ్లి సరుకులు ఇచ్చి, ధైర్యం చెప్పిన ఏకైక ఎమ్మెల్యే… మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు జనాన్ని గాలికి వదిలేస్తే, ఈమె అడవుల్లో తిరుగుతూ, అడవి బిడ్డలకు అండగా ఉంటూ ప్రయాసపడింది…
ఎస్, ఆమె వంటి పేదలపక్షపాతి, నిజంగా జనంలో ఉండాలనుకునే వ్యక్తి సీఎం అయితే మంచిదే… ఆహ్వానించాలి… కానీ కానిస్తారా..? అంత వీజీ కాదు… కానీ నక్సలైట్లు ఆయుధాలు జనజీవనస్రవంతిలో కలిసి, వ్యవస్థ కీలకస్థానాల్లో చేరి, వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నించాలనే వాదనలకు సీతక్క ఓ ఉదాహరణ అవుతుంది… రేప్పొద్దున నిజంగానే రేవంత్ నోటిపుణ్యాన ఆమె సీఎం అయితే ఆ వాదనలకు మరింత బలం… ఏమో, సీతక్క సీఎం కానూ వచ్చు…!!
Share this Article