ఇండియన్ ఐడల్ హిందీ షో… సోనీలో… అరుణిత తేరే మేరే బీచ్ మే పాట పాడుతోంది… దాదాపు 30 వయోలిన్లు… ఇతరత్రా ఫుల్ ప్లెడ్జ్‌డ్ ఆర్కెస్ట్రా టీం, పరికరాలు… వీనులవిందు… సంగీతాభిమానిని ఓ తాదాత్మ్యంలోకి తీసుకుపోతుంది ఈ వాతావరణం…
ఇండియన్ ఐడల్ తెలుగు షో… ఆహా ఓటీటీలో… ఓ గాయకురాలు ఏదో పాడుతోంది… నిజానికి ఎక్కువగా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించాల్సిన పాట అది… థమన్ కూడా అదే అన్నాడు, ఏఆర్‌రెహమాన్ కనీసం 200, 250 మందితో ఈ పాట కంపోజ్ చేసి ఉంటాడు అని… కానీ ఇక్కడ ఆరేడుగురు కూడా లేరు… చాలా చాలా తక్కువ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కథ నడిపించేస్తున్నారు…
అఫ్‌కోర్స్, వాళ్లు ప్రతిభావంతులే కానీ, ఓ మ్యూజిక్ కాంపిటీషన్ షోకు, ఇప్పుడున్న స్థితిలో సరిపోరు, సరిపోవు… ఓ చిన్న కీబోర్డు, ఓ ఫ్లూట్, ఓ వీణ, ఆరు పలకల చిన్న డ్రమ్స్ బోర్డు, తబలా, మృదంగం కనిపిస్తున్నయ్… ‘వర్షం’ సినిమాలో ఓ హిట్ పాట ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా, చుట్టంలా వస్తావే, చూసెళ్లి పోతావే’… పాటలో ఉరుములు, గాలిహోరు, వర్షపు ధ్వని, నీటిచుక్కల చప్పుళ్లు… బురదనీరు, నీళ్లలో పాదాల సవ్వళ్లు… ఇంకేముంది..? మళ్లీ ట్రాకే దిక్కయ్యింది, చూసేవాళ్లకు నవ్వొచ్చింది…
Ads
ఏముందీ..? అవసరమైతే ట్రాక్ పెట్టేయడమే… ఈ విషయంలో ఈటీవీ పాడుతాతీయగా బెటర్… బాలు ఉన్నప్పటి నుంచీ ఆర్కెస్ట్రాకు ప్రాధాన్యం ఇచ్చాడు తను… జీ తెలుగువాడి సరిగమప ప్రోగ్రాంలో పిచ్చి డాన్సులు, జోకులు తప్ప ఇవేమీ పట్టవు… నిజానికి ఆర్కెస్ట్రా ఏ ప్రోగ్రాంకైనా అదనపు విలువ… కపిల్ శర్మ షోలు కామెడీ ప్రధానం కదా… కానీ ఓ చిన్న ఆర్కెస్ట్రా టీం కూడా ఉంటుంది…
ఓసారి జేమ్స్‌బాండ్ థీమ్ సాంగ్ కంపోజింగ్ మీద ఏదో స్టోరీ చూడబడ్డాను… అనేకమంది వాయిద్యకారులు, బోలెడన్ని సంగీత పరికరాలతో కుస్తీ పడుతున్నారు… జస్ట్, ఒకటీరెండు నిమిషాల థీమ్ సాంగ్‌కు బృహత్తర ప్రయాస… ఇప్పటికీ హిట్టెస్ట్ థీమ్ సాంగ్ బహుశా అదేనేమో… నిజానికి ఒక్క పాటలో ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్లు వాడిన సందర్భం ఏది..? ఈ ప్రశ్నకు సమాధానం… ఆ రికార్డు కూడా ఇండియా పేరిటే ఉంది… గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదై ఉంది కూడా…
2013లో రికార్డయ్యింది… 315 రకాల పరికరాలతో సాగిన వాద్యగోష్టి… అనగా సింఫనీ… అస్సాంలోని జోర్హాట్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో రూపమ్ సర్మా సంగీత దర్శకత్వంలో సాగిన ప్రోగ్రాం అది… అదనపు పరికరాలు గట్రా మొత్తం కలిపి లెక్కేస్తే 370 పరికరాలు తేలాయి… వీడియో చూశారు కదా… వాటిల్లో అనేకం మనకు తెలియవు… స్థానిక సంగీత పరికరాలు కూడా బోలెడు వాడారు… 106 మంది గాయకులు మైకులు పంచుకున్నారు… వాయిద్యకారులు ప్లస్ గాయకులు కలిపితే మొత్తం 476 మంది పాటలో పాలుపంచుకున్నారు… ఈ వాద్యగోష్టి కాలనిడివి తెలుసా..? కేవలం అరగంట..!!
Share this Article