చెమ్మచెక్క ఆస్కారే! తస్సదియ్య తస్కారే!!
ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి…స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి…వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి…మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు హీరోకు అమ్మ కట్టిన హనుమ బిళ్ల. ఇది ఓపెనింగ్ షాట్.
నల్లమల అడవి సున్నిపెంట ఇంటి ముందు పెంటలో ఆడుకుంటూ నీటి కుండను పగులగొట్టినందుకు అమ్మ కోప్పడితే…అమ్మ గుర్తుగా ఆ కుండ పెంకును జేబులో పెట్టుకుని…ఇల్లు వదిలి…బాంబే మీదుగా అరేబియా సముద్రం ఈదుకుంటూ…చేతిలో చిల్లి పెంకుతో…ఇటలీ వచ్చి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ అవుతాడు హీరో. ఎంతటి బలవంతుడైన విలన్ అయినా…హీరో కుండ(పాట్)పెంకు కాలి గోటి ముందు నిలువలేకపోతాడు. దాంతో అంతర్జాతీయ మాఫియా “పాట్ స్టార్” అని హీరోకు ముద్దుపేరు పెట్టుకుంది. సినిమా టైటిల్ కూడా దాదాపు “పాట్ స్టార్” అన్నదే ఖరారయ్యింది.
Ads
ఇదీ స్థూలంగా సినిమా కథ. ఈ సినిమా పాటలకు స్వరాలు కూర్చడానికి మ్యూజిక్ సిటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మన సందర్భం ఇది.
మ్యూజిక్ సిటింగులకు ఇదివరకు నేలమీద, చాపలమీద, పరుపులమీద కూర్చునేవారు. అప్పట్లో సంగీతం నేల విడిచి సాము చేసేది కాదు. కాబట్టి “మ్యూజిక్ సిటింగ్” మాట పుట్టి ఉంటుంది. నేల మీద, చాపల మీద కూర్చునే రోజులు కావివి. భాషలో ఎన్నెన్నో మాటలు వ్యుత్పత్తి అర్థంతో సంబంధం లేకుండా బతికేస్తూ ఉంటాయి. అలాంటి ఒకానొక “మ్యూజిక్ సిటింగ్” ఇది.
సొంత విమానంలో ఏడు గంటలు ఆగకుండా ప్రయాణం చేసిన హీరో అలసటతో ఉన్నా…ఏడు సముద్రాల ఆవల ఉన్న ఆ ద్వీపపు ఏడు నక్షత్రాల రిసార్ట్ పూల్ సైడ్ మ్యూజిక్ సిటింగ్ కు నేరుగానే వచ్చేశాడు. దర్శకుడు నిన్ననే వచ్చి…రాత్రి నిర్మాత ఖర్చుతో సేదతీరి…ఇప్పుడే నిద్రలేచి వచ్చాడు. సంగీత దర్శకుడు మొన్ననే వచ్చి…యాభై పల్లవులకు, వంద చరణాలకు తనను తానే కాపీ కొట్టుకుంటూ కొన్ని “తనన తానన తానేనా!”లను సమకూర్చి కాపీకి ప్రతీకాత్మకంగా కాఫీ తాగుతూ ఉన్నాడు. నిర్మాత రిసార్ట్ కాటేజీ సర్వర్ పాత్రలో చక్కగా ఒదిగి వేళకు ఆరారా అందరికీ అన్నీ సప్లయ్ చేస్తూ…ఈగ ఇల్లలుకుతూ ఇంటిపేరు మరచిపోయినట్లు తనను తాను మరచిపోయాడు. అన్నట్లు లాస్ట్ బట్ లీస్ట్…గేయ రచయిత ఒక మూలన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరుబయట హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేవాడిలా క్లిప్ అట్ట మీద తెల్లకాగితంపై పెన్నుతో అంత్యప్రాసలు ముందు రాసుకుని…రివర్స్ లో పదాలను పూరించుకుంటూ తనలో తానే మురిసిపోతున్నాడు.
మ్యూజిక్ సిటింగ్ లో మొదట హీరో సంగీత పాఠం మొదలయ్యింది.
“మొన్న నాటు నాటు పాటకు ఒక ఆస్కారే వచ్చింది. మన పాటకు అన్ని ఆస్కార్లు గంపగుత్తగా రావాలి. ఇంకెవరికీ ఆస్కార్లో ఆస్కారమే ఉండకూడదు…” అని సెలవిచ్చాడు.
ఆ మాటలతో దర్శకుడి మోహంలో కోటి బల్బులు ఒక్కసారిగా వెలిగినట్లయింది. ఏదో ఒక మిరాకిల్ పాటకు లీడ్ దొరికినట్లనిపించింది.
“ఎస్ డూడ్! ఇంతదాకా తెలుగులో “స్కా” ప్రాసతో పాటలే లేవు.
“చెమ్మచెక్క ఆస్కారే
తస్సదియ్య తస్కారే!
ఉన్నోళ్లు ఉస్కోరే!
లేనోళ్లు మూస్కోరే!
ఏ హై ఆస్కారే!
హమారా పురస్కారే!
దండలు వేస్కోరే!
చూపులు చూస్కోరే!
తలుపులు తీస్కోరే!”
అన్న పల్లవితో పాట చేద్దాం. దీనికి మనకు ఆస్కార్ రావడంతో పాటు ఆస్కార్ వారికి ఇది సిగ్నేచర్ ట్యూన్ అవుతుంది. తెలుగువారి కీర్తి పతాకం హాలీవుడ్ లాస్ ఏంజిలిస్ లో శాశ్వతంగా రెపరెపలాడుతూ ఉంటుంది” అన్నాడు దర్శకుడు. నిజమే అని తెలుగు రాయడం, చదవడం రాని సంగీత దర్శకుడు తల ఊపాడు. అలాగే చేద్దామని తెలుగు హీరో ఇంగ్లండ్ ఇంగ్లిష్ యాసలో అంగీకారం తెలిపాడు. మాట్లాడ్డం రాని రచయిత మౌనంగానే సరేనన్నాడు.
అప్పుడే ఖాళీ కాఫీ కప్పలు తీసుకెళ్లడానికి వచ్చిన నిర్మాత ఇది విని…పరమానందభరితుడై…అందుకోబోతున్న ఆస్కార్ అవార్డు కోసం ఏ బట్టలు కుట్టించుకోవాలో…భార్యకు ఫోన్ చేసి అడుగుతున్నాడు.
రచయితకు విషయం చెప్పారు. ముందనుకున్న-
“లవ్వు లవ్వు
కెవ్వు కెవ్వు
తవ్వు తవ్వు
నువ్వు పువ్వు
నేను రువ్వు”
పల్లవి మరీ సుప్రభాతంలా ఉంది. హీరో నోట అప్రయత్నంగా, అసంకల్పితంగా వచ్చిన “ఆస్కార్లో ఆస్కారం” మాట క్యాచీగా ఉంది. ఈ పల్లవికి రెండు చరణాలు ఇచ్చేయండి అన్నారు.
“సంస్కారే త్రిబులెక్సే!
మస్కారే రోలెక్సే!
లాంటి మాటలతో రచయిత అహోరాత్రాలు నిద్రాహారాలు మాని…రెండు చరణాలు రాసిచ్చాడు. ప్రతిపదంలో “స్కా” ప్రాస సాధించడానికి రచయిత పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. “స్కా” దొరకని ప్రతిసారీ స్కాచ్ సిప్ చేస్తూ హీరో సంస్కారవంతమైన “స్కా” ప్రాస పదం అందించడంతో రచయిత పని కొంతవరకు సులువయ్యింది.
సంగీత దర్శకుడు కూడా కొన్ని “స్కా”లను సమయోచితంగా, ఉచితంగా దానం చేశాడు. ఇదొక ప్రత్యేకమైన, వైవిధ్యమైన గొంతుతో పాడాల్సింది కాబట్టి మొదటి చరణం సిధ్ శ్రీరామ్ తో పాడించాలని; రెండో చరణం కైలాష్ ఖేర్ తో పాడించాలని మ్యూజిక్ సిటింగ్ లో ఏకాభిప్రాయం కుదిరింది. అనివార్య కారణాలు తోడైన ప్రత్యేక పరిస్థితులవల్ల, అభిమానకోటి అభ్యర్థనల వల్ల పల్లవి మాత్రం హీరోనే పాడాల్సి వచ్చింది.
అంతర్జాతీయంగా ఆస్కార్ కు గురి పెట్టినా…దేశీయంగా భక్తితో సంస్కృతంలో అర్థంకాని ఒక పాట ఉంటే ఈమధ్య ఉత్తర భారతం ఊగిపోవడంతో పాటు…ప్రభుత్వ అవార్డులు వద్దన్నా వరదలా వచ్చిపడుతున్నాయన్న సినీ మార్కెటింగ్ మెలకువ వల్ల ఒక సంస్కృత భక్తి గీతం అవసరం లేకున్నా ఇరికించాల్సి వచ్చింది. మెడలో హనుమ బిళ్ల తాకగానే హీరో ఆకాశానికి ఎగిరే సందర్భానికి రచయిత రాసిన-
“విద్యుత్ చాలిత
విద్వన్మీలిత
ఖద్యో జ్వాలిత
సద్యో రూపిత
నిత్య స్ఫూరిత
సత్యస్ఫోరిత
హృద్యత్ ప్రేరిత
విద్యత్ ఊర్జిత…”
పాట ఎవరికీ అర్థం కాకపోయినా…వినగానే అందరికీ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఊగిపోయారు. గాల్లో తేలిపోయారు. రచయితను కౌగలించుకుని నీ రూపంలో కాళిదాసు మళ్లీ పుట్టాడని వేనోళ్ల పొగిడారు. ఇంత గొప్ప పాటలు అన్నీ ఒకేసారి విడుదల చేయడం కంటే ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి విడుదల చేస్తే బజ్ క్రియేట్ అవుతుందని పక్కాగా లిరికల్ రిలీజ్ మార్కెటింగ్ ప్లాన్ వేసుకున్నారు.
ఆమేరకు-
మొదటి సాంగ్ ఈజ్ అవుట్!
రెస్ట్ ఈజ్ మిస్టరీ!! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article