బాపు గారి ఉత్తర రామాయణం . వాల్మీకి ఉత్తర రామాయణంలో కవలలు ఇద్దరు అబ్బాయిలు . బాపు గారి ఉత్తర రామాయణంలో ఒకరు అమ్మాయి , మరొకరు అబ్బాయి . బాపు సినిమా అంటేనే రామాయణం ఫ్లేవర్ అంతర్లీనంగా ఉండాల్సిందే . 1975 లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ముత్యాలముగ్గు సినిమా టైటిల్సే మంగళంపల్లి బాల మురళీకృష్ణ శ్రీరామ జయరామ సీతారామా అనే పాటతో పడతాయి . బాపు గారు ఈ పాటతో మనల్ని తన అధీనంలోకి లాగేసుకుంటాడు .
కె విశ్వనాథ్ కు శంకరాభరణం సినిమా ఎలాగో , బాపుకు ఈ ముత్యాలముగ్గు సినిమా అలా . వీరిద్దరివి ఇతర సినిమాలు గొప్పవి కాదు అని కాదు . వీరి పేరు చెప్పగానే ప్రేక్షకులకు ఈ సినిమాలే ముందు గుర్తుకొచ్చేవి .
ముత్యాలముగ్గు సినిమా ప్రాశస్త్యం గురించి , సినిమాలో ప్రతీ సాంకేతిక అంశం గురించి ఓ M.Phil చేసేయవచ్చు . సినిమా మొత్తం మీద ఓ రెండు మూడు Ph.D లు చేయవచ్చు . అంత గొప్ప సినిమా ఈ ముత్యాలముగ్గు . నటీనటులకు మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా ఉండాలనే ఆలోచన రావటమే ఈ సినిమా వైవిధ్యానికి , విజయానికి ప్రధాన కారణం .
Ads
ఈ సినిమా చాలామంది నటీనటులకు పేద్ద బ్రేకుల్నే ఇచ్చింది . తీర్పు సినిమాలో అరంగేట్రం చేసిన సంగీతకు నట జీవితాన్ని ప్రసాదించింది . ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కాంట్రాక్టర్ రావు గోపాలరావు పాత్ర , ఆయన నటన . ఆయన కాంబినేషన్లో మాడా , కాకరాల , ముక్కామల , అల్లు రామలింగయ్య పాత్రలు , నటనలు , ముఖ్యంగా ముళ్ళపూడి వారి డైలాగులు ఈరోజుకీ ప్రేక్షకుల కళ్ళ ముందు తారట్లాడుతుంటాయి .
అందాలరాముడు సినిమాతో అరంగేట్రం చేసిన నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ నిత్య పెళ్ళి కొడుగ్గా స్థిరమైన నటస్థానాన్ని పొందాడు . బేబీ రాధ , మాస్టర్ మురళి , ఆర్జా జనార్ధనరావు , ఆంజనేయస్వామి ఒక టీం . ఆంజనేయస్వామి ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి . హలం నట జీవితంలో ఓ మైలురాయి . రస హృదయులైన ప్రేక్షకులు ఈమె పాత్రను , నటనను , డైలాగులను మరచిపోలేరు .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ ఆణిముత్యాలే . ఆరుద్ర వ్రాసిన ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా , గుంటూరు శేషేంద్ర శర్మ వ్రాసిన నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది పాటలు సూపర హిట్ . సి నారాయణరెడ్డి వ్రాసిన పాటలు గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి , ఏదో ఏదో అన్నది , ఎంతటి రసికుడివో తెలిసెరా సూపర్ డూపర్ హిట్ .
నూజివీడు ధర్మా అప్పారావు కళాశాల ఉపన్యాసకులు , ప్రముఖ రచయిత ఎమ్వీయల్ నరసింహారావు ఈ సినిమాకు నిర్మాత . 12 లక్షల పెట్టుబడితో సినిమా తీస్తే కళా హృదయులు తెలుగు ప్రేక్షకులు రెండు కోట్ల రూపాయలను ఇచ్చారు . హైదరాబాద్ , విశాఖపట్నం , విజయవాడ , తిరుపతి , రాజమహేంద్రవరం కేంద్రాలలో సిల్వర్ జూబిలీ ఆడింది . 12 సెంటర్లలో వంద రోజులు ఆడింది . మా గుంటూరులో విజయ టాకీసులో ఆడింది . హిందీలోకి జీవనజ్యోతి టైటిల్ తో రీమేక్ అయింది . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది . ఈ సినిమా ఫొటోగ్రఫీ డైరెక్టర్ ఇషాన్ ఆర్యకు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు లభించింది .
హైదరాబాదు లోని గ్యాన్ బాగ్ పేలసులో ఇండోర్ షూటింగ్ అంతా . 1890 లో నిర్మించబడిన ఈ పేలస్ చాలా ఇంపోజింగుగా ఉంటుంది . ఔట్ డోర్ షూటింగ్ అంతా గోదావరి , కోనసీమ , కలిదిండి గ్రామం . బాపు గారి సినిమా అంటే తల్లి గోదావరి లేకుండా ఎలా !!
నటుడు శ్రీధర్ హీరోగా నిలదొక్కుకున్నాడు . కాంతారావు , సూరేకాంతం , జయమాలిని ప్రభృతులు నటించారు . సినిమా , పాటలు యూట్యూబులో ఉన్నాయి . తెలుగు సినిమా రంగం సగర్వంగా చెప్పుకోగలిగే దృశ్య , శ్రవణ కావ్యం ముత్యం లాంటి ఈ ముత్యాలముగ్గు సినిమా . ఎన్ని సార్లయినా ఆస్వాదించవచ్చు . బాపు , ముళ్ళపూడి సంయుక్త ప్రయత్నం ఎంత గొప్పది అంటే ఈ సినిమాలో ఒక్క డైలాగుని కాని , ఒక్క సీనుని కాని తీసేయలేము . మొత్తం సినిమా ట్రూపుకి హేట్సాఫ్ . ఓ మాయాబజార్ , ఓ గుండమ్మ కధ , ఓ ప్రేమనగర్ , ఓ శంకరాభరణం , ఓ ముత్యాలముగ్గు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు….. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article