.
Subramanyam Dogiparthi....
బాలకృష్ణ , కోడి రామకృష్ణ , భార్గవ ప్రొడక్షన్స్ గోపాలరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూడో సూపర్ హిట్ సినిమా ఈ మువ్వ గోపాలుడు . అలాగే విజయశాంతితో బాలకృష్ణ ఎనిమిదో సినిమా .
చాలా బాలకృష్ణ సినిమాల్లోలాగే గ్రామీణ నేపధ్యం , ఆడుతూపాడుతూ తిరిగే బాలకృష్ణ , ఓ కంస మామ , దుష్టశిక్షణ , వగైరాలు ఉన్నా కధ చాలా బిర్రుగా ఉండటం వలన సినిమా సూపర్ డూపర్ హిట్టయింది .
Ads
1986లో తమిళంలో హిట్టయిన Aruvadai Naal సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో ప్రభు , పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు . తెలుగులో బాలకృష్ణ , విజయశాంతి , శోభన 1+2 గా నటించారు . కధ ఏంటంటే …
ఓ ఊళ్ళో ఓ కంస మామ . అతని బావమరిది హీరో గోపి అమాయకుడు . అతన్ని గుప్పిట్లో ఉంచుకొని అతని ఆస్తిని , ఊళ్ళో పెత్తనాన్ని అనుభవిస్తూ ఉంటాడు మామ . ఆ ఊళ్ళోకి డాక్ఠరుగా వచ్చిన విజయశాంతి ప్రేమలో పడతాడు హీరో . దాంతో ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో అని రజస్వల కూడా కాని కూతురు మెడలో మోసపూరితంగా తాళి వేయిస్తాడు .
కూతురు తన మేనమామను తండ్రి మోసం చేసాడని పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేస్తుంది . పెద్దలు పెళ్ళిని రద్దు చేసి డాక్టరమ్మను పెళ్ళి చేసుకోవటానికి హీరోకి అనుమతి ఇస్తారు . తిక్కరేగిన కంస మామ పెట్రేగిపోయి ఫాదర్ని శిలువ వేయిస్తాడు , డాక్టరమ్మను చంప ప్రయత్నిస్తాడు .
మువ్వ గోపాలుడు బాల గోపాలుడు అయి కంస మామను నరికేసి జైలుకు వెళతాడు . విడుదల అయ్యే రోజు డాక్టరమ్మ నన్ గా మారి బాలకృష్ణ , శోభనలను కలపటంతో శుభం కార్డు పడుతుంది . 1+2 సమస్య సాల్వ్ అవుతుంది .
సినిమా అంతా బాలకృష్ణ , విజయశాంతి సరసాలు , అల్లర్లు , పాటలు , ఆటలతో హుషారు హుషారుగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో సి నారాయణరెడ్డి పాటలన్నీ హుషారుగా ఉంటాయి . కోడి రామకృష్ణ పాటల్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు . అందగాడా నిండు చందురూడా ఈ సందె కాడ రారా ముద్దులాడ డ్యూయెట్ బాలకృష్ణ , విజయశాంతి మీద చాలా బాగుంటుంది .
ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా , వేగుచుక్కా వెలగా పండు , ఏ గుమ్మా డ్యూయెట్లు బాగుంటాయి . మువ్వ గోపాలుడొచ్చాడు అంటూ సాగే బాలకృష్ణ ఎంట్రీ సాంగ్ బాలకృష్ణ అభిమానులను హుషారు చేస్తుంది .
ఈ సినిమాలో వై విజయది సాధు పాత్ర . బ్రహ్మచారి ఇడ్లీలు , దంపతుల ఇడ్లీలు అమ్ముకునే పాత్ర . ఏమని చెప్పను పిన్నమ్మా ఇంకెన్నెన్ని చెప్పను పిన్నమ్మా అంటూ కవాలీ మోడల్లో పాట వై విజయ మీద చాలా హుషారుగా ఉంటుంది .
కంస మామగా రావు గోపాలరావు రెచ్చిపోయి నటించాడు . ఫాదర్ పాత్రలో గొల్లపూడి నటనను ప్రేక్షకులు అసలు మరచిపోలేరు . మతం కన్నా మనిషి గొప్ప అని సినిమా అంతా చాటిచెపుతూనే ఉంటాడు . గొప్ప పాత్ర .ఇతర పాత్రల్లో జయచిత్ర , అనిత , తదితరులు నటించారు .
గణేష్ పాత్రో డైలాగులు పదునుగా ఉంటాయి . ఈ మసాలా బ్లాక్ బస్టర్ యూట్యూబులో ఉంది . ఈమధ్యనే ఏదో టివి చానల్లో కూడా వచ్చింది . ఇంతకముందు చూడని బాలకృష్ణ , విజయశాంతి అభిమానులు తప్పక చూడతగ్గ పూర్తి వినోదాత్మక చిత్రం . It’s a romantic , commercial entertainer . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు
Share this Article