Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా నాన్నే నాకు గొప్ప అమ్మ..! మాతృత్వమే కాదు, పితృత్వమూ తక్కువ కాదు..!

February 22, 2024 by M S R

Prabhakar Jaini….. ”గంగాధరం ! నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు !”

ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు పాదులు చేస్తున్న గంగాధరం అదిరిపడ్డాడు.

“దేనికి ?” అడిగాడు అయాను
ఏమో ! నాకేం తెలుసు ?” అంటూ వెళ్లిపోయింది ఆయా.

Ads

చేతులకు ఉన్న మట్టిని గబగబా.. కడిగేసుకుని, తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు.

వడి వడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెడుతున్నాడు.. అతని మనసులో ఆందోళన. “ ఏమి జరిగింది ? మొక్కల గురించా? ఎక్కడైనా పొరపాటు చేశానా? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఎవరినయినా కొట్టిందా? అలా చెయ్యదే! ఏమి జరిగింది? ఇన్ని రోజులుగా ఒక్కసారీ.. ఎప్పుడూ తనను పిలవని ప్రిన్సిపాల్ మేడం ఎందుకు పిలిచారు?” తడబడుతున్న అడుగులతో.. గుమ్మం దగ్గరకి వెళ్ళాడు.

చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు.

“అమ్మగారండీ !” లో గొంతుకతో పిలిచాడు.

“లోపలికి రా !” ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా వినిపించింది. అతనిలో ఆందోళన పెరిగిపోయింది.

కళ్ళజోడు పెట్టుకుని, తెల్లని జుట్టుతో కాటన్ చీర కట్టుకుని హుందాగావున్న ప్రిన్సిపాల్ మేడమ్ ని చూడగానే వంగి నమస్కరించాడు.

ఆమె టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ.. “ చదువు” అంది

వణికిపోయాడు గంగాధరం

“ మేడం నేను చదువుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు కూడా రాదు. ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండమ్మా! తప్పు చేస్తే ఇంకొక్క అవకాశం ఇవ్వండమ్మా..!
దీనంగా అన్నాడు గంగాధరం.

అతడి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు.

“ మీ దయవలన నేను నా కూతురిని ఇక్కడ చదివించుకుంటున్నానమ్మా.. పొమ్మని మాత్రం అనకండమ్మా… దాన్ని ఇలాంటి స్కూల్ లో నా జన్మలో చేర్చలేను ! పొమ్మని అనకండమ్మా ” వణికిపోతున్నాడు .

“ అరెరే ! ఏదేదో ఊహించేసుకోకు! మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివి తేటలు చూసి, నువ్వు మా సిన్సియర్ వర్కర్ వి కూడా కాబట్టి. ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా..వుండు ! ఇది నీ కూతురు రాసిందే ! నీకు చదివి వినిపించాలని అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి.”

ప్రిన్సిపాల్ గారి పిలుపు విని సరోజ టీచర్ అక్కడకి వచ్చింది. ఆమె ఆ పేపర్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది…

“ ఈ రోజు మా క్లాసులో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు . .

“ నేను ఒక పల్లెటూరిలో పుట్టాను. అక్కడ ఇప్పటికీ విద్య వైద్యం అనేవి రెండూ ప్రజలకు సమీపంలో ఎక్కడాలేవు. పిల్లలను కనడం అంటే అక్కడి ఆడవాళ్ళకు మళ్ళీ పుట్టడమే.. పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊరిలో.

అలాగే మా అమ్మ నన్ను కంటూ తను కన్ను మూసింది.
నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే., తన దగ్గర పాల రుచిని నేను గుర్తు పెట్టు కోకుండానే పురిటిలోనే కనుమూసింది.

నన్ను తన చేతులలోకి తీసుకున్నది అప్పటికీ ఇప్పటికీ మా నాన్న ఒక్కడే !
తల్లిని చంపి పుట్టాను అన్నారు. “శనిగొట్టుదానిని” అన్నారు. ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు.

నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నాన్నమ్మ , తాతలూ అందరూ బలవంతం చేశారు, కొడుకును కనమని.

ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు .

ఆ ఊళ్ళో ఉంటే వాళ్లందరూ అలాగే బలవంతం చేస్తారని., ఉన్న ఇంటినీ., పొలాలనూ., అన్నిటినీ.. వదిలి.. రోజుల పిల్లనైన నన్ను ఎత్తుకుని.. నాకు అన్నీ తానే కావాలని, తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలనూ వదిలిపెట్టి.. వట్టి చేతులతో.., నా దురదృష్టం మీద బాధతో., నా మీద ప్రేమతో., నన్ను పెంచాలి అనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు.

చిన్నప్పుడు నాకోసం ఎన్నెన్ని కష్టాలు పడివుంటాడో !

ఇప్పుడు తలచుకుంటుంటే అనిపిస్తుంది .

ఒక్కటే రొట్టె ఉంటె తనకు రొట్టెలు ఇష్టం ఉండవు అనేవాడు.
నాకు ఇప్పుడు తెలుస్తోంది
నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు.. తను పస్తులు ఉంటూ నాకు తినిపించేవాడు నాన్న ..
అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి.

తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు కల్పించాడు నాన్న .

నన్ను ఈ స్కూల్ లో చదివించడం కోసం ఇక్కడ తోటమాలిగా చేరాడు.

ప్రేమ ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లు అయితే అవి నేను పొందుతున్నది నాన్న నుండి.

త్యాగం అమ్మకు ప్రతిరూపం అయితే.. మా నాన్న త్యాగానికి నిర్వచనం.

*మా నాన్నే నాకు గొప్ప అమ్మ*

ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నాన్న గురించి కాకుండా ఇంకేం రాసినా నాకు సంతృప్తి అనిపించదు.
ఇంకా ఈ స్కూల్ లోనే ఉన్న తోటమాలి నాతండ్రి అని గర్వంగా చెప్పుకుంటా ..
నాన్న నీళ్లు పోసే ఈ మొక్కల్లో నాన్న కోల్పోయిన మా అమ్మ నాకు కనిపిస్తుంది.

ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు . నా టీచర్ కి ఇది నచ్చకపోవచ్చు .

కానీ నిస్వార్ధ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత.”

చదువుతున్న సరోజ టీచర్ గొంతులో కన్నీటి జీర !

వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్ళను అద్ధుకుంటోంది.

గంగాధరం వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఏడుపు దిగమింగు కుంటున్నాడు.

ఆ ఎ.సి . గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటోంది.

ఆ పేపర్లను సరోజ టీచర్ నుండి.. వణుకుతున్న చేతులతో అందుకుని.. గుండెలకు హత్తుకున్నాడు.

నిలబడలేక పోతున్నాడు.

ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరగా వచ్చింది. కుర్చీ దగ్గరకి తీసుకు వెళ్ళింది . కూర్చో బెట్టింది తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్ళను అతడి చేతికి ఇచ్చింది.

ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రతఁ !

“ గంగాధరం ! “..
మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు ఇచ్చాము. మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం ఎవరూ రాయలేరు. ఎందుకంటే . .
ఇది ఒక కూతురు తన నాన్నలో అమ్మ ప్రేమని చూస్తున్న అనిర్వచనీయమైన అనుభూతికి అక్షరరూపం. మేము రేపు మన స్కూల్ లో మాతృదినోత్సవం జరపబోతున్నాము. దానికి ముఖ్య అతిధివి నువ్వే !

నిన్ను మించిన తల్లి ఇంతవరకూ మా స్కూల్ చరిత్రలో మాకు తెలీదు. అందుకే నీకు సత్కారం చెయ్యాలని నిర్ణయించుకున్నాం.
నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాను .” అంటూ..

“ మేము ఈ సత్కారం చెయ్యడానికి ముఖ్య కారణం పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు.. పిల్లల కోసం త్యాగం చేస్తారు.. అనే విషయం అందరికీ తెలియాలని.

నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచం లోనే గొప్పతల్లి అన్న మాటలను నిజం చెయ్యాలీ అని., ఆ తండ్రి
మా స్కూల్ లోనే ఉన్నాడు అని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని.

నువ్వు మనబడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివి మాత్రమె కాదు.

నువ్వు అంగీకరిస్తే రేపటి మన స్కూల్ మాతృదినోత్సవ సభలో సత్కారం అందుకునే గొప్ప అమ్మవి. మాకు ముఖ్య అతిథివి ! ”

గంగాధరం.. ప్రిన్సిపాల్ మేడమ్ ఔదార్యానికి కృతజ్ఞతతో నమస్కరిస్తూ. . . కూతురు వైపు చెమర్చిన కళ్లతో అడుగులు వేస్తున్నాడు . . .

తన కన్నబిడ్డ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న మమకారం మనసుని ముద్ద చేస్తుంటే..
గుండెలనిండా హత్తుకుని . . కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలని . .”

*****

ఇది ఒక వాట్సప్ ఇంగ్లీష్ మెస్సేజ్ కి తెలుగు స్వేచ్ఛానువాదం. రచయితకి ప్రణామాలతో..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions