.
Subramanyam Dogiparthi ………. తెలుగు వారికి జంధ్యాల ఇచ్చిన సుత్తి , దాని పుట్టుక మరియు వివిధ రకములు . త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు . అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , భరతుడే ఎందుకు రాజ్యపాలన చేసుకోవాలో తెలుపుతాడు . అంతా విన్న తర్వాత భరతుడు ఇంత సుత్తి వేయాలా అన్నయ్యా అని శ్రీరాముడితో అంటాడు .
ఇలా మొదటిసారి త్రేతాయుగంలో భరతుడి నోటి వెంట పుట్టిందని ఈ నాలుగు స్థంభాలాట సినిమాలో సుత్తి వేలు చేత జంధ్యాల ఉవాచించారు . అప్పుడు కాబట్టి జనం విన్నారు , నవ్వుకున్నారు . ఇప్పుడయితే మా రాముడిని ఎగతాళి చేస్తావా , మా రామాయణాన్ని వక్రీకరిస్తావా అంటూ మన అనంత శ్రీరాముడు హూంకరించేవాడు . జంధ్యాల చచ్చిపోయి బతికిపోయాడు .
Ads
ఇంక వివిధ రకములు ఎట్టివనిన : ఇనుప సుత్తి (Iron hammering) , రబ్బర్ సుత్తి (Rubber/smooth hammering) , సామూహిక సుత్తి (రాజకీయ నాయకులు జనానికి వేసే Mass hammering) , ఎదురు సుత్తి (Riverse hammering) , వదలకుండా చాలాసేపు వేసే ధీర్ఘకాల సుత్తి (Prolonged hammering) . ఇవండీ జంధ్యాల గారి సుత్తి రకాలు .
జంధ్యాల తన నాటికల్లో కూడా ఇలాగే కొన్ని పదాలను జనంలోకి వదిలేవారు . మా మిచ్చరు బండబ్బాయి చెప్పాడు , మా పాలబ్బాయి చెప్పాడు , వగైరా . అలాగే ఈ సినిమాలో సుత్తిని , సుత్తి జంటను తెలుగు వారికి అందించారు . ఈ 43 ఏళ్ల నుంచి చిన్నాపెద్దా , పండితపామరులు అందరికీ నానుడి పదమయిపోయింది .
ముద్దమందారం సినిమా తర్వాత లేత ప్రేమికులతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ బ్రహ్మాండంగా పొందింది . కేవలం 12 లక్షల రూపాయల బడ్జెటుతో , లేత నటీనటులతో , పెద్దగా పాపులర్ కాని నటీనటులతో తీసారు ఈ సినిమాను . 1+2 కధ కాదు . ఏకవీర లాగా అటూఇటూ అయిన ప్రేయసిల కధ కాదు .
ఇద్దరు ప్రాణమిత్రుల్లో ఒకరు అనుకోకుండా , తన ప్రమేయం లేకుండా తన మిత్రుడు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు . అప్పటికే గర్భవతి అయిన మిత్రుడి భార్యను చెల్లెలులాగా చూసుకుంటాడు . ఈ జంటగా ప్రదీప్ , పూర్ణిమలు నటించారు .
పూర్ణిమను ప్రేమించిన నరేష్ అన్నావదినల మాట మేరకు మేనమామ కూతురు తులసిని పెళ్ళి చేసుకుంటాడు . పెళ్ళయితే చేసుకున్నాడు కానీ కాపురం చేయలేకపోతాడు . పూర్ణిమ ఆత్మహత్య చేసుకుని సినిమాకు ముగింపు పలుకుతుంది . ఇలా నలుగురు నాలుగు స్థంభాలాట ఆడుతారు . Nay . విధి ఆడిస్తుంది .
రొటీనుకు భిన్నంగా కధను నేయటమే కాకుండా చక్కని కధనంతో అందాల విశాఖ ప్రాంతంలోని ప్రకృతిని అద్భుతంగా ఉపయోగించుకున్నారు జంధ్యాల . విశాఖ , భీమిలి , అరకు లోయ , యేరాడ ప్రాంతాలలోని లొకేషన్లను తెర మీదకు ఎక్కించారు .
అప్పటికే పెద్ద నటిగా , నిర్మాతగా , దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న మా నరసరావుపేట వనిత విజయనిర్మల తన కుమారుడిని జంధ్యాల సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసారు . ఒక విధంగా మంచికే జరిగింది . ఆ తర్వాత మరెన్నో మంచి సినిమాల్లో హాస్యనటుడిగా నటిస్తానికి , నలభై ఏళ్ళకు పైగా నటిస్తానికి అతనికి అవకాశం కలిగింది .
అలాగే సుత్తి జంట . ఈ సినిమాకు ముందే కొన్ని చిన్నాచితకా పాత్రల్లో నటించిన వీరభద్రరావు , వేలుకు బ్రహ్మాండమైన బ్రేక్ వచ్చింది .చాలా సినిమాల్లో హాస్య జంటగా , కేరెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగారు . రేలంగి-రమణారెడ్డి , కోట శ్రీనివాసరావు- బాబూమోహన్ జంటల్లాగా వీర పాపులర్ అయింది సుత్తి జంట .
నిన్నూ ఈ దేశాన్ని బాగుచేయటం నావల్ల కాదు అనే పడికట్టు పదం కూడా నూతన్ ప్రసాద్ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది లాగా నానుడి మాట అయిపోయింది . జంధ్యాల మార్క్ . ఇతర ప్రధాన పాత్రల్లో రోహిణి , డబ్బింగ్ జానకి , అన్నపూర్ణ , కాకినాడ శ్యామల , విజ్జి బాబు , ఆలీ , ఎంతో మంది ఔత్సాహికులు , రంగస్థల నటులూ నటించారు .
రాజన్- నాగేంద్ర సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా చినుకులా రాలి నదులుగా పారి వరదలై పోయి అనే పాట బాగా హిట్టయింది కూడా . రాగమో అనురాగమో , కలికి చిలకురా , దొరల నీకు పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
కొబ్బరాకు గాలి అనే పాట చాలా బాగా వ్రాసారు వేటూరి . అన్ని పాటలూ ఆయనే వ్రాసారు . బాల సుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకిలు పాడారు . పాటల చిత్రీకరణ విషయంలో దర్శకుడిని , ఫొటోగ్రఫీ డైరెక్టర్ గోపాలరెడ్డిని , కెమేరామేన్ రఘుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి .
1982 ఏప్రిల్ పదిహేనున రిలీజయిన ఈ సినిమా ఎనిమిది సెంటర్లలో వంద రోజులు , అదీ పిల్ల హీరోహీరోయిన్లతో ఆడింది. హైదరాబాద్ దేవి థియేటరుతో సహా మూడు కేంద్రాలలో సిల్వర్ జూబిలీ కూడా చేసుకుంది . ప్రముఖ దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ .
1983లో ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ హిందీలోకి బేకరార్ అనే టైటిలుతో రీమేక్ చేసారు . సంజయ్ దత్ , పద్మిని కొల్హాపురి , సుప్రియా పాథక్ , మోహిష్ బెహ్ల్ నటించారు .
మన తెలుగు సినిమా , పాటల వీడియోలు , సుత్తి జంట సీన్లు , ఇతర ముఖ్య సన్నివేశాలు అన్నీ యూట్యూబులో ఉన్నాయి . మాతరంలో వారందరూ చూసే ఉంటారు . ఈనాటి కుర్రతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . చూడతగ్గ మంచి సినిమా .
సప్తపది సినిమాలాగా మరీ విప్లవాత్మక ముగింపుని ఇవ్వలేదు జంధ్యాల . సాధ్యం కాదు కూడా . కారణం అప్పటికే నరేష్ పెళ్లి అయిపోయి ఉండటం . అందుకే పూర్ణిమ పాత్రను చంపేసారు . సరయిన ముగింపే . A watchable , tender love , romantic movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
వయసు మళ్లిన హీరోలు, హీరోయిన్లతో అరిగి, అరిగి, ఒరిగి పోయిన తెలుగు తెరకు టీనేజ్ ప్రేమ కథలను ఫ్రెష్ గా, తాజాగా అప్పుడే చెట్టు నుంచి కోసి తెచ్చినట్టు అందించిన సున్నితమైన ప్రేమ కథలను, నవ్వులతో మేళవించి కళ్లముందుంచిన జంధ్యాల ఎంత మంది పిల్లలను హీరో హీరోయిన్లుగా తెరపైకి తెచ్చాడో కదా ?! (వసుధ బీ రావు)
Share this Article