ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ పాట… అది సినిమాల్లోనైనా, టీవీల్లోనైనా, యూట్యూబులోనైనా… మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు… ఐతే మొన్నమొన్నటిదాకా చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా పాటలతో పాటు దసరాలో కీర్తి సురేష్ బ్యాండ్ డాన్స్ పాపులర్… షార్ట్స్, రీల్స్‌లో ఫుల్ హడావుడి అవే… ఫంక్షన్లలోనూ అవే… చిన్న పిల్లల దగ్గర్నుంచి ఓ వయస్సొచ్చిన మహిళల దాకా అవే గెంతులు…
ఒక పాట పాపులారిటీని లెక్కించడానికి కొత్త కొలమానం షార్ట్స్, రీల్స్… ఎక్కువ ఏ పాట ట్రెండ్ అవుతుంటే అది సూపర్ హిట్ అన్నమాట… హఠాత్తుగా ఇప్పుడు మరో రెండుమూడు నాగదుర్గ నటించిన పాటలు ట్రెండింగ్‌లో కనిపిస్తున్నయ్… ఇప్పుడు శుభకార్యాలు లేవు కాబట్టి ఫంక్షన్లలో డాన్సులు చేసే రీల్స్, షార్ట్స్, వీడియో బిట్స్ కనిపించడం లేదు కానీ ఈ రెండు పాటల వీడియోలు మాత్రం ప్రైవేటుగా చిత్రీకరించుకుని యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పెట్టేస్తున్నారు…
Ads
మొదటి పాట… తిన్నా తిరం పడతలే, సున్నా తిరం పడతలే… బాధయితందే నీ యాదిల మనసంతా… మస్తు బరువయితందే నీ యాదిల మనసంతా… అంటూ చిన్న చిన్న కలహాలతో దూరమైన మొగుడిని, ప్రియుడిని తలుచుకుంటూ ఓ యువతి పాడుకునే పాట అది… నిజానికి ఈ పాటకు బీట్ అంత నప్పదు అనుకుంటాం గానీ ఫోక్ సాంగ్స్ చెవికింపుగా పాడే గాయని లక్ష్మి గొంతులో బీట్‌కు తగినట్టు ఒదిగింది పాట… ఒరిజినల్ రచయిత (మట్ల తిరుపతి?) ఎవరో, ఒరిజినల్ వీడియో ఏ సంస్థదో తెలియదు గానీ, ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓసారి లక్ష్మి పాడగా చూడటమే… సుడిగాలి సుధీర్‌తో రెండుమూడు స్టెప్పులు కూడా వేసింది…
తరువాత సైటీవీ వాళ్లు కావచ్చు, యూట్యూబ్ సూపర్ స్టార్ నాగదుర్గతో ఇదే పాట షూట్ చేసి వదిలారు… కోట్లల్లో వ్యూస్… అందులో నాగదుర్గ డాన్స్ గట్రా ఏమీ లేవు, ఐనా సూపర్ హిట్… ‘నా గుండెలో బాధ నీ గుండెకు గురుతొస్తలేదా… పంతాలు ఇడుసపెట్టు, ఇకనైనా చేయిపట్టు’ అంటూ లేడీస్ షార్ట్స్, రీల్స్ తెగ చేసేస్తున్నారు… నిజానికి ఈ పాట కూడా పాతదే… రెండేళ్లుగా ఉన్నదే… కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది… మరోపాట కాపోళ్ల ఇంటికాడ కాములాటనట… పడుచోళ్లంత వచ్చి ఆడుకుంటరట… ఆడబోదమా బావా, మనం చూడబోదామా… ఇదీ పాట… శాలోళ్లు, బెస్తోళ్లు అంటూ కొన్ని కులాల పేర్లు చెబుతూ సరదాగా తన బావను ఉద్దేశించి పాడే పాట ఇది…
ఈ డాన్స్ కూడా కొంత కష్టమే అయినా మహిళలు, పిల్లలు తెగ తిప్పలు పడుతున్నారు… ఎంజాయ్ చేస్తున్నారు… మూడో పాట జిల్లేలమ్మ జిట్ట… ఏందే ఏమే అంటాడు, వాడి పెళ్లాన్నే నేనయినట్టు, ఐనా కోపం రాదేందే వాడి మాయల నేను పడ్డట్టు… ఇలా సాగుతుంది పాట… దీనికి నాగదుర్గ రేంజులో డాన్స్ చేయడం కష్టం… అందుకే అందరూ తమకు తోచినట్టు స్టెప్పులు వేస్తూ వీడియోలు చేస్తున్నారు… అదో ఆనందం… ఈ పాటలకు అనుకరణ వీడియోలకు కూడా లక్షల్లో వ్యూస్ ఉంటున్నయ్… ఈ మూడు పాటల ఒరిజినల్ రచయితలు, షూట్ చేసిన యూట్యూబ్ సంస్థలు, గాయకుల పేర్లు తెలిస్తే ఫేస్‌బుక్ కామెంట్స్‌లో పెట్టగలరు…
Share this Article