.
Bp Padala …. కాలం తన అవసరాలకు పనికివచ్చే మతాలను , వ్యవస్థలను , సిద్ధాంతాలను , వ్యక్తులను ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటుంది . అవసరం తీరగానే కాలగర్భంలోకి విసిరికొడుతుంది . పరస్పరం సంఘర్షించుకునే శక్తులు ఈ సాదృశ్యంలో భాగమే . ఏది మంచి కాదు , ఏది చెడూ కాదు . అప్పటి అవసరం అంతే .
గణరాజ్యం ,రాచరికం , ప్రజాస్వామ్యం , ఫ్యూడలిజం, కమ్యూనిజం , కాపిటలిజం పేక ముక్కల్లా చరిత్ర ఆటలో చేతులు మారుతుంటాయి . మన దగ్గరున్న ముక్కలతోనే మన ఆట ఆడాలి . విజయమైనా , అపజయమైనా అన్ని ముక్కలు ఆట చివరిలో చరిత్ర పెట్టెలో సర్దుకుంటాయి , ఇంకో ఆటకు తెరిచేదాకా .
Ads
వైదిక , బౌద్ధ సంవాదాలు , క్రూసేడ్, జిహాదిల సంఘర్షణలు , కోల్డ్ వార్లూ , హాట్ సరిహద్దులూ ఈ ఆటలో తాత్కాలిక తురుపుముక్కలే . చర్చిల్ , హిట్లర్ , గాంధీ ఒకే ఆటలో ముక్కోణాలే . కాలం బహు నేర్పరి . నియంత…
బుద్ధుడు , ఆదిశంకరుడు , మార్క్స్ , గాంధీ , ఇందిర, మోడీ ఇలా ఒకవైపు తూగిన ప్రపంచపు త్రాసును బాలన్స్ చేయడానికి తగిన రాళ్లను ఏరుకుంటుంది . సూక్ష్మ దృష్టిలో తప్పులుగా కనిపించినవి స్థూల సమీకరణంలో ఒప్పులుగా మారతాయేమో , మన దృష్టిని ఒకింత విశాలం చేసుకుంటే …
ఒక సంధికాలంలో కాలం తనమీద పెట్టిన గురుతర బాధ్యతను కమ్యూనిజం , తద్వారా ఉద్భవించిన నక్సలిజం ఘనంగానే నిర్వర్తించింది . అవసరం తీరగానే అదే కాలం కొత్త ఉదయాల కొరకు దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి విసిరేస్తున్నది . ఇందుకు వేదన పడవలసిన అవసరం లేదేమో , ఏదీ శాశ్వతం కాదనే సత్యం ఎరికలో …
(మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ వార్త విని, చదివి దుఖపడుతున్న చాలామంది మిత్రుల పోస్టులు చూశాక ఇది రాయాలనిపించింది…)
ఇదే సందర్భంగా ఓ మాట… చాలా ఏళ్ల క్రితం ఓ ఎస్పీ ఓ మాటన్నాడు… పూర్తిగా నక్సలైట్ల నిర్మూలన అనేది అసాధ్యం… రాజ్యం కోసం మేం, కొత్త రాజ్యం కోసం వాళ్లు… ఈ సాయుధ ఘర్షణలో కొన్నిసార్లు వాళ్ల మీద మాది పైచేయి… అంతే…
చాలా తీవ్రవాద సంస్థలు, పోరాటాలు కాలగతిలో కలిసిపోయాయి కదా అని ప్రశ్నార్థకంగా మొహం పెడితే… రాజ్య పీడన ఉన్నన్నాళ్లు రాజ్యం మీద తిరుగుబాటు ఉంటుంది… అది ధిక్కారం, అది ప్రతిఘటన, అది నిరసన… ఇప్పుడు అది పీపుల్స్ వార్ కావచ్చు, రేప్పొద్దున మరో రూపం కావచ్చు, మరో పేరు కావచ్చు అన్నాడు… అవునేమో, ధిక్కార పతాకం తాత్కాలికంగా అవనతం కావచ్చుగాక, నేలకొరగదు..!! (ముచ్చట)
Share this Article