నిజానికి నాని తప్పేమీ లేదు… టీవీ ప్రసారానికి కేవలం 1.88 రేటింగ్ రావడం అనేది అత్యంత దయనీయం… అతడు సినిమా లక్షాతొంభయ్యోసారి వేసినా ఇంతకుమించి రేటింగ్ వస్తుంది… సినిమా పేరు చెప్పనేలేదు కదూ… అంటే సుందరానికి… సినిమా పేరులాగే కథ, పాటలు, సంగీతం, కథనం, మన్నూమశానం అంతా గందరగోళం… నిజానికి క్రియేటర్‌కు గందరగోళం ఉంటే కళాఖండాలు వస్తాయని అంటారు కానీ,.. మరీ ఇలాంటి ఖండఖండాల కళలు వస్తాయని ఎవరూ అనుకోలేదు…
వస్తున్నా… నాని తప్పేమీ లేదు, నిజమే… సినిమా బాగా లేదన్నది నిజమే… కానీ టీవీ దరిద్రపు రేటింగ్‌కు ఇంకా చాలా కారణాలున్నయ్… అసలు జనం టీవీల్లో సినిమాల ప్రసారాల్ని పట్టించుకోవడం మానేశారు… కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలనే తీసి నేలకు కొట్టారు… ఇంకా చాలా చేదు అనుభవాలు రాబోతున్నాయి చూస్తూ ఉండండి… సింపుల్‌గా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎవడైనా చానెల్ వాడు సినిమాలకు అధికధర చెల్లించి కొన్నాడు అంటే వాడంత బిజినెస్ మూర్ఖుడు మరొకడు లేడన్నట్టు లెక్క…
జనం ఓటీటీలకు అలవాటు పడటం థియేటర్లకు దెబ్బ అన్నారు… కాదు, టీవీలకూ దెబ్బే… హాయిగా ప్రేక్షకులు తమకు తీరిక, ఓపిక ఉన్నప్పుడు కన్సర్న్డ్ యాప్స్ ఓపెన్ చూస్తున్నారు… ఇప్పటిదాకా నిర్మాతలకు థియేటర్ రైట్స్‌తోపాటు ఓటీటీ, టీవీ రైట్స్ డబ్బుతో బలిసిపోయింది… అదిప్పుడు కరిగిపోవడం ఖాయం… సో, అంటే సుందరానికి అనే సినిమా తాజా ఉదాహరణ మాత్రమే… ఇక కొన్ని అంశాలు చెప్పాలి… పైగా జెమినిలో వేశారు, ఎవడు చూడాలి..?
Ads
ఆమె ఎవరో తెలుసా..? కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు… పద్మశ్రీ గ్రహీత… వయస్సు డెబ్బయ్ ఏళ్లు… పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి మేనత్త… మంచి సంగీత కుటుంబం… పెద్ద పెద్ద వాళ్ల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది… నేర్చింది కర్నాటక సంగీతమే అయినా అన్నిరకాలూ పాడగలదు… ఎనిమిదో ఏటనే ఓ బంగారు పతకం పొందిన ఆమె అప్పట్నుంచీ పాడుతూనే ఉంది… ఆమె చరిత్ర చదువుతూ పోతే ఇలా చాలా చాలా విశేషాలు కనిపిస్తయ్… ఆమె పేరు అరుణా సాయిరాం… కళైమామణి, సంగీత చూడామణి, సంగీత కళాసారథి, సంగీత కళానిధి… ఇవీ ఆమె బిరుదులు…
ఎంత స్వర ఘనాపాఠీ అయితేనేం..? ఎంత విద్వత్తు ఉంటేనేం..? తెలుగు సంగీత ప్రపంచంలోకి అడుగుపెడితే ఇక బురద మరకలే కదా దక్కేది… ఇంతటి సంగీతవిశారదను తెచ్చుకున్నాం, కాస్త మంచి పాట పాడించుకుందాం అనే సోయి ఉంటే కదా… అదే ఉంటే ఫాఫం, తెలుగు సినిమా సంగీతంలో ఎందుకుంటారు లెండి… ‘‘అంటే సుందరానికి’’ సినిమాలో ఓ పాట చేసింది ఆమె… మనం ఈమధ్య హలామితీ హబీబో అనే కుత్తుక దిగని ఓ అరబిక్ కుత్తును… దర్జా అని రాబోయే సినిమాలో శివంగి క్షుద్రశక్తుల పాట ‘‘ధా… రా… ణా… హా… ఛే… నో… రా… హా…’’ గురించి చెప్పుకున్నాం కదా… ఈ సుందరం పాట కూడా అంతే…
‘‘సారోరూ… ఫేడ్ అయిపోయే ఫ్రీడం మీదింకా… ఎహె, మీదింకా… సారోరూ… డూపే లేకుండా ఫ్రీడం ఫైటింకా..’’ అని స్టార్ట్ అవుతుంది పాట… కొద్దిసేపు యానిమేషన్ బొమ్మలు… ఏదో పంచెకట్టు పాట అన్నారు గానీ, ఆ సంప్రదాయికత కనిపిస్తే ఒట్టు… కాసేపు అరుణకు కళ్లద్దాలు పెట్టి, నానా వేషం వేయించారు… పాట తక్కువ, పరేషాన్ ఎక్కువ… ఈ సారోరూ అంటే హేమిటో సదరు పాట రచయిత గోలి హసిత్ కనిపించినప్పుడు అడగాలి… సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌కు తెలుస్తుందని అనుకోలేం… అసలు ఇలాంటి సినిమాలకు పాటలే ప్రాణం… అవే ఇలా బురదరికంలో ఉంటే ఇంకేం అనగలం..?
అరుణా సాయిరాం మాత్రమే కాదు… చాగంటి సాహితి, భట్ల దామిని, మేఘనా లక్ష్మి, సాయిచరణ్, సత్సంగి చైతు, రితేష్ కూడా స్వరం కలిపారుట పాపం ఈ పాటకు… ఐనా సరే, పాట వింటే అదోలా ఉంది… ‘‘సరదాకే సురకేశారు..’’ వంటి ఇనుప గుగ్గిళ్ల గురించి ఏం చెప్పుకుంటాంలే గానీ… సినిమా గురించి చెప్పుకుంటే… సగటు హిందూ కుటుంబం అంటే అది బ్రాహ్మణ కుటుంబమే అయి ఉండాలా..? అందులోనూ ఓ సగటు బ్రాహ్మణ కుటుంబం అనగానే మూఢనమ్మకాలు, మితిమీరిన ఆచారాలు, మడి, ఛాందస పోకడలు చూపించాలా..? నామాలు, బొట్టు, జంధ్యం, ఒకరకమైన యాస భాష ఎట్సెట్రా బ్రాండెడ్ లక్షణాలు ఉండి తీరాలా..? ఇతర మతాలను ఈసడించుకునే తత్వాన్ని రుద్దాలా..? ఆధునికతకు ఆమడ దూరంలో ఉన్నట్టుగా చిత్రీకరించాలా..? ఎల్లరకూ ఆ కులమే అలుసుగా దొరకనేల..?!
ఇలాంటి కథాదరిద్రం నడుమ మనం కొట్టుకుంటూ ఉంటాం… నాని నజ్రియాను మోస్తూ కనిపించాడు ప్రమోషన్లలో… నిజానికి ఆమెకన్నా అనుపమ పరమేశ్వరన్ బెటర్… కానీ ఆమెను ఆమడ దూరంలో ఉంచారు… నజ్రియా- నాని సంగతేమిటో గానీ… సగటు తెలుగు సినిమా హీరోయిన్ కామన్ ఫీచర్స్ ఏమీ లేవు ఆమెకు… సాదాసీదా అందం… పెద్దగా నటనలో పరిణతి, అసాధారణ ప్రతిభా అంటే అదీ లేదు… మరి ఆమే ఈ పాత్రకు సరైన ఎంపిక అని నాని మొదటి నుంచీ కలగన్నాడట… బోలెడు ప్రెస్‌మీట్లలో బొచ్చెడు పూలు పెట్టాడు నాని…
అసలు రెండు గంటల సినిమా అంటేనే చాలా ఎక్కువ నిడివి ఈ రోజుల్లో… అసలు ఓ సాదాసీదా కథ కోసం థియేటర్లకు వచ్చి, నిలువు దోపిడీ ఇచ్చే రోజులు కావివి… అయితేనేం.. ఫాఫం, నానికి చాలా నమ్మకం… ఏకంగా మూడు గంటల సినిమా తెచ్చేశారు… బహుశా ఎడిటర్ ఒక్కసారి కూడా తన కత్తెరకు పనిపెట్టి ఉండడు… ఏ సోయిలో బతుకుతున్నారుర భయ్… ఫస్టాఫ్ అంతా తెలుగు టీవీ సీరియల్‌లా సాగదీసీ దీసీ… ప్రేక్షకుడికి పెద్ద పరీక్షే పెట్టారు… కరోనా అనంతరం కూడా ప్రేక్షకుల మానసిక స్టామినా బాగుందా లేదా అని పరీక్షించ దలుచుకున్నట్టున్నారు… ఆ పని ఆల్‌రెడీ సీరియళ్లు చేస్తున్నాయి కదా, మళ్లీ చిత్రవధ దేనికి నానీ… అన్యయం కదా… అందుకే ఈ వెరీ పూర్ రేటింగ్స్…!!
Share this Article