.
ఈ సంవత్సరం నేరాల సంఖ్య పెరిగింది… అంటే, గతంకన్నా నిజంగానే నేరాలు ఎక్కువ జరిగి ఉండొచ్చు, లేదా ఈసారి ప్రతి నేరాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తున్నారు కాబట్టి, నేరాల సంఖ్య ఎక్కువ కనిపిస్తుండొచ్చు…
ఎన్‌సీఆర్‌బీ నేరాలు, సురక్షిత నగరాలు, అరక్షిత నగరాలు అనే జాబితా చూసినప్పుడు పైన చెప్పిందే గుర్తొచ్చింది… ఎందుకంటే..? దేశంలో ఏమాత్రం సురక్షితం కాని నగరాలు, సురక్షిత నగరాలు అని విడివిడిగా జాబితాలు ఇచ్చింది ఆ నేరనమోదు బ్యూరో…
Ads
దానికి ప్రామాణికం ఏమిటంటే, నమోదైన నేరాల సంఖ్య… ముందుగా సురక్షిత నగరాల గురించి చెప్పుకుందాం… ప్రథమ స్థానం కోల్‌కతా… రెండో స్థానంలో హైదరాబాద్!
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారం, కోల్‌కతా వరుసగా నాలుగో ఏడాది కూడా భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది.. . 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్ నగరాలలో నమోదైన cognisable crimes (శిక్షార్హమైన నేరాలు) రేటు ప్రకారం ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు…
కోల్‌కతాలో నేరాల సంఖ్య తక్కువగా నమోదైంది కాబట్టి అది సురక్షిత నగరమని ముద్ర వేశారు… తెలంగాణ రాజధాని హైదరాబాద్ వాసులకు సంతోషకరమైన వార్త ఏమిటంటే… ఈ జాబితాలో హైదరాబాద్ రెండో అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచి, దేశంలోనే మెరుగైన భద్రత కలిగిన నగరంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది…
కోల్‌కతాలో లక్ష జనాభాకు కేవలం 83.9 cognisable నేరాలు మాత్రమే నమోదయ్యాయి… 2021లో 103.5గా, 2022లో 86.5గా ఉన్న ఈ రేటు, 2023లో మరింత తగ్గి కోల్‌కతా భద్రతను చాటింది… అత్యంత సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్ 332.3 నేరాల రేటుతో రెండో స్థానంలో ఉంది…
NCRB నివేదిక ప్రకారం: టాప్ 10 సురక్షిత నగరాలు
నగరం లక్ష జనాభాకు నమోదైన నేరాలు (Cognisable Crimes)
కోల్‌కతా 83.9
హైదరాబాద్ 332.3
పూణే 337.1
ముంబై 355.4
కోయంబత్తూరు 409.7
చెన్నై 419.8
కాన్పూర్ 449.1
ఘజియాబాద్ 482.6
బెంగళూరు 806.2
అహ్మదాబాద్ 839.3
NCRB నివేదిక ప్రకారం: టాప్ 10 సురక్షితం కాని నగరాలు
నగరం లక్ష జనాభాకు నమోదైన నేరాలు (Cognisable Crimes)
కొచ్చి (కేరళ) 3192.4
ఢిల్లీ 2105.3
సూరత్ 1377.1
జైపూర్ 1276.8
పాట్నా 1149.5
ఇండోర్ 1111.0
లక్నో 1015.9
నాగ్‌పూర్ 962.2
కోజికోడ్ 886.4
అహ్మదాబాద్ 839.3
నిజానికి కొచ్చి అంత భయంకరమైన నగరమా..? కాదు… కాస్త ఆరా తీస్తే… కొచ్చిలో 97.2 శాతం కేసుల్లో చార్జి షీట్లు వేస్తున్నారు… అంటే దర్యాప్తులో వేగం, కోర్టుల్లో చార్జి షీట్ల దాఖలులో వేగం ఇతర నగరాలకన్నా ఎక్కువ… మరి అంత పోలీసింగ్ ఉన్నప్పుడు అంత భారీగా నేరాల నమోదు ఏమిటి..?
సింపుల్… అక్కడ ప్రతి కేసూ నమోదు చేస్తారు… మరీ ముఖ్యంగా (Special and Local Laws – SLL) కింద నమోదైన కేసుల వల్ల ఈ సంఖ్య భారీగా కనిపిస్తోంది… సాధారణంగా SLL కేసులు అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు, మోటారు వాహన చట్టాల ఉల్లంఘనలు, చిన్నపాటి ఇతరత్రా ఉల్లంఘనలు వంటివి ఉంటాయి,.. వీటిని పోలీసులు కచ్చితంగా అమలు చేసి, ఎక్కువ కేసులు నమోదు చేస్తే మొత్తం నేరాల రేటు (Crime Rate) పెరుగుతుంది…
ఇంకా వివరాల్లోకి వెళ్తే… మొత్తం నేరాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, హింసాత్మక నేరాలు (Violent Crimes) లేదా హత్య వంటి తీవ్రమైన నేరాల రేటు కొచ్చిలో చాలా తక్కువగా ఉంది (ఉదాహరణకు, హత్యల రేటు లక్ష జనాభాకు ఒకటి కంటే తక్కువగా ఉంది)… మరి అత్యంత అరక్షిత నగరం ఎలా అయినట్టు..?
ఆశ్చర్యకరంగా, కొచ్చిలో కేసుల దర్యాప్తు వేగం, చార్జి షీటింగ్ రేటు చాలా ఎక్కువగా ఉంది… IPC నేరాలలో 97.2% – SLL కేసులలో 99.8% తో కలిపి మొత్తం ఛార్జ్-షీటింగ్ రేటు *98.9%*గా నమోదైంది… ఇది దేశంలోనే అత్యధికం… అంటే, పోలీసులు నేరం నమోదు చేయడంలోనే కాకుండా, దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు సమర్పించడంలోనూ సమర్థతను కనబరుస్తున్నారు…
సో, ఎన్‌సీఆర్‌బీ ప్రామాణికాల్లోనే తప్పుంది… అందుకే ఈ నేరాల రేటు గణాంకాల విశ్లేషణే తప్పు…!!
Share this Article