భర్త చనిపోతే… ఆ చితిపైనే సతీసహగమనం చేయించేవాళ్లు ఒకప్పుడు… ఆ నీచమైన సంప్రదాయాన్ని మెచ్చుకునే కర్కశులు ఇప్పటికీ ఉంటారు… కాలం ఆ సంప్రదాయాన్ని కనుమరుగు చేసింది… మరోరెండుమూడు తరాలు పోతే జనం సతీసహగమనం ఒకప్పుడు ఇండియాలో ఉండేదని చెబితే నమ్మరేమో బహుశా..! భర్త చనిపోతే బొట్టు తీసేసి, తెల్లచీరెలో మాత్రమే, ఏ శుభకార్యాలకు వెళ్లకుండా, ఇంట్లో ఓ మూల ఏడుస్తూ కూర్చోవాలని వాదించే మూర్ఖత్వం ఇప్పటికీ ఉంది…
నీతూకపూర్ తెలుసు కదా… రిషికపూర్ భార్య… రణబీర్ కపూర్ తల్లి… ప్రస్తుతం అలియా భట్ అత్తగారు… దేవుడిచ్చిన ఆరోగ్యం, సౌందర్యంతో 63 ఏళ్ల వయస్సులోనూ ఇంకా యుక్తవయస్కురాలిగానే కనిపిస్తుంది… రెండేళ్ల క్రితం భర్త మరణించాడు… టీవీ షోలలో, ఒకటీరెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో టైంపాస్ కోసం కనిపిస్తూ ఉంటుంది… ఆమె బతికేదే సినిమా వాతావరణంలో కాబట్టి మేకప్, పార్టీలు ఎట్సెట్రా కామన్… మొన్నీమధ్య కొడుకు పెళ్లి జరిగింది…
అలియాభట్‌ది కూడా సినిమా ప్రపంచమే… దాంతో పెళ్లి సందర్భంగా హంగామా సహజం… ఆ ఫోటోల్ని, వీడియోల్ని నీతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది, కొడుకు పెళ్లిని ఆనందిస్తోంది… 18 లక్షల మంది ఫాలోయర్లుంటారు ఆమెకు… చాలామంది ట్రోలర్లకు ఇది నచ్చలేదు… ఇక స్టార్ట్ చేశారు ట్రోలింగ్… మొగుడు చచ్చిపోయి రెండేళ్లు కూడా కాలేదు, ఎంజాయ్ చేస్తోంది అంటూ… అంటే, ఆమె ‘క్రయింగ్ విడో’లాగా ఉండాలని భావన…
Ads
అవి చదివిన ఆమెకు సహజంగానే చిర్రెత్తింది… అలాంటి ఫాలోయర్స్‌ను బ్లాక్ చేసిపారేస్తోంది… అదే చెబుతూ… ‘‘ఈరోజుకూ భోజనం చేసే దగ్గర కూడా నా భర్త గుర్తొస్తాడు మా కుటుంబానికి… ఆయన ముచ్చట్లే మాట్లాడుకుంటూ ఉంటాయి… అంతగా ఆయన జ్ఞాపకాలు మా గుండెల్లో, మాలో ఉన్నాయి… ఈరోజుకూ రణబీర్ తండ్రి ఫోటోనే స్క్రీన్‌సేవర్‌గా వాడతాడు… కొందరు ఏడుపులో, ఇంకొందరు నవ్వులో సాంత్వన పొందుతారు… నేనిలాగే ఉంటా… ఆనంద సమయాల్లో ఆయన్ని ఇంకా ఎక్కువగా గుర్తుచేసుకుంటాం… తన జ్ఞాపకాల్ని సెలబ్రేట్ చేసుకుంటాం..’’ అని ఓ స్ట్రాంగ్ రిప్లయ్ కూడా ఇచ్చింది… అవునూ, భర్త మరణిస్తూ ఆమె జీవితం కూడా అక్కడే ఆగిపోవాలా..?!
Share this Article