ఇంకేముంది..? తెలంగాణ రాష్ట్ర విద్యుత్తును ఆదానీ పరం చేయబోతున్నారు… అని నిన్నటి నుంచీ ఒకటే రచ్చ… బీఆర్ఎస్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ ఓ ఫస్ట్ పేజీ స్టోరీ పబ్లిష్ చేసేసి అయ్యో, అమ్మో, ఇంకేమైనా ఉందా..? పంపుసెట్లకు మీటర్లు పెడతారు, ఉచిత విద్యుత్తు ఉండదు, ఇక వేల కోట్ల వ్యవస్థలపై ఆదానీ గుత్తాధిపత్యం, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం, సేవలపై అదనపు భారమూ పడొచ్చు అని మొత్తుకుంది…
నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తున్నదా..? ఆదానీకి ప్రయోగాత్మకంగా ఓల్డ్ సిటీ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే ప్రతిపాదన ఉంది, రేవంత్ సర్కారు ఇవ్వబోతోంది అనే స్టోరీ అది… సరే, ఎలా, ఎక్కడ మొదలైందో గానీ జరగాల్సిన చర్చే ఇది… ఓల్డ్ సిటీ అని మాత్రమే కాదు… రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు పేరిట బోలెడు అక్రమ కనెక్షన్లు, పవర్ థెఫ్ట్, టెక్నికల్ లాసెస్, సిబ్బంది అవినీతి… వీటికితోడు ప్రభుత్వం నుంచి అరకొర సబ్సిడీల సాయం… వెరసి డిస్కంలు కునారిల్లిపోతున్నాయి…
Ads
నిజంగా ఉచిత విద్యుత్తు పోతుందా..? ఆదానీ గుత్తాధిపత్యం వస్తుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం… రాదు..! ఎందుకంటే..? దేశంలో ఏ కాలం నుంచో ప్రైవేటు విద్యుత్తు పంపిణీ ఉంది… ఏనాటి నుంచో విద్యుత్తు సంస్కరణలు చర్చల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి, డిస్కమ్స్ ప్రైవేటు రంగంలో కూడా ఉన్నాయి… ఏదో విపత్తు ముంచుకురాబోెతున్నదనే క్యాంపెయిన్ దురుద్దేశపూరితం…
2009లోనే పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఇది… ఇవన్నీ కుప్పకూలాయా..? విద్యుత్తు పంపిణీ సేవలు అందించడం లేదా..? పైగా రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది ప్రతి రాష్ట్రానికీ… వ్యవస్థలో వినియోగదారులు, పంపిణీదారులు, ఉత్పత్తిదారులందరి ప్రయోజనాల్ని రక్షించే బాధ్యత దానిది…
ఉచిత విద్యుత్తు సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ లెక్కలన్నీ వేస్తుంది అది… రేప్పొద్దున డిస్కమ్‌ను ప్రైవేటీకరించినా సరే, ఉచిత విద్యుత్తు, తక్కువ వినియోగమున్న కేటగిరీలకు సబ్సిడీలను ప్రభుత్వం ఆ ప్రైవేటు కంపెనీకి చెల్లిస్తుంది… అంతేతప్ప, ఇక మొత్తం నీదే వ్యవస్థ, ఏమైనా చేసుకో అని వదిలేయదు…
పైగా ఇప్పుడు బిల్లింగ్ వంటి కొన్ని పనులనే ఔట్ సోర్సింగ్‌కు ఇస్తారనే సమాచారం అయితే ఉంది… కాదు, మొత్తం డిస్కమ్‌ను ఇచ్చేస్తారు అంటే ఇస్తే తప్పేమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది… ప్రభుత్వ వ్యతిరేకతతో అధికార పార్టీ మీద బురద జల్లడానికి దీన్ని ఉపయోగించుకోవడమే తప్ప రియాలిటీ జోలికి పోలేకపోవడం ఇది..!
విద్యుత్తు ఉత్పత్తి గతంలో అధికంగా ప్రభుత్వరంగంలోనే ఉండేది… ఇప్పుడు ప్రైవేటు రంగం మెజారిటీ వాటాను ఆక్రమించేసింది… పోటీ అధికం… గిరాకీని బట్టి రేట్లు పడుతున్నాయి, పెరుగుతున్నాయి… కేంద్రం కొన్ని ప్రైవేటు ట్రాన్స్‌మిషన్ లైన్లకూ పర్మిషన్ ఇస్తోంది… డిస్ట్రిబ్యూషన్‌లో ఆశించినంత వేగంగా ప్రైవేటీకరణ జరగడం లేదు గానీ ఆల్రెడీ ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి…
ఒకప్పుడు టెలికాం రంగం పూర్తిగా ప్రభుత్వరంగంలోనే… అదీ ఓరకంగా గుత్తాధిపత్యమే… అప్పట్లో ఫోన్ కనెక్షన్ కాావాలంటే ఎన్ని తిప్పలు..? సేవల్లో నాణ్యత ఎలా ఉండేది..? ఇప్పుడు టెక్నాలజీ, సర్వీస్, నాణ్యత మాటేమిటి..? ప్రైవేటు రంగాన్ని ఎప్పుడూ తిట్టిపోయాల్సిన పనిలేదు… కొన్ని ప్రయోగాలకు వెనుకంజ వేయాల్సిన పనీ లేదు… కాకపోతే కట్టుదిట్టాలు ఉండాలి… అంతే..!
చివరగా… జన్యుమార్పిడి పంటలు, అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ మీద చాలా ఏళ్లు పోరాటాలు జరిగాయి, మంచివి కావు అంటూ… కానీ ఇప్పుడు..? పత్తి విత్తనాల్లో 95-98 శాతం వరకూ అవే… ఏదీ ఆగదు… అవసరం అన్నింటినీ ఆహ్వానిస్తుంది..!!
Share this Article