తను నటించిన గాలోడు అనే సినిమా ప్రమోషన్ కోసం సుడిగాలి సుధీర్ బోలెడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో కూడా ఓ పే-ద్ద ఇంటర్వ్యూ వచ్చింది… టీవీ కోణంలో తను సూపర్ స్టార్ కానీ సినిమాల కోణంలో తను చిన్న స్టార్… ఐనా అంత పెద్ద ఇంటర్వ్యూ పబ్లిష్ చేయడం కాస్త ఆశ్చర్యం అనిపించింది… కానీ అందులో ఒక ప్రశ్న, దానికి సుధీర్ జవాబు ఇంట్రస్టింగుగా ఉన్నాయి…
అందరికీ తెలుసు… జబర్దస్త్ అంటేనే బూతు షో… అక్రమ సంబంధాలు, వాటిపైనే స్కిట్లు, ద్వంద్వార్థాలు, అసభ్యత, అశ్లీలం… మరి దాంతోనే రేటింగ్స్ వస్తున్నాయి కాబట్టి, ఇది తప్ప ఈటీవీలో వేరే అధిక జనాదరణ ఉన్న షో మరొకటి లేదు గనుక దాన్నలాగే కొనసాగిస్తున్నారు… ఈమధ్య కొన్నాళ్లుగా కమెడియన్ల సంభాషణల్లోనూ బూతు పదాల్ని (మింగడం వంటి పదాల్ని వాడే చెత్తా భాష) యథేచ్ఛగా వాడేస్తున్నారు… ఏవగింపు మరింత అధికమయ్యేలా…
వాటిని జబర్దస్త్‌కు సంబంధం ఉన్న కమెడియన్లు సమర్థించకపోయినా… ఖండించరు..! తమకు ఆ ప్రోగ్రాం అన్నం పెట్టిందనో, అవకాశాలకు కత్తెర పడుతుందనో వెనుకంజ ఉంటుంది… వెబ్ సీరీస్‌లలో ఇంకా ఘోరం కదా, సీన్లకు సీన్లు పోర్నాతిపోర్నంగా ఉంటున్నాయి కదా, వాటితో పోలిస్తే జబర్దస్త్ ఎంత అనేవాళ్లూ ఉంటారు… కానీ జబర్దస్త్ వేరు, ఇంటిల్లీపాదీ చూస్తుంటారు, కొన్నిసార్లు కలిసి కూడా… వెబ్ సీరీస్ ఆప్షనల్… పైగా ఒక ఏక్తాకపూర్ టేస్టు, ఒక రామోజీరావు టేస్టు ఒకటే అందామా..?
Ads
అయితే జబర్దస్త్ ద్వారా స్టార్‌గా ఎదిగిన సుధీర్ కూడా ఈ విమర్శలతో ఏకీభవించడం ఆశ్చర్యం అనిపించింది… (మొన్నామధ్య అనసూయ కూడా జబర్దస్త్ విడిచిపెట్టి వెళ్తూ ఏవేవో నెెగెటివ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు కనిపించాయి…) పైగా కొన్ని నెలలు విరామం తీసుకుని జబర్దస్త్ నుంచి వచ్చి, గాలోడు సినిమా మీద కాన్సంట్రేట్ చేశాను అంటున్నాడు సుధీర్… అంటే మళ్లీ వెళ్తాడా..? అంత సీన్ కనిపించడం లేదు… ఐనాసరే, పెద్దగా ఏ అంశంలోనూ నెగెటివ్‌గా కామెంట్స్ చేయడు సుధీర్ సాధారణంగా… తన మీద జోకులేస్తేనే పట్టించుకోడు… డౌన్ టు ఎర్త్… అలాంటిది జబర్దస్త్ మీద కామెంట్స్‌తో ఏకీభవించడమే విశేషం… ప్రశ్న ఏమిటంటే..? ‘‘‘జబర్దస్త్’ లాంటి షోల్లో ద్వంధార్థాలు, అసభ్య సంభాషణలు ఎక్కువ అనే విమర్శలను ఎలా చూస్తారు?’’
దానికి సుధీర్ సమాధానం (ఆంధ్రజ్యోతిలో వచ్చిందే…) ‘‘ఆ విమర్శలతో నేనూ ఏకీభవిస్తాను. వాటిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారా… లేదా అనేది మాత్రం నాకు తెలియదు. అది టీఆర్పీని బట్టి తెలుస్తుంది. అన్ని వయసులవారూ చూస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ‘జబర్దస్త్’ ప్రారంభించాం. ప్రేక్షకులు చూస్తుండడంతో మేము చేస్తూ వచ్చాం. ఉదాహరణకు యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఆడితే, అందరూ యాక్షన్ సినిమాలు తీయాలనుకుంటారు కదా… అలా!
టీఆర్పీ బాగా రావడంతో ‘ఓహో జనాలు దీన్ని చాలా ఇష్టపడుతున్నట్లున్నారు’ అనుకుని కొనసాగించాం. అంతే తప్ప ఇలా చేస్తే జనాలు చూస్తారు అని కావాలని చేయలేదు. కానీ మనసులో ఓ మూల ఇలాంటివి చేయకూడదు అనే అంతర్మథనం అయితే ఉంది. ప్రారంభంలో ఏదో ఒకటి చేసి, జనాలకు తెలియాలనే యావ ఉంటుంది. కొంచెం గుర్తింపు వచ్చాక మాత్రం బాధ్యతాయుతంగా మెలగాలనిపించింది. పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకూ చెడు చెప్పకూడదనుకున్నాం. కానీ కొన్నిసార్లు తప్పలేదు. అలాగే స్కిట్లలో హీరోలను అనుకరించడం కూడా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగేదే తప్ప కావాలని చేసింది కాదు…’’
Share this Article