మూడేళ్ల క్రితం కావచ్చు… ఎడ్వర్డ్ ఆండర్సన్ అనబడే ఓ బ్రిటిష్ ప్రొఫెసర్ ‘ఇడ్లీ అనేది ఈ ప్రపంచంలోకెల్లా బోరింగ్’ అని ఓ విమర్శ పెట్టాడు ట్విట్టర్‌లోనో లేక జొమాటో ఇంటరాక్టివ్ చాట్‌లోనో… ఇక దాని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది… ప్రపంచవ్యాప్తంగా ఇడ్లీ ప్రేమికులు, అందులో సౌత్ ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లు విరుచుకుపడ్డారు… శశిధరూర్, ఆయన కొడుకు ఇషాన్ సహా… సదరు ప్రొఫెసర్‌కు ఇడ్లిగేట్ అనే బిరుదు కూడా ఇచ్చిపడేశారు…
జాగ్రత్తగా గమనించండి… ప్రెస్ ఫ్రీడం, హ్యూమన్ ఇండెక్స్, పావర్టీ, మాల్ న్యూట్రిషన్ సహా లివబుల్ కంట్రీ దాకా రకరకాల అంతర్జాతీయ సర్వేలు ఇండియాను నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేస్తుంటాయి… మన దేశాన్ని ఓ అనాగరిక, అనామక, అరాచక దేశంగా చిత్రీకరిస్తాయి… ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ బేస్డ్… ఆయా సర్వేల శాస్త్రీయత అతి పెద్ద ప్రశ్నార్థకం… సరే, విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారట…
151 రకాల ప్రసిద్ధ ప్రపంచ వంటకాల మీద జరిగిన ఈ అధ్యయనంలో ఇడ్లీ ప్రమాదకారిగా కనిపించిందట వాళ్లకు… ఇడ్లీతోపాటు రాజ్‌మా, చనా మసాలా, చికెన్ జాల్ ఫ్రెజి కూడా జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు అని తేలిందట… వాడెవడో, ఏం స్టడీయో, ఏం చేశాడో, ఎందుకు చేశాడో గానీ ఆ వార్తను మన జాతీయ మీడియా కళ్లకద్దుకుని ప్రచురించింది… ఒక్కరూ కౌంటర్ చేయలేదు… ప్చ్, శశిధరూర్ కూడా వేరే యావగేషన్స్‌లో బిజీగా ఉండి ఉంటాడు…
Ads
‘పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం’… ఈ అంశం మీద అధ్యయనం అట… ఇడ్లీ, రాజ్‌మా ముడి దినుసుల సాగు వల్ల, దానికోసం భూమార్పిడి వల్ల కొన్ని జాతులే అంతరించిపోతున్నాయట, తద్వారా జీవవైవిధ్యమే దెబ్బతింటున్నదట… అబ్సర్డ్… ఇడ్లీ ప్రమాదకారి అయితే వరి, గోధుమ బాపతు వంటలన్నీ ప్రమాదకరం అయి ఉండాలి కదా…
వరి, గోధుమ కేవలం ఇండియా ప్రధాన ఆహారమే కాదు… దాదాపు ప్రపంచమంతా వ్యాపించిన పంటలు… మనిషి మనుగడను శాసించే పంటలు… వందల తరాలుగా లేనిది ఇప్పుడే జీవవైవిధ్యం ముప్పులో పడిందా..? ఇవే సోకాల్డ్ డెవలప్‌డ్ కంట్రీస్ డెవలప్ చేసే జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్, కలుపు నాశినులు, టర్మినేటర్లు, పురుగు మందులతో లేని ముప్పు ఇడ్లీ వల్ల వచ్చిపడిందా..? ఎవుడ్రా మీరంతా..?
రాజ్‌మా ఓ పప్పు దినుసు… నార్త్ ఇండియా, ప్రత్యేకించి పంజాబ్, హర్యానాల్లో ఫేమస్… దాని పోషక విలువలు అలాంటివి… అదీ అన్ని పప్పు దినుసుల్లాగా పండేదే… మరి దాంతోపాటు మొత్తం ఇండియాలో పండే ప్రతి పప్పు దినుసూ ప్రమాదకరమేనా..? ప్రధాన ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు లేకుండా భారతీయ ఆహారం ఏముంది..? అది మనిషి జీవనాధార ధార… చనా మసాలాను కూడా జాబితాలో కలిపేశారు, అదీ ఓ రకం పప్పుదినుసే… చికెన్ జాల్ ఫ్రెజి గురించి మనకు పెద్దగా తెలియదు… వాడికెందుకు ప్రధాన వంటకంగా కనిపించిందో…
ఇవే కాదు, మొత్తం 25 భారతీయ వంటకాలు జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయట… చెప్పండ్రా చెప్పండి… పచ్చిపులుసు, సర్వపిండి, ఉలవచారు, మసాలా దోసె, ఊతప్పం, వడ, పూరి… అన్నింటినీ వచ్చే సర్వేలో కలిపేయండి… ఈ జాబితాలో స్పానిష్ వంటకం “లెచాజో“ అగ్రస్థానంలోనూ, బ్రెజిల్‌కు చెందిన “మీట్ సెంట్రిక్ ఆఫెరింగ్స్“ రెండో స్థానంలోనూ ఉన్నాయిట. ఇడ్లీ ఆరో స్థానంలో, రాజ్మా కూర ఏడో స్థానంలో ఉన్నాయిట… మొత్తం బియ్యం, పప్పుధాన్యాల ఆధారిత వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారుట…
ఐనా పాకేవి, దూకేవి, ఈదేవి, ఉరికేవి, ఎగిరేవి… ఏదీ వదలకుండా తినేస్తుంటే ఆ మాంసాహారం వల్ల పెద్దగా జీవజాతులకు ప్రమాదం లేదట గానీ పక్కా సాత్వికాహారం ఇడ్లీతో ముప్పేమిట్రా బాబూ… త్వరగా జీర్ణం, న్యూట్రిషియస్, లో జీఐ… చివరకు సాంబారులో వాడే చింతపండు కూడా మన కడుపులకు, పేగులకు మేలు… పైగా ఇడ్లీ అనేది ఫర్మెంటెడ్ డిష్… ఆరకం వంటకాలు ఆరోగ్యానికి మంచివని ఒకవైపు అధ్యయనాలు చెబుతుంటే, రోజూ కోట్లకుకోట్ల ఇడ్లీలు కడుపుల్లోకి జారిపోతుంటే, వేల రకాల ఇడ్లీలు ఆత్మారాముడిని సంతృప్తిపరుస్తుంటే, పోయి పోయి మా ఇడ్లీ మీద పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా ఏంది..?!
Share this Article