.
సుమారు పదిహేడేళ్ల క్రితం.., మే 28, 2008న నేపాల్ 239 ఏళ్ల హిందూ రాజరికాన్ని రద్దు చేసింది. ఆ సమయంలో జ్ఞానేంద్ర షా రాజుగా ఉన్నాడు. 16,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దశాబ్దకాలపు అంతర్యుద్ధానికి ఇది ముగింపు పలికింది. హిందువులు అధికంగా ఉన్న ఆ దేశం సమాఖ్య, లౌకిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
ఆదివారం, వేలాది మంది గుమిగూడారు… దేశంలోని రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేమిపై వారి ఆందోళన… జ్ఞానేంద్ర షా తిరిగి రాజుగా రావాలని, దేశానికి రాజరికమే సరైనదని వారి డిమాండ్…
Ads
దేశమంతా పలుచోట్ల ఈ ఆందోళేనలు సాగుతున్నాయి… జ్ఞానేంద్ర షా కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు… ప్రజల మద్దతు స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఖాట్మండులోని విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా “రాజు గారూ రండి, దేశాన్ని కాపాడండి…” అనే నినాదాలు మారుమోగాయి…
“దేశం అస్థిరతను ఎదుర్కొంటోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలకు ఉద్యోగాలు లేవు… విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు కొరత ఉంది” అని 43 ఏళ్ల ఉపాధ్యాయుడు, రాజు గారి పాలనను సమర్ధిస్తున్న నిరసనకారుడు రాజింద్ర కున్వార్ అభిప్రాయం… 2008 నుండి నేపాల్ 13 ప్రభుత్వాలను చూసిందన్న విషయం “అస్థిరత”కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు…
నేపాల్‌లో రాజరిక ఉద్యమం వెనుక కారణాలు:
మొదట, ఇది కొత్తేమీ కాదు. రాజరికం రద్దు చేయడానికి ముందు, నేపాలీలు రాజును ఎక్కువగా గౌరవించేవారు. 2005లో షా అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత అది పడిపోయింది. 2006లో రాజరిక వ్యతిరేక నిరసనలు చెలరేగాయి, షా అనివార్యంగా తన అధికారాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అప్పగించవలసి వచ్చింది…
కానీ హిందూ రాజరికం పట్ల గౌరవం పూర్తిగా పోలేదు. రాజు గారిని తిరిగి పిలవాలని కోరుతూ ఎప్పటికప్పుడు నిరసనలు వెల్లువెత్తాయి. 2023లో ఖాట్మండు పోలీసులు రాజు గారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న గుంపుపై టియర్ గ్యాస్ ప్రయోగించారు…
ఆదివారం అదే తరహా ఆందోళనలు మళ్లీ కనిపించాయి… రాష్ట్రీయ ప్రజాస్వామ్య పార్టీ నేతృత్వంలో ఇది జరిగింది… ఖట్మండు పోస్ట్ మీడియా కూడా జ్ఞానేంద్ర షా పట్ల ప్రజాదరణ పెరిగిందని నివేదించింది… అయితే ఆ దేశంలోని రాజకీయ విశ్లేషకులు అతను తిరిగి అధికారంలోకి వస్తాడని భావించడం లేదు…
నేపాల్ ఇప్పుడు రాజు గారి పాలనను ఎందుకు సమర్థిస్తోంది? సంక్షిప్తంగా చెప్పాలంటే, నేపాలీ ప్రజలు ఒక గణతంత్ర దేశంగా తమ దేశం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ డేటా ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి క్షీణించింది.
2015లో రియల్ జీడీపీ తొమ్మిది శాతానికి చేరింది. గత సంవత్సరం ఐదు శాతం కంటే తక్కువకు పడిపోయింది. గత సంవత్సరం సగటు వినియోగదారుల ధరలలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉంది. ఆదివారం విమానాశ్రయంలో షాను స్వాగతించిన వారు తమ దేశం మరింత క్షీణించకుండా నిరోధించడానికి మార్పును ఆశిస్తున్నామని చెప్పారు…
జ్ఞానేంద్ర షా తిరిగి రావాలనుకుంటున్నారా? తను ఏ ప్రకటనా చేయనప్పటికీ, దేశంలోని భిన్న ప్రాంతాలకు ప్రయాణించడం వలన సింహాసనానికి తిరిగి రావడం గురించి ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. తను దానికి ఎదురు చూస్తూ, పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది…
కొత్త రాజ్యాంగంతో కూడి ఓ గణతంత్ర రాజ్యం మళ్లీ అంత తేలికగా రాజరికం వైపు తిరోగమిస్తుందా, లేక దాన్నే దిద్దుబాటుగా పరిగణిస్తుందా వేచి చూడాలి… కానీ ఒక్కటి… ఒకప్పుడు నేపాల్‌లో మావోయిస్టులు చండప్రచండంగా పోరాడారు… అధికారంలోకి వచ్చారు… కానీ ఏం ఒరిగింది..? రాజకీయ అస్థిరత, పాలన వైఫల్యాలు, ప్రజల్లో అశాంతి…!!
Share this Article