.
Subramanyam Dogiparthi ……. విజయశాంతి జైత్రయాత్రలో మరో ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 15 , 1983 న విడుదలయిన ఈ నేటి భారతం సినిమా . విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబుని చేయటానికే టి. కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది . టి. కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా . ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి ఎర్ర ప్రముఖులు అందరూ కలిసి తీసిన సినిమా . ఈ సినిమా నిర్మాత పోకూరి వెంకటేశ్వరరావు గారిది కూడా ఆ జిల్లాయే .
ఆరోజుల్లో ఈ సినిమా ఒక సంచలన విజయాన్నే సాధించింది . విజయశాంతి నటన సూపర్బ్ . ముఖ్యంగా క్లైమాక్సులో నలుగురు విలనాసురులను వేటాడి చంపి హాస్పిటల్ వద్దకు ఈడ్చుకుని వచ్చే సీన్ , కోర్టులో తన వ్యధను వ్యక్తపరిచే సీన్ అత్యద్భుతం . ఇంక సుమన్ . తెలుగులో ఇది మూడో సినిమా అనుకుంటాను . సంస్కారవంతమైన పోలీస్ ఆఫీసరుగానే కాకుండా ఒక సంస్కర్తగా వ్యవహరించే పాత్రను చక్కగా పోషించారు .
Ads
ఆ తర్వాత వరుసలో వచ్చేది శివకృష్ణే . ఉద్యోగార్ధిగా , సమాజంలో అక్రమాలను ఎదిరించే విప్లవ భావాలు కల యువకుడిగా చాలా బాగా నటించారు . ప్రధాన విలనాసురుడిగా నాగభూషణం . ఈ సినిమా టైంకు ముసలి నక్క అయిపోయాడు . ఇలాంటి నక్క పాత్రలు ఆయన వెడం చేత్తో చేసేయగలడు . ఆయనకు తోడు విలన్లుగా పి జె శర్మ , చలపతిరావు నటించారు .
ఇతర ప్రధాన పాత్రల్లో పి యల్ నారాయణ , రాజ్యలక్ష్మి , యస్ వరలక్ష్మి , రాజేశ్వరి , నర్రా వెంకటేశ్వరరావు , పోకూరి బాబూరావు , రాళ్ళపల్లి , మరెంతో మంది ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులు నటించారు . ఈ సినిమా ఘన విజయానికి దర్శకుని ప్రతిభ , కధాంశ రచన , చిత్రానువాద్రాలతో పాటు పాటలు , వాటిని వ్రాసిన మహాకవి శ్రీశ్రీ , అదృష్టదీపక్ , వాటికి శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన చక్రవర్తి .
శ్రీశ్రీ పాటలు వ్రాసిన ఆఖరి సినిమా ఇది అని పోస్టర్లో కూడా చూడవచ్చు . ఈ సినిమాలో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్ . ఎర్ర జెండా నా ఎజండా అని చెప్పుకున్న ఎర్ర రచయిత సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి ఈ పాటను వ్రాసారు . ఆయనే అదృష్ట దీపక్ . యస్ జానకి పాడారు .
శ్రీశ్రీ వ్రాసిన పాట అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం విజయశాంతి మీద చిత్రీకరించబడింది . ప్రేక్షకులకు బాగా నచ్చింది . సుశీలమ్మ పాడింది . చిట్టి పొట్టి పాపల్లారా పాటను కూడా అదృష్ట దీపకే వ్రాసారు . విద్యార్ధినులను ఆర్చరీలో తర్ఫీదు ఇస్తూ సాగే పాట . యస్ జానకే పాడారు . విజయశాంతి , సుమన్ల ఆదర్శ వివాహ సందర్భంగా వచ్చే గ్రూప్ డాన్స్ జంబైలో అంటూ సాగుతుంది . యస్ పి శైలజ , రమేష్ బృందం పాడారు . చిత్రీకరణ బాగుంటుంది .
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు అనే పాట మన దయనీయ ప్రభుత్వ ఆసుపత్రిల మీద చెణుకు , కొరడా . గొప్ప విషయం ఏమిటంటే ఈ నలభై ఏళ్ళల్లో పాలకులు ఎంతమంది మారినా చక్కగా ఆసుపత్రులు అక్కడే అలాగే వికసిస్తూ ఉండటం . దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే అధికార పార్టీల చెంచా డాక్టర్లు కూడా మారకపోవడం .
సినిమాలో డైలాగులు రయ్ రయ్ అని బాణాల్లాగా దూసుకు వస్తుంటాయి . ఎవరు వ్రాసారో ఐడియా లేదు . హరనాధరావు అనుకుంటా . Politician- Public Prosecutor- Public Doctor- Police nexus . 4Ps . అన్ని విప్లవ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా బాగా చూపారు . అయినా మనం రోజూ దేశంలో , రాష్ట్రంలో చూసేదేగా !
తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా కన్నడంలో ఇందినా భరత అనే టైటిలుతో తీసారు . శంకర్ నాగ్ , అంబిక ప్రధాన పాత్రధారులు . హిందీలో హకీకత్ టైటిల్ . జితేంద్ర , జయప్రదలు నటించారు . జయప్రద కూడా ఎర్ర పాత్రను వేసిందన్న మాట . తమిళంలో పుతియ తీరుపు టైటిలుతో వచ్చింది . విజయకాంత్ , అంబికలు నటించారు .
జనం చప్పట్లతో పాటు అవార్డుల వర్షం కూడా కురిసింది . ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగా , ఉత్తమ చిత్రం , ఉత్తమ సంగీత దర్శకుడు , ఉత్తమ సపోర్టింగ్ ఏక్టర్ నంది అవార్డులు వచ్చాయి . ఉత్తమ సపోర్టింగ్ ఏక్టర్ అవార్డు పి యల్ నారాయణకు వచ్చింది . తాగుబోతుగా , మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిలబడి సమాజానికి ప్రశ్నలను సంధించే పాత్రలో బాగా నటించారు . ప్రేక్షకులకు గుర్తుండే పాత్ర .
కాకపోతే నావరకు బాధ కలిగించే విషయం ఏమిటంటే ముగింపు చంపటంతో . చంపటంతోనే సమస్యలు పరిష్కారం అవ్వాలంటే చివరకు వాటిని అనుభవించేందుకు ఎవరు మిగులుతారు !? సమాధానం లేని , రాని ప్రశ్న . వదిలేద్దాం .
మాతరంలో ఈ సినిమా చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో చూడని వారు ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . వీడియో క్వాలిటీ అంతగా బాగాలేదు . అయిననూ చూడండి . టివిలో వస్తే మిస్ కాకండి . కళాపోషణతో పాటు కాస్త సామాజిక స్పృహ కూడా ఉండాలిగా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article