మొత్తానికి నాగార్జునకు, మాటీవీ వాడికి, బిగ్‌బాస్ నిర్మాతలకు తత్వం బోధపడింది… కోట్లకుకోట్లు ధారబోసి, ఆచితూచి ఎంపిక చేసిన సెలబ్రిటీలు నయాపైసా వినోదాన్ని ఇవ్వలేకపోతున్నారు… పైగా ఓవరాక్షన్లు, బూతులు, అశ్లీలం… దాంతో ఇక సామాన్యులతో ఈసారి సీజన్ నిర్వహించడానికి రెడీ అయిపోయారు… నిజానికి బిగ్‌బాస్ టీం ఎంపికల్లో ఏమేం మతలబులు ఉన్నాయో ఏం పాడో గానీ… గత రెండు మూడు సీజన్ల కంటెస్టెంట్లు పరమ బేవార్స్ ప్రదర్శన ఇస్తున్నారు… టీవీల్లో వచ్చిన అయిదు సీజన్లకన్నా ఓటీటీ బిగ్‌బాస్ సీజన్ మరీ దారుణం… వెగటు సీన్లతో రెచ్చిపోయారు హౌజ్‌మేట్స్…
దీంతో గతంలో కాస్తోకూస్తో బిగ్‌బాస్ మీద ఆసక్తితో చూసిన ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు… పైగా అది ఓటీటీ… ఓ నిర్ణీత సమయం లేదు… ఎడిటింగ్ లేదు… చివరకు నాగార్జున కూడా ఇంట్రస్టు కోల్పోయినట్టున్నాడు… ఏదో డబ్బు తీసుకుంటున్నాడు కాబట్టి, వారం వారం వస్తున్నాడు, ఏదో నిర్లిప్తంగా కథ నడిపించేస్తున్నాడు… ఏమాత్రం క్రియేటివిటీ లేని టాస్కులు, గేమ్స్… స్ట్రాటజీలు… అన్నింటికీ మించి వినోదాన్ని పంచే కంటెస్టెంట్లు లేరు…
యూట్యూబ్, సోషల్ మీడియా, టీవీ, రేడియో రంగాల నుంచి ఎంపికలు చేస్తున్నారు కానీ ఆ ఎంపికలోనే దరిద్రం ఉంది… ఓటీటీ సీజన్ కోసం ఎంపిక చేసినవాళ్లలో అధికులు పాతవాళ్లే… గతంలో విపరీతంగా ప్రేక్షకుల్ని విసిగించినవాళ్లే… మరి వాళ్లతో ఏం ఒరుగుతుందని మళ్లీ సెలెక్ట్ చేసినట్టు..? అసలు బిగ్‌బాస్ టీం వద్దే ఏదో తప్పుంది… దారి తప్పింది… ఫలితంగా ఓటీటీ బిగ్‌బాస్ సీజన్ అట్టర్ ఫ్లాప్… దీంతో ఈసారి దారి మార్చారు… ఇలా కోట్లకుకోట్లు ధారబోయడం దేనికి అనుకుని… కొత్తగా సామాన్యులతో ఓ సీజన్ చేయాలని ఫిక్సయిపోయారు…
Ads
సామాన్యులను ఎలా ఎంపిక చేస్తారో ఏమిటో తరువాత వివరిస్తారు… కానీ సామాన్యులకే ఈ సీజన్ అని నాగార్జునతో చెప్పించారు… ప్రోమో కూడా రిలీజ్ చేశారు… బెటరే… కాస్త వెరయిటీ… వైవిధ్యం… చాలా చీప్‌గా ఈ సీజన్ లాగించొచ్చు… మళ్లీ నాగార్జునే హోస్ట్… వచ్చే నెలలోనే స్టార్ట్… ఐనా ఏముందిలే..? అదే సెట్టు… అదే స్టూడియో… అదే హోస్ట్… ఈ సామాన్యులను తీసుకొచ్చి అందులో కట్టేసి, ఆడుకోవడమే కదా… ఆ టీంకు కూడా అలవాటైపోయినట్టుంది బాగా…
నిజానికి అలా ఓటీటీ సీజన్ అయిపోయిందో లేదో… అందులోని కంటెస్టెంట్ల నుంచే మళ్లీ బిగ్‌బాస్ సీజన్ 6 లోకి ఫలానా ఫలానా వాళ్లు వచ్చే చాన్సుందని అందరూ ఏవేవో పేర్లు రాసేస్తున్నారు… మళ్లీ వాళ్లనే తీసుకుంటే ఉద్దరించేది ఏముంది..? నిజానికి సీజన్ 4, 5 జనానికి విసిగించాయి… మూడో సీజన్‌లో ప్రేక్షకుడిని తమ శోకాలతో చావగొట్టారు కంటెస్టెంట్లు…
ఈ స్థితిలో రాబోయే ఆరో సీజన్ మీద కాస్త దృష్టి పెట్టకపోతే ఇదీ తలబొప్పి కట్టించడం ఖాయం… గతంలో వచ్చిన రేటింగ్స్‌తో 4, 5 సీజన్ల రేటింగ్స్ పోల్చితే బిగ్‌బాస్ టీంకే అర్థమవుతుంది… ప్రస్తుతం ఈ షో మీద జనం ఇంట్రస్టు ఎంత వేగంగా, ఎంత దారుణంగా పడిపోయిందో…!! మాటీవీ వాడికి ఏ రియాలిటీ షో కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయడం తెలియదు… అట్టహాసం, ఆడంబరం, ఖర్చు ఎక్కువ… ఫలితం తక్కువ… ఈ రియాలిటీ షో అయినా కాస్త చూసుకోరా నాయనా…!!
Share this Article