సాయుధ బలగాలు ఉన్న వాహనాల కాన్వాయ్ కదులుతోంది… అకస్మాత్తుగా అందులో ఒక వాహనం భారీ శబ్దంతో పేలిపోయింది… శకలాలు ఎగిరిపడ్డాయి… ఆ విధ్వంసం కాన్వాయ్‌లోని ఇతర వాహనాలనూ దెబ్బతీసింది… మరణాలు… రక్తం… గాయాలు… తెగిన అవయవాలు… అయితే అది మందుపాతర వల్ల జరగలేదు… ఏ సూసైడ్ టీం దూసుకురాలేదు… కనుచూపు మేరలో ఉగ్రవాదుల టీమ్స్ కూడా కనిపించలేదు… మరి ఆ పేలుడు ఎలా సంభవించింది..? దానికి కారణం… ‘స్టికీ బాంబ్’..! అవును… తాలిబన్ల చేతుల్లోని ప్రధాన ఆయుధం… ఇప్పుడు కాశ్మీర్‌లోకి ప్రవేశించింది… కొత్త కలవరాన్నే కలిగిస్తోంది… ప్రస్తుతానికి కాశ్మీర్లో ఏ ఒక్క సంఘటనా జరగలేదు… కానీ గత నెలలో కొన్ని స్టికీ బాంబ్స్ దాడుల్లో దొరికాయి… ఎంత భారీ సంఖ్యలో ఈ బాంబ్స్ కాశ్మీర్‌లోకి వచ్చిపడ్డాయో అంచనాలకు అందడం లేదు… అదీ కలవరానికి కారణం…
గురువారం సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ మీడియా మీట్లోనూ ఈ ప్రస్తావన వచ్చింది… ‘‘అవున్నిజమే… అదొక సవాల్… అందరినీ అలర్ట్ చేస్తున్నాం… జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాం’’ అన్నాడాయన… ఏడాది కాలంగా కాశ్మీర్లో 226 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేశారు… 296 మందిని అరెస్టు చేశారు… గతంలో సాయుధ బలగాలపై స్థానికులు రాళ్లతో దాడి చేయడం అనేది ఓ కామన్ సీన్… కానీ ఇప్పుడవి పది శాతానికి పడిపోయాయి… ఇంతకుముందులాగా కాదు, ఏదైనా ఇంట్లో టెర్రరిస్టులు దాక్కున్నారని తెలిస్తే, చుట్టుముట్టిన పోలీసులపైకి కాల్పులు జరిగితే… ఆ భవనాన్నే నేలమట్టం చేసేస్తున్నారు… ఇదంతా సరే కానీ… అసలు ఈ స్టికీ బాంబ్ ఏమిటి..? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?
Ads
IED… అంటే తెలుసు కదా… ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్… మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కువ పేలుడు శక్తి కలిగిన బాంబు… దాదాపు ఇరవయ్యేళ్లుగా అప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చేస్తున్నదేమిటంటే… సైజులో చిన్నవి, బరువు తేలికగా ఉండేవి, ఎక్కువ శక్తితో పేలేవి తయారు చేసి… తమ టార్గెట్లయిన అధికారులు, బలగాలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, నాయకులు, పౌరులను హతమార్చడానికి వాడుతున్నారు… ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు… టార్గెటెడ్ వాహనానికి ఎక్కడో ఓచోట రహస్యంగా తగిలించేస్తారు… నిర్ణీత స్థలానికి రాగానే రిమోట్‌తో పేల్చేస్తారు… కాసేపటికి అక్కడ ఉగ్రవాదులు ఎవరూ ఉండరు… విధ్వంసం మాత్రం భయంకరంగా ఉంటుంది… ఇప్పుడు కాశ్మీర్లో దొరికిన స్టికీ బాంబ్స్ కూడా అలాంటివే… లోకల్ మేడ్ కాదు… మరి..?!
అందరి సందేహాలూ ఏమిటంటే..? అఫ్ఘన్ తాలిబన్లకే పాకిస్థాన్ నుంచి సరఫరా అవుతాయి… పాకిస్థాన్ అంటే ఉగ్రవాదుల ఉత్పత్తి ఫ్యాక్టరీయే కాదు… ఉగ్రవాదానికి అవసరమైనవన్నీ సరఫరా చేసే ఫ్యాక్టరీ కూడా… అక్కడి నుంచే కాశ్మీర్‌లోకి వచ్చాయని మన ప్రభుత్వ అనుమానం… సరిహద్దుల నుంచి డ్రోన్ల ద్వారా వాటిని జారవిడవడం… లేదా సొరంగాలు తవ్వి, వాటి ద్వారా రవాణా చేయడం… ఇదీ మోడస్ ఆపరెండి… డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ డ్రగ్స్‌తోపాటు ఆయుధాల్ని కూడా జారవిడుస్తోందని పంజాబ్ సీఎం కూడా మొన్నామధ్య ఆందోళన వ్యక్తం చేశాడు తెలుసు కదా… మరి ఈ స్టికీ బాంబులకు పరిష్కారం ఏమిటి..? ఎలాగూ లోకల్ తయారీ లేదు కాబట్టి పాకిస్థాన్ నుంచి రాకుండా అడ్డుకోవడమే… మరి అదే కదా అసలు సమస్య..!!
Share this Article