1880… బ్రిటిష్ సైన్యంలో మార్టిన్ అనే కల్నల్… అఫ్ఘన్ యుద్ధం సాగుతోంది… అక్కడి వార్తలేమీ తెలియడం లేదు… ప్రతి సైనికుడి భార్యకూ భర్త ఇంటికొచ్చేవరకు భయమే కదా… మార్టిన్ భార్యకు ఎటూ తోచడం లేదు… మనసు నిమ్మళంగా లేదు… ఏదో ఆందోళన కుదిపేస్తోంది… నిద్ర రావడం లేదు… తను రోజొక లేఖ రాసేవాడు… ఆ సుదీర్ఘయుద్ధంలో ఏమైందో తెలియదు… లేఖలు ఆగిపోయాయి… అదీ ఆమె భయానికి, ఆందోళనకు కారణం…
ఎగిసిపడే భయాన్ని అదుపు చేసుకునేందుకు… దుఖాన్ని ఆపుకునేందుకు… ఆమె గుర్రాన్ని ఎక్కి దూరంగా స్వారీ చేస్తూ మనసును మళ్లించేది… ఓరోజు అలాగే గుర్రంపై వెళ్తోంది… స్థానిక బైద్యనాథ్ గుడిని దాటేసింది… అదేమో శిథిలావస్థలో ఉంది… ఎప్పుడూ దాన్ని ఆమె సీరియస్‌గా పట్టించుకోలేదు… కానీ ఆరోజు ఆ గుడి నుంచి వినిపిస్తున్న శంఖాల శబ్దాలు, మంత్ర పఠనం ఆమెను ఆపేశాయి… లోపలకు వెళ్లింది… అది ఆరతి సమయం… శివపూజ సాగుతోంది… మౌనంగా ఓచోట కూర్చుంది… కళ్లు మూసుకుంది…
మనసును ఏదో తెలియని ప్రశాంతత ఆవరిస్తోంది… కానీ మొహంలో ఆ దిగులు, ఆ ఆందోళన బయటికి కనిపిస్తూనే ఉన్నాయి… ఓ పూజారి ఆమెను చూసి, దగ్గరకు వచ్చాడు… ఏమిటమ్మా, దుఖపడుతున్నావు, కారణమేమిటో తెలుసుకోవచ్చా అనడిగాడు… ఆమె తన మనసులో ఉన్న శంకను చెప్పింది… కన్నీళ్లు ఆగలేదు… పూజారి ఆమె తలపై చేయి పెట్టి… ‘‘అమ్మా, మేం నమ్మేది శివుడిని… నీకూ నమ్మకం కలిగితే, మంచి జరగాలని కోరుకుంటే… పంచాక్షరి మంత్రాన్ని 11 రోజులపాటు పఠించు…’’ అని ఆమెకు ఆ మంత్రాన్ని నేర్పించాడు…
Ads
ఆమె సంకల్పం తీసుకుంది… యుద్ధం నుంచి గనుక తన భర్త క్షేమంగా తిరిగి వస్తే, శిథిలావస్థలో ఉన్న గుడిని పునర్నిర్మిస్తామని మొక్కుకుంది… ఆ పఠనంతో రోజురోజుకూ ప్రశాంతత చిక్కుతోంది… ఒంటరిగా కూర్చుని పఠిస్తూ, అందులోనే మునిగిపోయేది… పదోరోజు అఫ్ఘన్ నుంచి ఓ లేఖ వచ్చింది… భర్త రాసిందే… అందులో ఏముందంటే…?
‘‘ఓరోజు పఠాన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు… తప్పించుకునే మార్గం కనిపించడం లేదు… ఇక ప్రాణాలు పోయినట్టేనని అనుకున్నాను… మా దగ్గర ఆయుధాలు తక్కువ… ఆహారం కూడా సరిగ్గా లేదు, వాళ్లేమో వందల్లో ఉన్నారు… ఓ అఫ్ఘన్ పొడవాటి ఖడ్గంతో నామీదకు దూసుకొచ్చాడు… చివరి క్షణం వచ్చేసిందని భయపడ్డాను, నువ్వు గుర్తొచ్చావు… ఈలోపు హఠాత్తుగా ఓ ఎత్తయిన మనిషి వచ్చాడు అక్కడికి… పొడుగైన జుట్టు, నడుముకు పులిచర్మం… ఒంటికి బూడిద… చేతిలో త్రిశూలం… పఠాన్లపై భీకరంగా విరుచుకుపడ్డాడు… పఠాన్ సైనికులు పారిపోవడం మొదలెట్టారు… మా ప్రాణాలు నిలిచాయి… ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు… ఏదో తెలియని అద్భుతం…’’
ఆ లేఖ చదివిన మార్టిన్ భార్యకు కన్నీళ్లు ఆగలేదు… ఆ దేవుడే కాపాడాడనే నమ్మకం ఏర్పడింది… యుద్ధం నుంచి తిరిగి వచ్చాక భర్తతో కలిసి గుడికి వెళ్లింది… ఆ గుడి పునర్నిర్మాణానికి 15 వేల రూపాయలు ఇచ్చారు… అప్పట్లో 15 వేలు అంటే మాటలు కాదు… దగ్గరుండి పనులు చూసుకున్నారు… భక్తులుగా మారిపోయారు… తరువాత కొన్నాళ్లకు ఇంగ్లండ్ వెళ్లిపోయారు… ఇంట్లో ఓ శివుడి విగ్రహం పెట్టుకుని, జీవితాంతం పూజించారు…
గుడి ముందు ఉన్న శిలాఫలకం చెప్పే కథే ఇది… వాళ్లు రాయించిన కథే… అందరికీ తెలియాలని రాయించారు… ఈ గుడి మధ్యప్రదేశ్, షాజపూర్ జిల్లాలోని, అగర్ మాల్వాలో ఉంది… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి ఈ కథను అంటే… అప్పట్లో ముస్లిం పాలకులు కూలగొట్టిన, ఆక్రమించుకున్న హిందూ గుళ్ల గురించిన చర్చ జరుగుతోంది కదా… ఈ దేశంలో ఒక బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం గురించి కొత్త తరానికి తెలియాల్సిన అవసరం ఉందని అనిపించింది… అదీ సంగతి…
Share this Article