కీర్తి సురేష్ తల్లి మేనక (చిరంజీవి పున్నమినాగులో ఉంది, అసలు పేరు పద్మావతి)… నిర్మాత, ఒకప్పటి హీరోయిన్… తండ్రి సురేష్ కుమార్ నిర్మాత… సోదరి రేవతి వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్టు, షారూక్ రెడ్ చిల్లీస్‌లో పనిచేసింది… పుట్టుక నుంచీ తనది సినిమా వాతావరణమే… సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లు, డబ్బు, గ్లామర్, కుట్రలు, ప్రమాదాలు అన్నీ వింటూ, చూస్తూ పెరిగిందే…
మహానటి అనే పాత్ర ఆమెకు బోలెడంత అదృష్టాన్ని, కీర్తిని, డబ్బును, కెరీర్‌ను మోసుకొచ్చింది… ప్రతిభావంతురాలే, జాతీయ అవార్డుకు అర్హురాలే… కానీ సినిమా ఫీల్డులో ప్రతిభ అనేది జస్ట్, పదిశాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది… కీర్తి కూడా తను మహానటి తరువాత అంగీకరించిన ఏ పాత్రకూ న్యాయం చేయకుండా ఉండలేదు… సినిమాలు ఫ్లాపా, హిట్టా అనేది వదిలేస్తే తన బెటర్ పర్‌ఫామెన్స్ తను ఇచ్చింది…
కెరీర్ మాంచి జోరుగా ఉన్న స్థితిలో ఆమె కొన్ని హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేసింది… అవేవీ క్లిక్ కాలేదు… మొన్న చిన్ని పాత్రలోనూ బీభత్సమైన నటన ప్రదర్శించింది… అదీ పక్కా డీగ్లామరస్ రోల్… పాత్రానుసారం చింపిరి జుట్టు, మాసిన బట్టల్లో, వితవుట్ మేకప్, కొన్ని సీన్లలో ఆమెను చూస్తేనే భయపడేలా పర్‌ఫామ్ చేసింది… ఇవీ సరే, రజినీకాంత్, చిరంజీవిలకు సోదరి పాత్రల్లో నటించడం ఏమిటి..? ఇదీ చాలామందిని ఆశ్చర్యపరిచింది…
Ads
వాళ్ల పక్కన హీరోయిన్లుగా చేయడానికి చాలామంది వెనుకాడుతున్నారు… త్రిష వంటి వెటరన్ హీరోయిన్లు సైతం ఒప్పందాల్ని కేన్సిల్ చేసుకుంటున్నారు… ఈ స్థితిలో వాళ్లకు చెల్లెలు పాత్ర చేయడం ఏమిటి..? ఒకవైపు హీరోయిన్ సెంట్రిక్, చిన్న సినిమాల్లో డీగ్లామరస్ పాత్రలు… మరోవైపు చెల్లెలి పాత్రలు… ఇక ఆమెను క్రమేపీ అదే బాటలో తీసుకుపోతారనీ… రాను రాను అల్లరి నరేష్ అక్కగా, విశ్వక్‌సేన్ ఆంటీగా, నాగశౌర్య పిన్నిగా మార్చేస్తారనే జోకులు కూడా వినిపించాయి…
ఆమెకు కూడా అర్థమైందో, లేక ఎవరైనా హితవు చెప్పారో గానీ… కళ్లు తెరిచింది… ముందుగా ఒళ్లు చక్కబెట్టుకునే పనిలో పడింది… గతంలో కాస్త బరువు ఎక్కువగా కనిపించేది… సన్నబడింది… గ్లామర్ పెరిగింది… రంగ్‌దే ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు… మరక్కర్ పాత్రలో పెద్దగా గ్లామర్ లేదు… ఈ సమయంలో ఆమెకు సర్కారువారిపాట భలే చాన్స్ అన్నట్టు దొరికింది… అందాల ఆరబోతకు సై అనేసింది… మ మ మహేషా పాటలో నిజంగా ఓ కొత్త కీర్తి కనిపిస్తుంది… కీర్తేనా అనిపిస్తుంది…
ఈ పక్కా మాస్ పాత్ర ఆమెను ఆ డీగ్లామరస్, సిస్టర్ పాత్రల ప్రపంచం నుంచి బయటికి లాక్కొస్తుంది… ఆమెను ఇతరత్రా హీరోయిన్ల పక్కన నిలబెడుతుంది… శేఖర్ మాస్టర్ ఈ సినిమాలో పాటలకు డాన్స్ కంపోజర్ కదా… ఆమెకు భలే ఉపయోగపడ్డాయి… ప్రత్యేకించి ఒకటీరెండు పాటల్లో ఆమె మహేష్ పక్కన వేసిన హిప్ మూమెంట్స్ ఐటమ్ సాంగ్స్ తరహాలో అనిపించాయి… ఆమె ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులు అన్నీ కొత్త కీర్తిని చూపించాయి… ఏమాటకామాట స్టెప్పుల్లో ఈజ్ కనబర్చింది… అవసరం మరి…!! రాబోయే దసరా అనే సినిమాలోనూ ఫుల్లు మాస్ పాత్రేనట..!!
Share this Article