పది తలల రావణాసురుడు అంటే 6 శాస్త్రాలు, 4 వేదాలు చదివిన అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్ధం. ఎక్కువ మంది రామాయణం కుటుంబానికి సంబంధించినది అని, భారతం యుద్ధానికి సంబంధించినది అని చూస్తారు. కానీ రామాయణం పూర్తిగా అర్ధం చేసుకుంటే సన్ ట్జూ రాచిన “ది ఆర్ట్ ఆఫ్ వార్” కూడా ఎందుకూ పనికి రాదు. అత్యంత శ్రేష్టమైన యుద్ద వ్యూహాలు రామాయణం లో కూడా గమనించవచ్చు.
రావణాసురుడికి 6 గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. తన చెల్లి శూర్పనఖ ముక్కుని లక్షణుడు చెక్కి పంపిస్తే రావణాసురుడి ఇద్దరు తమ్ముళ్లు ఖరుడు, దుషణుడు రాముడిపై యుద్ధానికి వెళ్ళి మరణిస్తారు.
ఖరుడు, దుషణుడు మామూలోళ్ళు కాదు. వాళ్ళని జయించటం మానవుల వలన కాదు. అవతల వ్యక్తి దైవాంశ సంభూతుడు, దేవతల అనుగ్రహం, పంచ భూతాల సహాయం ఉంది అని గ్రహించి అప్పుడు రావణాసురుడు వ్యూహం రచించాడు. అయోధ్యలో గానీ, అడవిలో గానీ రాముడ్ని జయించటం ఈజీ కాదు అని రాముడినే లంకకి తీసుకువచ్చే వ్యూహంలో భాగంగా సీతమ్మ వారిని అపహరించాడు.
Ads
అయోధ్య నుంచి లంకకి అన్ని వేల కిలోమీటర్లు నడవటం ఎవరి తరం కాదు. అంత దూరం నడిచి వచ్చినా నరమానవులు ఎవరూ సముద్రాన్ని దాటి రాలేరు. ఏదో రకంగా రాముడు వచ్చినా అతన్ని జయించటం చాలా ఈజీ అవుతుంది. ఇంకా తన తమ్ముళ్లని, చెల్లెళ్లని కుటుంబ సభ్యులని రావణాసురుడు అమితంగా ప్రేమించేవాడు. వాళ్ళు కూడా అత్యంత సమర్ధులు. ఖరుడు, దుషణుడు కాకుండా మిగిలిన రావణాసురుడి తమ్ముళ్లు కుబేరుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, అభిరావణుడు కూడా అత్యంత సమర్ధులు.
శ్రీ రాముడు బలవంతుడు, దైర్యవంతుడు అయినా రావణాసురుడితో పోల్చితే రావణుడి గడ్డ మీద తను దిగదుడుపే. ఇక్కడే శ్రీ రాముడు ప్రతి వ్యూహం పన్నాడు. వానరుల సహాయం తీసుకున్నాడు, వాళ్ళు అయితే గాలిలో ఎగరగలరు, లంకకి బాట వేయగలరు. ఇంకా పర్వతాల మీద పట్టు కోసం సుగ్రీవుడి సహాయం తీసుకున్నాడు. దానికోసం చాటుగా వాలిని చంపటానికి కూడా వెనకాడలేదు. నా వల్లే అవుతుంది, నేను ఈ భూమండలం మీద బలశాలి అనుకోలేదు. అవతల ఉన్నది రాక్షస రాజు అయినా అత్యంత జ్ఞాన వంతుడు. ఇంకా రావణాసురుడికి సహాయం చేయటానికి మందీమార్భలం కలిగిన మిగతా చాలా మంది ఉన్నారు.
అందుకే రావణాసురుడిని ఎదుర్కోటానికి శ్రీ రాముడి అంతటివాడే వానరుల సహాయం తీసుకున్నాడు, పర్వత రాజు సుగ్రీవుడి సహాయం తీసుకున్నాడు, ఋషులు, తత్వవేత్తలు, మునులు, దేవతల సహాయం తీసుకున్నాడు.
చెల్లెలు శూర్పనఖ కోసమో, లేదా సీతమ్మ కోసమో అపర బ్రహ్మ రావణాసురుడు యుద్ధానికి దిగలేదు, అందువల్ల రామాయణం జరగలేదు. నిజానికి తను అత్యంత గాఢంగా ప్రేమించే తమ్ముళ్లు ఖరుడు, దుషణుడిని రాముడు చంపటం వలన రామాయణం జరిగింది, అందుకే రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి వ్యూహం పన్ని శ్రీ రాముడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అతను అపర బ్రాహ్మణుడు అయినా లంకకి అధిపతి, రాజు. రావణాసురుడు చేసింది ధర్మం ( లంకకి రాజుగా, అన్నగా, రాక్షస ప్రతినిధిగా అది అతని కర్తవ్యం)
ఈ భూమి మీద ప్రస్తుతం బతికి ఉన్న 700 నుంచి 800 కోట్ల మంది జనాభా అంతా ఒక లక్ష కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా రావణబ్రహ్మ చెప్పుకి అంటిన మట్టి విలువ కూడా చేయరు అని నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి రావణుడితో ఏ నరమానవుడ్ని పోల్చకండి.
రాముడు, రావణుడు ఇద్దరూ వారి వారి ధర్మాలని, కర్తవ్యాలని నిర్వర్తించారు. పురాణాల నుంచి, పురాణంలో ఉన్న కేరక్టర్స్ గురించి తెలుసుకొని ఏమైనా నేర్చుకోగలుగుతామో చూసుకోవాలి అంతే కాని లూజ్ గా మాట్లాడకూడదు అంటారు పెద్దలు.
నిజంగా పది తలలు ఉన్నాయి అని కాదు, పది తలల రావణాసురుడు అంటే 6 శాస్త్రాలు, 4 వేదాలు చదివిన అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్ధం. మూడు లోకాల్లో ఏ ఒక్క రాజు లేదా చక్రవర్తి తమ సైన్యంతో మాత్రమే వస్తే రావణుడి ఒక్క తలని కూడా ఏమీ చేయలేరు. కానీ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్ని అందరినీ కలుపుకొని వెళ్ళటం వలన పది తలల రావణాసురుడి మీద శ్రీ రాముడు విజయం సాధించగలిగాడు…… – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం……….. By జగన్నాథ్ గౌడ్
Share this Article