గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేఏపాల్ అనే వార్త చదివాక… హఠాత్తుగా జొన్నవిత్తుల పెట్టిన కొత్త పార్టీ వార్త గుర్తొచ్చింది… భారీ ప్రమోషన్ వర్క్, అత్యంత భారీ ఓపెనింగ్స్ ఉన్న సినిమాలో మూణ్నాలుగు రోజులకే థియేటర్ల నుంచి మూటాముల్లే సర్దుకుంటున్నాయి… ఈ ప్యూర్ ఓటీటీ పార్టీకి ఏపీ రాజకీయాల్లో నెగ్గుకొచ్చే సీన్ ఉందానే సందేహం కూడా వచ్చింది…
నిజానికి ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉంది… అయితే ముదురు కేసు చంద్రబాబు, లేదంటే బాబును మించిన దేశముదురు జగన్… ఈ రెండు తోపుల నడుమ పవన్ కల్యాణే జొరబడలేకపోతున్నాడు… చంద్రబాబుతో పొత్తు తప్ప ఒంటరిగా నెగ్గుకొచ్చేంత సీన్ లేదు ప్రస్తుతానికి… గత ఎన్నికల్లో చేదు అనుభవాల మాట సరేసరి… ఈమధ్యలో లెఫ్ట్ కనుమరుగవుతోంది… అప్పట్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రస్తుతం అయిపూజాడా లేదు… ఇక మిగిలినవి ప్రజాశాంతి వంటి అంతర్జాతీయ పార్టీలు ఒకటీరెండు…
ఈ నేపథ్యంలో కేవలం తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణ పేరిట సినీ పాటగాడు జొన్నవిత్తుల పార్టీ పెడితే, దాంతో వచ్చేదేముంది..? సాధించదేముంది..? అసలు ప్రపంచంలో తమ భాష, తమ సంస్కృతి ఏమాత్రం పట్టని విశిష్ట జాతీ ఏదంటే… అది తెలుగు జాతి… అలాంటోళ్లను నమ్ముకుని, అవే అంశాలుగా రాజకీయ పార్టీ స్థాపిస్తే… నాలుగు రోజులు ఉంటుందా..?
Ads
నిజానికి ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు… దాని గురించి అభ్యంతరం ఏమీ లేదు… కానీ చంద్రబాబు, జగన్‌ను రాజకీయంగా ఢీకొట్టగల సమర్థులు కనిపించడం లేదు… ఇలాంటి జనానికి ఏమాత్రం పట్టని రాజకీయ ఎజెండాతో పోటీకి దిగుతానంటే నవ్వొస్తుంది తప్ప నమ్మి చప్పట్లు కొట్టాలని అనిపించదు…
ఈయనే కదూ… ఆమధ్య రాంగోపాలవర్మ ఏదో అన్నాడని… తన మీద ‘రోజూ గిల్లేవాడు’ అనే సినిమా తీస్తానని ప్రకటించింది… ఏం..? ఏమైంది ఆ సినిమా..? ఆ సినిమా టైటిలే ఈ కొత్త పార్టీ జెండాలాగా ఉంది… ఐదు రంగులు.., పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుగు రంగులట… ఫాఫం, ఇంద్రధనుస్సులోని మిగతా రంగులేం పాపం చేసుకున్నాయట..?
పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు… ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వెలగబెడుతున్న వివిధ పార్టీలకు సంకేతవర్ణాలు… ఏమో, రేప్పొద్దున తెలంగాణలో కూడా రాజకీయాల్ని ఉద్దరించాల్సిన అవసరం వస్తుందేమో కాషాయం, గులాబీ రంగులూ కూడా పులిమితే సప్తవర్ణాలూ అయ్యేవి… తెలుగు రంగులో ఓ రథం అట, దిగువన అ ఆ అక్షరాలట… అంటే భాషాపరిరక్షణ కోసం అట… మరి రథం దేనికి సంకేతం..? అంతేకాదు…
రాబోయే రోజుల్లో జెండా మీదికి గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, ఎన్టీరామారావు, పీవీ నరసింహారావు బొమ్మలు కూడా తీసుకొస్తారట… ఏమో, అవసరాన్ని బట్టి, డిమాండ్‌ను బట్టి ఇంకా ప్రముఖ తెలుగు వ్యక్తుల బొమ్మలు కూడా వచ్చి చేరే చాన్సుంది… ఎందుకంటే, తెలుగు ప్రముఖులు ఆ అయిదుగురే కాదు కదా… ఒకప్పుడు మద్రాసీలు అనేవారట తెలుగువాళ్లను, ఇప్పుడు హైదరాబాదీలు అంటున్నారట… అదీ ఆయనకు బాధట… మరి మీకంటూ ఓ రాజధాని ఏదయ్యా జొన్నవిత్తులా… మీ వైఫల్యాన్ని కూడా జెండాగా, ఎజెండాగా మార్చుకుంటే ఎలా..?
పైగా తెలుగు ప్రముఖుల్లో వైఎస్ పేరు ఉండదా..? ప్రకాశం పంతులు ఉండడా..? పనిలోపనిగా ఎలాగూ భాష అంటున్నారు కదా… పోతన, నన్నయ, ఎర్రన, తిక్కన వంటి కవులూ… మరణించిన అక్కినేని, సత్యానారాయణ, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు, విశ్వనాథ్ వంటి కీర్తిశేషుల్ని గట్రా జెండా మీదకు ఎక్కిస్తే బెటరేమో… చివరగా ఓ హైలైట్ ఏమిటో తెలుసా..? భాష, సంస్కృతి గురించి రాజకీయ నాయకులు, ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తాడట ఆయన ఈ పార్టీ ద్వారా… హమ్మయ్య, అధికారం మీద యావ లేదన్నమాటే కదా… సంతోషం… జస్ట్, అవగాహన కల్పించడం కోసం నీ పార్టీ… అంతేకదయ్యా…
Share this Article