.
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పోస్టు ఒకటి కనిపించింది… 16 సంవత్సరాల క్రితం సెన్సేషన్ జననం అని… ఏమిటీ అంటే… ఏడుగురు ఒకేసారి పుట్టారు… వాళ్లంతా బతికే ఉన్నారు… ఇదుగో తల్లిదండ్రులతో వాళ్లందరూ ఒకే ఫోటోలో… ఇదీ ఆ పోస్టు సారాంశం…
కానీ, నాకు తెలిసి… వాళ్లు పుట్టింది 16 ఏళ్ల క్రితం కాదు… McCaughey septuples గా ఈ ప్రసిద్ధులు పుట్టింది 1997లో… అంటే దాదాపు 27 ఏళ్ల క్రితం… ప్రపంచంలో పుట్టిన ఏడుగురు కవలలూ బతికిన మొట్టమొదటి ఉదాహరణ… తరువాత కూడా కొన్ని ఉదాహరణలు… ఈ ఫోటోలోని వాళ్లలో అందరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, కొందరు పెళ్లి చేసుకుని తల్లులు, తండ్రులు కూడా అయిపోయారు… సరే, ఇంకాస్త సబ్జెక్టులోకి వెళ్దాం…
Ads
ఒకసారి తల్లి కడుపు నుంచి ఒకరే పుడతారు… ఇద్దరు పుడితే కవలలు అంటాం… ముగ్గురు పుడితే ఏమనాలి..? నలుగురు, అయిదుగురు, ఆరుగురు…? సంఖ్యను బట్టి పదం ఉందా..? లేేనట్టుంది..!! కానీ ఇంగ్లిషులో పది మంది వరకూ పిల్లలు ఒకేసారి పుట్టినా, వాళ్ల సంఖ్యను బట్టి పేర్లున్నయ్… ఇద్దరయితే twins, ముగ్గురయితే Triplets, నలుగురయితే Quadruplets, ఐదుగురయితే quintuplets, ఆరుగురయితే sixtuplets, ఏడుగురయితే septuplets, ఎనిమిది మందయితే octuplets, తొమ్మిది మందయితే nonuplets, ten offspring – decaplets… అంతే…
అంతకుమించి ఎవరూ ఊహించలేరు… భారతంలో కౌరవులు వంద మంది పుట్టారు గానీ… వంద మందిగా ఒకే జననం కాదు… అది వేరే కథ… నిజానికి ఒక మహిళ గరిష్టంగా ఎంతమందికి ఒకేసారి జన్మనివ్వగలదు..?
ముగ్గురు, నలుగురిని ఒకేసారి కనడం అంటేనే ఓ పెద్ద యజ్ఞం… కానీ ఐదుగురు, ఆరుగురు, ఇలా తొమ్మిది మంది వరకూ కన్నట్టు రికార్డులున్నయ్… అసాధారణం ఏమీ కాదు, కాకపోతే అరుదు, అత్యంత అరుదు… అశాస్త్రీయం కూడా కాదు…
అండం ఫలదీకరణం చెందాక తల్లి కడుపులో ఎక్కువ ఎంబ్రయోలుగా విభజించబడితే ఇలాంటి జననాలుంటయ్… ఆమధ్య పదకొండో తేదీ, పదకొండో నెల, రెండు వేల పదకొండో సంవత్సరంలో ఓ మహిళ ఒకేసారి పదకొండు మందికి జన్మనిచ్చినట్టు ఎడాపెడా వార్తలు రాశారు కొందరు… కానీ పూర్తి ఫేక్…
ఒకేసారి పది మందిని కన్న ఉదాహరణే లేదు ఈనాటికీ… తొమ్మిది మందిని ఒకేసారి కన్న ఉదాహరణలు రెండు ఉండేవి… 1) 1971లో సిడ్నీలో… ఐదుగురు మగ, నలుగురు ఆడ శిశువులు… కానీ ఏడుగురే బతికారు, తరువాత ఆరు రోజులకు మరో మగ శిశువు మరణించాడు… 2) 1999లో మలేషియాలో… సేమ్, ఐదుగురు మగ, నలుగురు ఆడ శిశువులు… కానీ ఎవరూ బతకలేదు… ఇరుకు గర్భాశయం, ఎక్కువ పిండాలు, సరైన ఎదుగుదల ఉండదు, అందుకే మరణాలు…
……. (ఇది కేవలం ఓ ప్రతీకాత్మక చిత్రం మాత్రమే…..)
మూడేళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని మాలీకి చెందిన హలిమా సిస్సే అనే పాతికేళ్ల యువతి తొమ్మిది మందికి జన్మనిచ్చింది… ఇదే ఇప్పటివరకు మానవ చరిత్రలో రికార్డు… ఎందుకంటే, అందరూ ప్రస్తుతం సజీవం… నిజానికి ఆమె కడుపులో ఏడుగురు శిశువులు ఉన్నట్టుగా స్కానింగు సమయంలో లెక్కకట్టారు…
మాలీలో సరైన వైద్యవసతులు లేవని మార్చిలోనే మొరాకోకు తరలించారు… ఇప్పుడు ఐదుగురు ఆడ, నలుగురు మగ శిశువులు జన్మించారు… అంటే, అనుకున్న సంఖ్యకన్నా ఇద్దరు అదనం… వాళ్లను స్కానింగులో కూడా గుర్తించలేకపోయారు మొదట్లో…
ఆ భార్యాభర్తల కుటుంబ నేపథ్యం వంటి వివరాలేమీ అక్కడి నుంచి వస్తున్న వార్తల్లో లేవు… కానీ ఈమె ఎట్లా మోసిందో, ఏం అవస్థలు పడిందో గానీ… అసలు కవల పిల్లల్ని పెంచడమే కష్టం… అలాంటిది తొమ్మిది మంది పిల్లల పోషణ, ఆరోగ్యం, పెంపకం అంటే… అసలు ఊహిస్తుంటేనే కలవరం రేపే ప్రయాస… ఇక ఆ మహాతల్లి ఏం చేస్తుందో…! ఈమధ్య వాళ్ల థర్డ్ బర్త్ డే వార్తలు వచ్చాయి… అందరూ క్షేమం, ఆరోగ్యవంతులు కూడా… పైన ఫోటో అదే…
Share this Article