.
నిజానికి వర్తమాన వార్తాసరళి నడుమ ఇది పెద్ద వార్తగా అనిపించదు… కానీ భక్తి విశ్వాసులకు చదవగానే ఒకింత ఆసక్తి…
తెలంగాణలోని ఓ ప్రధాన ఆలయ అర్చకుడు అనుమతి లేకుండా ఇటీవల దుబయ్ వెళ్లొస్తే గుడి ఉన్నతాధికారగణం తనపై యాక్షన్‌కు సిద్ధమైందనే ఓ సమాచారం విన్న వెంటనే ఈ వార్త కనిపించి, కొంత ఇంట్రస్ట్ అనిపించింది…
Ads
వార్త ఏమిటంటే..? అయోధ్యలో అర్చనలు చేసే పూజారులు ఎవరైనా సరే తమ ఇళ్లల్లో పుట్టుకలు, మరణాలు సంభవిస్తే మందిరంలోకి రావద్దు అని ఆంక్షలు జారీ చేశారనేది వార్త…
దీనికి ప్రత్యేకంగా ఆదేశాలు దేనికనే ప్రశ్న తలెత్తుతుంది… నిజానికి హైందవ సంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా పుడితే కొన్నిరోజులు ‘పురుడు’ పాటిస్తారు… ఎవరైనా కుటుంబసభ్యుడు మరణిస్తే సూతకం పాటిస్తారు… (సృష్టి, మైల పేరు ఏదైనా కావచ్చుగాక…)
ఆరోజుల్లో పూజ గదిలోకే వెళ్లరు, పూజలు చేయరు… యాత్రలకు వెళ్తారు గానీ, కొన్ని ఇళ్లల్లో గుట్టలు ఎక్కడం నిషిద్ధం… అస్థికల్ని ఏదైనా నది వద్దకు వెళ్లేవాళ్లు మైలతోనైనా సరే ఆ నదీతీరంలోని గుడిని సందర్శిస్తారు… ఆమోదనీయమే…
కొన్ని ఇళ్లల్లో ఇంకా కఠిన ఆంక్షలు కూడా ఉంటాయి… గతంలో దాయాదుల ఇళ్లల్లో (పాలోళ్లు) పుట్టుకలు, మరణాలకు కూడా ఈ మైల పాటించేవాళ్లు…
ఇప్పుడు మరీ సొంత తల్లిదండ్రుల పిల్లల కుటుంబాలకే పరిమితమైంది… అదీ ఆడపిల్లల కుటుంబాలకు మినహాయింపు… ఇలా ప్రాంతాన్ని బట్టి, కులాల్ని బట్టి రకరకాలు… ఇంట్లో పురుడు గానీ, సూతకం గానీ వస్తే ఇంట్లో పూజలే చేయరు కదా మరి అసంఖ్యాక భక్తగణం వచ్చే గుళ్లో అవి పాటించాలి కదా… పాటించాలి…
ఏమో… ఏ గుడిలో ఏ పద్ధతులు పాటిస్తున్నారో… అర్చన మా వృత్తి, మా కుటుంబానికి వర్తించే సంప్రదాయ పద్ధతులు మా వృత్తికి వర్తించవు, కాబట్టి గుడికి యధావిధిగా వస్తాం అనే పూజారులు కూడా కనిపిస్తున్నారేమో, అందుకే అయోధ్య పాలకగణం ఆ ఆదేశాలు జారీ చేసి ఉంటుంది…
ఇక్కడ మరో వాదన కూడా…! పురుడు, చావు మైల ఉన్నాసరే గుళ్లకు వెళ్తారు కదా… అర్చన అనే వృత్తి ధర్మ ఆచరణ కోసం గుడికి వెళ్తే తప్పేమిటి అనే వాదన… మొత్తానికి ఓ ధర్మసంకటం… ఎస్, అయోధ్యలాగే ఓ స్థిర వైఖరి తీసుకుని నిర్దిష్టమైన విధివిధానాలు రూపొందించడమే బెటరేమో…
అంతేకాదు, ప్రతిచోటా అర్చకులకు డ్రెస్ కోడ్ కూడా తప్పనిసరి… సంప్రదాయ పద్ధతిలో ధోవతి, ఉత్తరీయం, నొసటన బొట్టు వగైరా… గుడి ప్రాంగణంలో ఆధ్యాత్మిక, భక్తి, గౌరవ, సంప్రదాయ వాతావరణానికి భిన్నమైన దేన్నీ అనుమతించకూడదు…
పర్ సపోజ్, పాలకగణం ఆదేశించినా సరే, విధివిధానాలు వివరించినా సరే… ఎవరైనా పుట్టుకను, మరణాన్ని దాచిపెట్టి గుడికి వస్తే ఏం చేయాలి..? ఆ అర్చక పోస్టు నుంచి వెళ్లగొట్టాలి… కానీ మన కోర్టుల తీరూతెన్నూ తెలుసు కదా… శబరిమల, శనిశింగాపూర్ తీర్పులు చూశాం కదా… మరి ఈ తొలగింపుల్ని ఆమోదిస్తాయా..? ధర్మసంకటమే కదా..!!
Share this Article