Sai Vamshi ………. ఇలాంటి ‘మోసాలు’ ఉంటాయి.. జాగ్రత్త … PLEASE READ IT..
… నిన్న సాయంత్రం వాట్సాప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైం పని కావాలా అంటూ! జర్నలిజంలోకి రాక ముందు నా బయోడేటా నౌకరీ, లింక్డ్ లాంటి వెబ్‌సైట్లలో పెట్టాను. ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇదీ అలాగే వచ్చింది అనుకున్నా! Truecallerలో అదేదో ఇంగ్లీషు పేరు ంంది
‘మీరు సరే అంటే మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తాను’ అని మెసేజ్ వచ్చింది. పనేంటి అన్నాను. కొన్ని హోటళ్లకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరేమీ శ్రమ పడక్కర్లేదు! సింపుల్’ అన్నారు. ‘రిజిస్ట్రేషన్‌కి డబ్బు కట్టాలా?’ అంటే ‘అక్కర్లేదు, మీ రిజిస్ట్రేషన్ ఓకే అయితే మేమే 175 రూపాయలు మీ అకౌంట్‌లో వేస్తాం’ అన్నారు. సరే అని వివరాలు చెప్పాను. నిజంగానే 175 వేశారు.
Ads
‘మీకు మరిన్ని వివరాలు మా టెక్నికల్ అసిస్టెంట్ అందిస్తారు’ అన్నారు. Telegramలో ‘Aashi Sharma’ అనే ప్రొఫైల్ ఇచ్చారు. టెలిగ్రాం డౌన్‌లోడ్ చేసి, ఆమెకు మెసేజ్ చేశాను. చాలా బాగా రిప్లై ఇచ్చారు. ‘బాగా’ అంటే చాలా ప్రొఫెషనల్‌గా అని. ‘మీరు రోజూ మేం చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్లకు స్టార్స్ ఇస్తే చాలు. రోజుకు 1500-2000 దాకా సంపాదించొచ్చు’ అంది. ‘రోజుకు 1500-2000 సంపాదించొచ్చు’ అనగానే నాకు తేడా కొట్టింది.
కానీ ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని అనిపించింది. “మీరు డబ్బులు పంపి టాస్క్‌లో చేరాలి. 10 నిమిషాల్లో మీ డబ్బు వాపస్ ఇస్తాం” అంది. ఫిక్స్! ఇదేదో మోసం బాపతు అని అర్థమైంది. రాత్రి 8 గంటల దాకా నేను రిప్లై ఇవ్వలేదు. అప్పటికి ఒకటి, రెండు సార్లు మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత అడిగాను ‘ఎంత కట్టాలి?’ అని. నన్ను ఒక టెలిగ్రాం గ్రూప్‌లో యాడ్ చేసింది. అక్కడ 70 మంది దాకా ఉన్నారు. అందరివీ ఉత్తరాది పేర్లు. Task-1000 నుంచి Task-50,000 దాకా అక్కడ వివరాలు ఉన్నాయి. ‘మనకు ఏ టాస్క్ కావాలంటే ఆ టాస్క్‌కి సంబంధించిన డబ్బు కట్టాలి. ఆ తర్వాత అరగంటలో మనకు తిరిగి డబ్బు పంపిస్తారు. టాస్క్ పూర్తయ్యాక ఆ డబ్బులో 10 శాతం మన కమిషన్‌గా చెల్లిస్తారు’.. ఇదీ ఆ గ్రూప్‌లో జరిగే విషయం.
70 మందిలో చాలామంది 10 వేలు, 20 వేలు అంటూ టాస్క్‌లు ఎంపిక చేసుకుంటున్నారు. చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో అని, 1000 పోగొట్టుకోవడానికి రెడీ అయిపోయి, 1000 పంపుతా అన్నాను. ఒక నెంబర్ ఇచ్చి దానికి డబ్బు పంపమని అన్నారు. పంపాను. అందినట్టు మెసేజ్ వచ్చింది.
ఆ తర్వాత టాస్క్ ఏదో చేయించారు. అంటే ఒక రెస్టారెంట్ వెబ్‌సైట్ ఇచ్చి దానికి Rating ఇవ్వమన్నారు. చేశాను. ఓకే అయింది. SCREEN SHOT పెట్టాను. Perfect అన్నారు. నా డబ్బు తిరిగి ఇవ్వండి అంటే, “ఇవాళ చాలా లేట్ అయింది. మా సిబ్బంది లేరు. రేపు పొద్దున్న పంపిస్తాను” అని సమాధానం వచ్చింది. నాకు నమ్మకం కుదరలేదు. ఇప్పుడే కావాలి నాకు అంటే, చాలా స్థిమితంగా నమ్మకమైన మాటలు చెప్పి, తమ కంపెనీ భారత ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీ అని చెప్పి ఒక ఫోటో పంపింది.
“సరే! ఒప్పుకున్నాక తప్పేది ఏముంది?” అనుకుని తెల్లారి చేస్తాను అన్నాను.
ఉదయం ఆ Aashi Sharma లేరు, ఆ గ్రూప్ లేదు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఖలాస్! 825 బొక్క! పేరు చివర ‘శర్మ’ అని ఉంటే బ్రాహ్మల పిల్ల, మంచిది, మోసం చేయదు అని అనుకుని ఎవరో అలాంటి పేరు పెట్టి ఉంటారు. మొత్తానికి చేతి చమురు వదిలింది. Cyber Economic Crimeలో నేనూ ఒక బాధితుడిగా మారాను. ఈ 825 రూపాయల కోసం కేసులేం పెడతాను కానీ, ఈ అనుభవం ద్వారా ఒక విషయం అర్థమైంది.
“డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఊరికే పోవు కూడా..”
PS: మనలో చాలామంది ఇలా మోసపోయి వేలకు వేలు పోగొట్టుకుని ఉంటారు. కానీ బయటికి చెప్పడం నామోషీ! ఇంత చదివి, ఇంత తెలివి ఉండి మోసపోయావా అని అనుకుంటారని భయం. కానీ, తెలివికీ, చదువుకూ సంబంధం లేనట్టే, చదువుకూ ఆశకూ సంబంధం లేదు. ఐన్‌స్టీన్ కూడా ఐదు రూపాయలకు మోసపోవచ్చు. మన అనుభవం చెప్తే పక్కవారు కొంతైనా జాగ్రత్త పడతారు…
(ఈ కథలో మరో నీతి ఏమిటంటే… చాలామంది ఏదైనా హోటల్ వెళ్లినప్పుడు, ఏదైనా కొన్నప్పుడు నెట్‌లో రేటింగ్స్, కామెంట్స్ చూస్తుంటారు… అవి ఎంత బోగసో ఈ కథ ద్వారా అర్థమైంది కదా…)
Share this Article