బీజేపీ జార్ఖండ్‌లో కూడా గేమ్ స్టార్ట్ చేయనుందా..? సీఎం హేమంత్ సొరెన్ చిక్కుల్లో పడ్డట్టేనా..? అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాడా..? అసలు హేమంత్ ఎక్కడ ఇరుక్కున్నాడు..? బీజేపీకి చాయిస్ ఎక్కడ దొరికింది..? ఇవీ ప్రశ్నలు… స్థూలంగా పైపైకి చూస్తే బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చే విషయంలో అమిత్ షాను కలిశాడు అని ప్రభుత్వవర్గాలు చెబుతాయి… కానీ..?
ద్రౌపది సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన మహిళ నాయకురాలు… హేమంత్ సొరెన్ కూడా సేమ్… వాళ్ల వోట్లు నిర్ణయాత్మకం… దాంతో మా ఆడపడుచు రాష్ట్రపతి కావడానికి మేం మద్దతు ఇస్తాం అనే ప్రకటన జార్ఖండ్ ముక్తిమోర్చా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ప్రజలు… ఈ స్థితిలో ఆమెకు మద్దతు ప్రకటించడానికే సీఎం అమిత్ షాను కలిశాడు అని చెప్పడానికి ప్రభుత్వవర్గాలకు సందర్భం దొరికింది… అధికారికంగా మాత్రం రాష్ట్ర సమస్యల్ని చర్చించడానికి మాత్రమే సీఎం కేంద్ర హోం మంత్రిని కలిశాడని ప్రకటన జారీచేశాయి… అయితే..?
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి జేఎంఎం హాజరు కాలేదు… నిజానికి ఈ పార్టీ యూపీఏ కూటమిలో అధికారిక భాగస్వామి… ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుని పోటీచేశాయి కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీల కూటమి మొత్తం 81 సీట్లకు గాను 47 గెలుపొందింది… ఇందులో జేఎంఎం వాటా 30 సీట్లు… కాగా కేవలం 25 సీట్లతో బీజేపీ చేతులెత్తేసింది… (మహారాష్ట్రలోలాగా ఎన్నికల అనంతరం కుదిరిన పొత్తు కాదు)… సో, యూపీయే కూటమి అధికారికంగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుంటే, జేఎంఎం మాత్రం ద్రౌపది వైపు మొగ్గుతోంది…
Ads
కేవలం మా తెగ మహిళ కాబట్టి మేం మద్దతునిస్తాం అనే వాదన కూటమి రాజకీయాల్లో చెల్లదు… ఒకవేళ ఆమెకు మద్దతునివ్వకపోతే… ‘‘మా ఆడపడుచుగా ఆదరిస్తాం, కానీ సైద్ధాంతికంగా విపక్ష అభ్యర్థినే సమర్థిస్తాం’’ అని ప్రకటించవచ్చు… సో, ఇంకేదో ఉంది కారణం..? ఏమిటది..? అదీ ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చ…
హేమంత్ సోరెన్ తనకు తానే ఆమధ్య ఓ మైనింగ్ లీజు ఇచ్చుకున్నాడు… మైనింగ్ శాఖ కూడా తన దగ్గరే ఉంది… మైనింగుకు పర్యావరణ, అటవీ క్లియరెన్సులు ఇచ్చుకున్నాడు… ఆ శాఖ కూడా తన దగ్గరే ఉంది… సీఎం తన భార్య కల్పనకు ఓ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించాడు… సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, ప్రెస్ అడ్వయిజర్ అభిషేక్ ప్రసాద్ కూడా మైనింగ్ లీజులు పొందారని బీజేపీ ఆరోపణ… హైకోర్టులో కేసు పడింది… అడ్వొకేట్ జనరలే స్వయంగా ‘మిస్టేక్ జరిగింది’ అని అంగీకరించాడు…
బీజేపీ గవర్నర్ ద్వారా ఆట మొదలెట్టింది… శాసనసభ్యుడిగా హేమంత్‌పై అనర్హత వేటు వేయాలని కోరింది… గవర్నర్ కార్యాలయం రకరకాల ఆర్టికల్స్ 191, 192, పదో షెడ్యూల్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ తదితరాలన్నీ వడబోసి… ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరింది… అది జార్ఖండ్ చీఫ్ సెక్రెటరీ లేఖ రాసి, మొత్తం వివరాల్ని పంపించాలని అడిగింది… ఒకవేళ హేమంత్‌కు వ్యతిరేకంగా అది అభిప్రాయాన్ని ప్రకటిస్తే సీఎం చిక్కుల్లో పడటం ఖాయం… అప్పుడిక బాల్ గవర్నర్ కోర్టులో ఉంటుంది… గవర్నర్లు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని కేంద్ర హోం శాఖ చూస్తుంటుంది… అమిత్ షాను హేమంత్ కలిశాడు… ఇదీ నేపథ్యం…
బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? హేమంత్ గనుక తాము ఆశించినట్టు దారికొస్తే ఏకంగా అధికారాన్నే కొట్టేయొచ్చు… ఇప్పుడెలాగూ అనైతికం, అపవిత్రం అనే పదాలు వినిపించడం లేదు కదా… కాకపోతే సీఎంగా హేమంత్‌ను కొనసాగిస్తూ, ఇంకోవైపు కాంగ్రెస్‌ను బలహీనపరిచే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టొచ్చు… జేఎంఎం, బీజేపీ కాపురం కొత్తేమీ కాదు… గతంలో ఉన్నదే… నో, నో, ఇవన్నీ ఊహాగానాలే అంటారా..? రాజకీయాల్లో ఇది జరగకూడదు, జరగదు అనడానికి ఏమీలేదు… హేమంత్ అమిత్ షాను కలవడానికి వేరే కారణాలూ బలమైనవి కావు…! బీజేపీ ప్రస్తుత రాజకీయ పోకడలు కూడా భిన్నంగా ఏమీ ఉండటం లేదు..! (వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, కాంగ్రెస్‌ను ఇంకా తొక్కేయడం బీజేపీ సమీప లక్ష్యాలు)…
(ఈ ఫోటోలో ఉన్నది హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన.., ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము… రెండేళ్ల క్రితం మర్యాదపూర్వక భేటీ ఫోటో…)
Share this Article