.
ఇది గతం కాదు… ఏక్‌సేఏక్… అందమైన, మెరిటోరియస్ తారలు వస్తున్నారు సినిమా ఫీల్డులోకి… నిజానికి కొత్త హీరోలకన్నా కొత్త హీరోయిన్లు అదరగొడుతున్నారు… చాలా ఉదాహరణలు… 8 వసంతాలు సినిమాలో అనంతికను చూశాం కదా… ఇప్పుడు చెప్పుకోబోయే పేరు నిమిషా సజయన్… కేరళైట్…
అవును, కేరళ మూలాలే కానీ ముంబైలో పుట్టి పెరిగింది ఈ అమ్మాయి… ఇప్పుడెందుకు ఇదంతా చెప్పుకోవడం అంటే..? డీఎన్ఏ (తెలుగులో మై బేబీ) సినిమా చేసింది… అది తమిళ సినిమా… 10 కోట్ల దాకా వసూలు చేసింది…
Ads
దాన్ని తెలుగులోకి డబ్ చేసి వదిలారు, ఏమైందో పెద్దగా వెయిట్ చేయకుండానే హాట్‌స్టార్ ఓటీటీలో పెట్టేశారు… సినిమాకు ప్లస్ ఈ నిమిషా… చాలా బాగా చేసింది…
అబ్బే, ఏముందండీ, తారలు మట్టిముద్దలు, దర్శకులు వాళ్లకు కావల్సిన శిల్పాన్ని రూపొందించుకోవాలి అంటుంటారు… నో, స్వతహాగా పుట్టుకతో కొంత అడాప్టబులిటీ, ఫ్లెక్సిబులిటీ ఉంటే కదా… అంటే మరీ పెళుసుగా ఉంటే కుదరదు, బండరాయి టైపు అయితే దర్శకుడు చావాలి…
కానీ నిమిష బాగా చేసింది… ఇక సినిమాకు వద్దాం… రంధ్రాన్వేషణ అస్సలు అక్కర్లేదు… సినిమా బాగుంది…
ఈ సినిమా కథ… పుట్టిన బిడ్డ పురిట్లోనే చేతులు మారిపోవడం అనే సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది… ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా సజయన్) అనే దంపతులకు పుట్టిన బిడ్డ ఆసుపత్రిలో మారిపోతుంది.
అసలే హీరోహీరోయిన్లకు… (పోనీలే, కథానాయకుడు, కథానాయిక) మానసిక సమస్యలు… అయ్యో, నా బిడ్డ మారిపోయిందిరా దేవుడోయ్ అని కథానాయిక మొత్తుకుంటున్నా మొదట్లో ఎవరూ నమ్మరు… ఈ పిల్ల అలాగే భ్రమపడుతుందిలే అనుకుంటారు… కానీ కథానాయకుడు తన మత్తు రాజ్యం నుంచి బయటపడి కారణాల అన్వేషణలో పడతాడు…
వెళ్తుంటే పిల్లల అక్రమ రవాణా బాపతు పెద్ద మాఫియా లోతులు కనిపిస్తాయి… తరువాత ఏమిటో చూసేవాళ్లకు థ్రిల్ ఉండకుండా చెప్పడం బాగుండదు కాబట్టి, ఇక్కడ వదిలేస్తాను… కాకపోతే ఉత్కంఠభరితంగానే కథనాన్ని రన్ చేశాడు దర్శకుడు…
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఒక సాధారణ కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, దానిని చాలా కొత్త కోణంలో, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించడంలో విజయం సాధించాడు… అబ్బే, రెండు మూడు జానర్లు కలిపేశాడు, గందరగోళానికి గురయ్యాడు వంటి రివ్యూలు చదివాను, కానీ సదరు రివ్యూయర్లే గందరగోళానికి గురయ్యారు…
దర్శకుడికి క్లారిటీ ఉంది… సస్పెన్స్, ఎమోషన్స్, సామాజిక సందేశాన్ని సమపాళ్లలో కలిపి చూపించాడు… అనవసరమైన సన్నివేశాలు లేకుండా, కథను పరుగులు పెట్టించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు…
అథర్వ (ఆనంద్) ప్రేమలో విఫలమై, ఆ తర్వాత బిడ్డను కోల్పోయిన తండ్రిగా బాగానే నటించాడు… పెద్ద ప్లస్ కాదు, మైనస్ కూడా కాదు… ఆ పాత్రలోని భావోద్వేగాలు, ఆవేశం, నిస్సహాయతను చాలా సహజంగా పండించడానికి తన శక్తి మేరా ప్రయత్నించాడు… గుడ్…
నిమిషా సజయన్ (దివ్య)… మానసిక సమస్యతో బాధపడే యువతిగా, తన బిడ్డను కోల్పోయిన తల్లిగా నిమిషా సజయన్ నటన సినిమాకు హైలైట్… ఆమె కళ్ళతోనే చాలా భావాలను పలికించి, ప్రేక్షకులను కదిలించింది…
డబ్బింగ్ అంటేనే పాటలు పరమ వికారం, తెలుసు కదా… వాటిని వదిలేయండి, కానీ బీజీఎం ఆప్ట్‌గా, సీన్ల ఎమోషన్లకు తగ్గట్టుగా ఉంది… సంగీత దర్శకుడి పేరు జిబ్రాన్… అసలు ఈ సినిమాకు బలం సినిమాటోగ్రఫీ, బీజీఎం, ఎడిటింగు…
చివరగా…. ‘DNA’ (మై బేబీ) ఒక భావోద్వేగభరితమైన, ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్… హాస్పిటల్స్ చుట్టూ అల్లుకున్న పిల్లల అక్రమ రవాణా మాఫియాను చూపించిన తీరు షాకింగ్‌గా ఉంటుంది… ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోవడంతో, కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమే ఇది…
Share this Article