Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజానికి ప్రజల్ని దోచుకునేది ప్రభుత్వమే… ఎడాపెడా బాదుడే…

December 27, 2024 by M S R

.

ఈమధ్య రెండు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆమె లండన్ ఎకనమిక్ స్కూల్ విద్యార్థి. ఏకకాలంలో అనేకభాషలు మాట్లాడగలరు. ఆమె చదువును, జ్ఞానాన్ని తక్కువ చేయాల్సిన పనిలేదు. మోడీ, అమిత్ షా ల కాలంలో ఆర్థికమంత్రిగా ఆమెకున్న పరిమితులు కూడా లోకానికి తెలియనివి కావు. అయినా ఎందుకో ఆమె తరచుగా సామాజిక మాధ్యమాలకు వస్తువు అవుతున్నారు.

పద్దెనిమిదేళ్ళ వయసులో చదరంగంలో జగజ్జేతగా నిలిచిన గుకేష్ కు ప్రపంచ చెస్ సమాఖ్య “ఫిడే” మన కరెన్సీలో అక్షరాలా 11.45 కోట్ల రూపాయలు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ పదహారున్నర కోట్ల రూపాయల్లో కేంద్రప్రభుత్వానికి గుకేష్ ఆదాయప్పన్నుగా అక్షరాలా 5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో-

Ads

“శ్రమ లేకుండా చిటికెలో 5 కోట్లు సంపాదిస్తున్న నిర్మలా సీతారామనే గుకేష్ కంటే ఎక్కువ లాభపడుతున్నారు”

“గుకేశ్ కష్టపడి ఆడి…గెలిచి సంపాదించాడు-
నిర్మల ఎలాంటి కష్టం లేకుండా…అసలు ఆడకుండానే కోట్లు సంపాదించారు”

“…అసలైన ఛాంపియన్ నిర్మల”

ఇలా ఆమె మీద లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. వస్తున్నాయి. ఇంకా వస్తాయి. నిజానికి ఈ మీమ్స్ లో ఆమె ఒక ప్రతీక- అంతే. అక్కడ జనం టార్గెట్ చేస్తున్నది మోడీని లేదా ఒక వ్యవస్థగా కేంద్రప్రభుత్వాన్ని.

మరో సబ్జెక్ట్.
వాడిన ఎలెక్ట్రిక్ కార్లు అమ్మేప్పుడు కూడా 18 శాతం జి ఎస్ టీ వసూలు ఉంటుందని; కొత్త కారు కొన్నా సెకండ్ హ్యాండ్ కారు కొన్నా జి ఎస్ టీ బాదుడు తప్పదని దేశమంతా మారుమోగిపోతోంది. మొన్న జరిగిన జి ఎస్ టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకుని నిర్మల మీద జోకులేస్తున్నారు.

బహుశా అది మార్జిన్ మీద మాత్రమే జి ఎస్ టీ వసూలు ప్రతిపాదన అయి ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రిక్ కారును మనం 20లక్షలకు కొన్నాం. మొదటిసారి షో రూములో కొంటున్నప్పుడు మహా అయితే ఆ కారు అసలు విలువ 15 లేదా 16 లక్షలే. మిగతా 4 లేదా 5 లక్షలు రకరకాల పన్నులు, సెస్సులు. అందులో కేంద్రం వాటా కేంద్రానిది. రాష్ట్రం వాటా రాష్ట్రానిది. కారు విలువలో పన్నుల నిష్పత్తి ఎంత? లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలో కేంద్ర-రాష్ట్ర పన్నుల నిష్పత్తి ఎంత? అని మెడకాయమీద తలకాయ ఉన్నవారెవరూ పట్టించుకోరు కాబట్టి నిటారుగా నడుస్తూ బతికేస్తూ ఉంటారు. పట్టించుకుంటే తలతిరిగి రోడ్డుమీదే అడ్డంగా పడి తమ ప్రమేయం లేకుండానే ఎర్రగడ్డ బెడ్డు మీద గొలుసులతో బంధింపబడి ఉంటారు!

మనం మొదటిసారి 20 లక్షలకు కొన్న కారును పది లక్షలకు ప్రయివేటుగా అమ్ముకుంటే ఏ పన్నూ ఉండదు. మనం దాన్ని ఒక సెకండ్ సేల్స్ షో రూముకు అమ్మాము. వారు దాన్ని పన్నెండు లక్షలకు మళ్ళీ ఎవరికో అమ్మారనుకుందాం. అప్పుడు ఆ మార్జిన్ 2లక్షలకు 18 శాతం జి ఎస్ టీ కట్టాల్సి ఉంటుందేమో! ఇదివరకే మొత్తం 20 లక్షల్లో 18 శాతం జి ఎస్ టీ కట్టే ఉంది కదా? అని అనిపించవచ్చు. కానీ భారతదేశంలో పన్నుల విధానమే అంత. అందుకే సంవత్సరానికి వందకోట్ల పైబడి లాభాలు ఆర్జించేవారు చాలామంది దుబాయ్ లోనో, ఇంకెక్కడో పౌరసత్వం తీసుకుని స్థిరపడుతున్నారు. ఇక్కడ ముప్పయ్ శాతానికి పైగా ఆదాయాప్పన్ను కట్టడానికి బదులు అక్కడినుండి వ్యాపారం చేస్తే ఎన్ ఆర్ ఐ మినహాయింపులు వస్తాయి. ఆయా దేశాల్లో పది శాతానికి మించి మొత్తం పన్నులు ఉండవు.

ఉత్తరభారతంలో ఒక ప్రఖ్యాత ఆడిటర్ విప్పి చెప్పిన భారత్ పన్నుల మాయా ప్రపంచం కథ వింటే మతి పోతుంది. ఆయన చెప్పినట్లు స్టాంప్ డ్యూటీ, జి ఎస్ టి లెక్కలను ఒక అంచనా కోసం ఇలా అన్వయించుకోవచ్చు.

కోకాపేట లాంటి చోట్ల వందకోట్ల ప్రభుత్వ ధర పెట్టి ఒక ఎకరం భూమిని ఒక బిల్డర్ కొంటే- ఆరున్నర కోట్ల స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి వస్తుంది. అందులో వంద అపార్ట్ మెంట్లు కట్టి ఒక్కొక్కటి 5 కోట్లకు అమ్మితే- ప్రభుత్వానికి ఒక్కో ఇంటిమీద ముప్పయ్ రెండున్నర లక్షల చొప్పున ముప్పయ్ రెండున్నర కోట్లు స్టాంప్ డ్యూటీ వస్తుంది. ఒక్కో ఇంటిమీద 5 శాతం జి ఎస్ టి. అలా 25 లక్షల చొప్పున 25 కోట్లు కేంద్రం జి.ఎస్.టి. అకౌంట్లో పడుతుంది. వంద కోట్లకు భూమి కొని ఇళ్ళు అయిదు వందల కోట్లకు అమ్మితే ప్రభుత్వాలకు నేరుగా వెళ్ళేది అక్షరాలా యాభై ఏడున్నర కోట్లు. ఐదేళ్ళపాటు నానా గడ్డీ కరచి…స్థానిక కార్పొరేటర్ నుండి మంత్రి దాకా వివిధ స్థాయుల్లో ఎందరెందరినో సంతృప్తిపరచి…నిర్మించిన బిల్డర్ కు ఇంత లాభం వస్తుందో లేదో తెలియదు కానీ…పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి మాత్రం ఆకాశమే హద్దు. ఇదికాక ఆ ఇళ్ళను మళ్ళీ అమ్ముకుంటున్న ప్రతిసారీ ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ వస్తూనే ఉంటుంది. అదో అక్షయపాత్ర! ఇదొక ఉజ్జాయింపు లెక్క. నిజానికి డ్యూటీలు, సెస్సులు, పన్నులు ఇంతకంటే ఎక్కువే ఉంటాయి.

ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రభుత్వ వైద్యసంస్థలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కొంటే దానికి కూడా 18 శాతం జి ఎస్ టీ కూడా కలిపారని; నిరుద్యోగులు, నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల మీదకూడా కేంద్రం జి ఎస్ టీ బాదుడు తప్పడంలేదని కాంగ్రెస్ ఎం.పి. ప్రియాంక విమర్శించారు.

ఆమధ్య ముంబయిలో వ్యాపారవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఒక స్టాక్ బ్రోకింగ్ నిపుణుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను మర్యాదగా అడిగిన ప్రశ్న:-
“మేడం! మేము కష్టపడి స్టాక్స్ అమ్మి, కొనిపెడుతుంటే…లాభమొచ్చినా, నష్టమొచ్చినా ప్రతి ట్రేడ్ లో పన్నులు పిండుకుంటున్నది మీరు! మాకంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారు. మాపాలిట మీరే పెట్టుబడి పెట్టని స్లీపింగ్ పార్టనర్ అయ్యారు. దీన్ని సరిచేసి మమ్మల్ని రక్షించండి”.
దీనికి నిర్మల సమాధానం:-
“స్లీపింగ్ పార్టనర్ కు మాట్లాడే హక్కు ఉండదు!”
https://youtu.be/UVtthAMdHgk?si=WkZqYIiN0KKTplCs

స్టాక్స్ లో రోజూ లక్షల కోట్లలో ట్రేడ్స్ జరుగుతుంటే 99 శాతం నష్టపోయి…ఒక శాతం మందికి మాత్రమే లాభాలు రావచ్చుగాక. కానీ ప్రతి ట్రేడ్లో ప్రభుత్వానికి పన్ను మాత్రం మ్యాండేటరిగా వెళుతూనే ఉంటుంది. జనం నష్టాల్లో కూడా ప్రభుత్వానికి రోజూ పన్నుల లాభాలే!

భారతదేశ సగటు ప్రజలు ఎంత గొప్పవారంటే-
ఇంతటి పన్నుల భారాన్ని, ఆర్థిక నష్టాన్ని జస్ట్ ఒక్క మీమ్ చేసి/చూసి నవ్వుకుని వదిలేస్తారు!

“తెలిసితే బంధము-
తెలియకున్న మోక్షము;
కలవంటిది బదుకు ఘనునికిని…”
అని అన్నమయ్య పాటను మార్చి పాడుకుంటూ…ఇవన్నీ తెలియకపోవడమే మంచిదన్న వైరాగ్యంలో ఉండిపోవాలి!
తెలిస్తే అనవసరంగా మనమీద మనకే జాలేస్తుంది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions