ఖమ్మంలో జరిగిన సభలకు తాతల్లాంటి సభల్ని కూడా కేసీయార్ మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆర్గనైజ్ చేయగలడు… కానీ ఖమ్మం సభలో ఓ జోష్ కనిపించలేదు… సాధారణంగా కేసీయార్ సభలంటే వాటిల్లో తెలంగాణతనం బాపతు ఓ ఎమోషన్, ఉత్తేజం అంతర్లీనంగా కనిపిస్తూ ఉండేది… ఇప్పుడది లోపించింది… అసలు వీళ్లు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారనేదే తెలంగాణ జనానికి పెద్ద ప్రశ్న… దానికి జవాబు సున్నా… వివరంగా చెప్పాలంటే..?
త్వరలో మా జాతీయ విధానం ఏమిటో ప్రకటిస్తాం అని కేసీయార్ ఉద్ఘాటించాడట… జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపుతా అని గాండ్రించే శక్తికి ఇప్పటికీ తను వెళ్లాల్సిన తొవ్వ ఏమిటో తనకే తెలియదు, ప్రజలకు చెప్పలేదు… చాలా సింపుల్ ప్రశ్న ఏమిటంటే..? నీది కూడా ఒక పార్టీయే కదా… దాని ఆవిర్భావ సభ అంటే నీఅంతటనువ్వే బలపడే సంకల్పాన్ని తీసుకోవాల్సిన సందర్భం కదా… మరి ఈ బీజేపీయేతర, కాంగ్రెసేతర ఉద్దండుగల ఆశీస్సులు దేనికి..?
సంఘీభావం అంటారా..? వోకే,.. ఏరి..? కేసీయార్ పక్కన విమానాల్లో తిరుగుతూ మీడియాలో దృష్టిలో దుమ్మురేపిన ఒక ప్రకాష్ రాజ్, ఒక రాకేశ్ టికాయిత్, ఒక కుమారస్వామి, ఒక ప్రశాంత్ కిశోర్‌ల జాడేది..? అసలు జాన్ జిగ్రీ ఓవైసీ లేడేమి..? రేప్పొద్దున ఈ రాజాలు, పినరై విజయన్‌లు, కేజ్రీవాల్‌లు, అఖిలేష్‌లు కూడా అంతే… దటీజ్ కేసీయార్…! నిజంగా కేసీయార్ నాయకత్వం పట్ల, పార్టీ పట్ల, బీఆర్ఎస్ సాధించబోయే విజయాల పట్ల అంత బలమైన నమ్మకాలు, అభిమానాలు ఉన్నవాడే అయితే, అంత సంఘీభావం ప్రకటించేవాడే అయితే ఈ కేజ్రీవాలుడు ఢిల్లీలో జరిగిన కేసీయార్ దీక్ష సమయంలో జాడ లేడేమిటి..? ఏదో కనీకనీపించకుండా, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ కూటమి బలంగా ఏర్పడకుండా ఈ కేసీయార్ అడుగులు అడ్డంకులు అవుతాయి తప్ప, అసలు ప్రశ్నలకు సందేహాలకు జవాబులు మాత్రం దొరకవు…
Ads
ఆ ప్రశ్నలేమిటంటే..? ఇప్పుడు చేతులు కలిపి, ఉమ్మడిగా మోడీని ఇంటికి పంపిస్తామని భీషణప్రతిజ్ఞలు చేస్తున్నవారు ఎలా కలిసి పోరాడాలి..? బీఆర్‌ఎస్‌లో విలీనం కావాలా..? అవుతాయా..? సాధ్యమేనా…? లేక బీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తూ పోరాడాలా..? మరి బీఆర్ఎస్సే ఎందుకు..? ఇదంతా ఓ ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నమా..? దానికి ఓ కొత్త జాతీయ ఇండిపెండెంట్ పార్టీ ఆవిర్భావ సభ వేదిక కావడం దేనికి..?
ఎవరూ ఓడించలేనంత ఉద్దండుడేమీ కాడు మోడీ… ఎటొచ్చీ పొలిటికల్ మరుగుజ్జులు మినహా తనకు ఢీకొట్టే నాయకులు లేరు ప్రతిపక్షంలో… అదే తన బలం… మొన్న గుజరాత్‌లో ఆప్ సాధించిందేమిటి..? ఏదో ఢిల్లీలో ఆందోళనలకు మద్దతునిచ్చినందుకు పంజాబ్‌ను కానుకగా ఇచ్చిన ఖలిస్థానీ శక్తుల మద్దతు తప్ప కేజ్రీవాల్‌కు వేరే బలమేముంది..? ఇప్పట్లో అఖిలేషుడు మళ్లీ కోలుకునే సీన్ లేదు… యూపీ దాటి వచ్చే సవాలే లేదు… ఇక సీపీఎం, సీపీఐల ఘన ప్రస్థానం గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు… మరి వీళ్లంతా కలిసి ఏం చేస్తారు..?
వాళ్ల గోచీబట్టలు సర్దుకోవడానికే చేతకావడం లేదు… ఇక కేసీయార్‌కు బద్దలు కట్టి, నిలబెట్టేంత సీన్ ఉందా వీళ్లకు..? పోనీ, కలిసే పోరాడతారు అనుకుందాం… బీహార్, తమిళనాడుల్లో కాంగ్రెస్ కూటమితోనే కలిసి ఉన్నారు కదా లెఫ్టీయులు… అధికారంలో కూడా ఉన్నారు కదా… మరి ఈ కేసీయార్ నేతృత్వంలోని కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో ఈ పాత్ర దేనికి..? కేసీయార్ ఏదైనా యాంటీ- మోడీ కనీస ఉమ్మడి కార్యాచరణ గానీ, యాంటీ- మోడీ పొలిటికల్ రూట్ మ్యాప్ గానీ ప్రకటించాడా..?
రాష్ట్రాల్లో డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీలను బిచ్చమడిగితే తప్ప సీట్లు లేవు లెఫ్ట్‌కు… కేరళ తప్ప వేరే సొంత అధికార వేదిక లేదు… రాజకీయ పోరాట క్షేత్రం లేదు… ఈ సీట్ల బిచ్చగాళ్ల పక్కన నిలబడటమా పోరాటమంటే..? నిజం ఇలా నిష్ఠురంగానే ఉంటుంది… ఆ నిజం ఏమిటంటే..? వీళ్లెవరూ కేసీయార్ వెంట ఉండేది లేదు… ఏ కోణమూ దానికి సహకరించదు… ఒకరి జాతకం మరొకరికి, ఒకరి గోత్రం ఇంకొకరికి బాగా తెలుసు… కానీ ఇదుగో ఇలా, ఏదో కొన్నాళ్లు ఈ రాజకీయ ప్రహసనం, ఆట అలా నడుస్తుంది… నడుస్తోంది..!! అన్నట్టు, నిన్నటి మీటింగ్ పార్టీల ఉమ్మడి బలం 17 సీట్లు… అందులో 9 BRS… సీన్ సమజైంది కదా..!!
Share this Article