.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జాతీయ ఇంటలిజెన్స్ చీఫ్‌గా తులసి గబార్డ్‌ను నియమించడంతో మళ్లీ ఆమె పేరు మీడియా తెరపైకి వచ్చింది… ప్రత్యేకించి ఇండియన్ మీడియా మంచి ప్రయారిటీ ఇస్తోంది ఆ వార్తకు…
ఐతే చాలామంది జర్నలిస్టులు కూడా పొరబడుతున్నట్టు… ఆమెకు ఇండియన్ రూట్స్ ఏమీ లేవు… ఆమెవి యూరోపియన్, అమెరికన్ మూలాలే… తులసి అనే పేరును బట్టి చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇండియన్ రూట్స్ ఉన్న మహిళ అని రాస్తున్నారు… కానీ అది కరెక్టు కాదు…
Ads
పుట్టింది అమెరికాకు దూరంగా… సముద్రంలో విసిరేసినట్టుగా ఉండే లెలోలోవా ద్వీపంలో… (అమెరికన్ సమోవా దీవులు)… తల్లి కరోల్ గబార్డ్, తండ్రి మైక్ గబార్డ్… ఈయనవి యూరోపియన్ రూట్స్… తులసి పుట్టాక రెండేళ్లకు ఈ కుటుంబం హవాయికి తరలిపోయింది… రాజకీయ కుటుంబమే…
మరి తులసి పేరు ఏమిటీ అంటారా..? తులసి తల్లి హిందూ మతాన్ని స్వీకరించింది… తండ్రి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు… తన ఐదుగురు పిల్లలకు ఆమె హిందూ పేర్లే పెట్టుకుంది… భక్తి, జై, ఆర్యన్, తులసి, బృందావన్… ఇవీ పిల్లల పేర్లు… (ఇంట్లో దీపావళిని ఎంత ఘనంగా జరుపుకుంటారో క్రిస్టమస్‌ను కూడా అలాగే జరుపుకుంటారు)…
తులసి నేషనల్ ఆర్మీలో పనిచేస్తూ పలు దేశాలు తిరిగింది… ఇరాక్ యుద్ధంలోనూ పాల్గొంది… లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి ఆమెది… హిందూ మతాన్ని ఆచరిస్తుంది… పొద్దున్నే యోగ, ధ్యానం, గీతాపఠనం తప్పనిసరి… శాఖాహారి… వైష్ణవం… యూఎస్ హౌజ్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసిందామె…
భగవద్గీతనే తన మార్గదర్శిగా చెబుతుంది… హౌజ్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ ఆమె… ఒక దశలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి కావాలనీ ప్రయత్నించింది… మొదట్లో ట్రంప్ ప్రత్యర్థి పార్టీ… ఇప్పుడు ట్రంప్ పార్టీ…
ఇదీ ఆమె నేపథ్యం… కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది… ఇస్కాన్‌తో సత్సంబంధాలున్నాయి… 2002లో ఎడ్వర్డోను పెళ్లి చేసుకుంది కానీ నాలుగేళ్లకే విడాకులయ్యాయి… 2015లో తిరిగి అబ్రహాం విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది… సో, ఇలా ఏ కోణం నుంచి చూసినా ఆమెకు ఇండియాతో ఏ కనెక్షనూ లేదు…
2014లో మోడీ, ఆమె కలిసినప్పుడు చేతులు జోడించి నమస్కారం చేసి, భగవద్గీతను ప్రజెంట్ చేసింది… ఇప్పుడు మళ్లీ ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి… అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బలంగా సపోర్ట్ చేసింది… అందుకే తులసి నేషనల్ ఇంటలిజెన్స్ చీఫ్ కాగానే మోడీ కూడా ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశాడు… బంగ్లాదేశ్‌లో హిందువుల మీద సాగుతున్న దాడుల మీద రీసెంటుగా ఆందోళన వ్యక్తం చేసింది ఆమె…
తులసి గబార్డ్ మాత్రమే కాదు, ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఇండియన్ రూట్స్ ఉన్న వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, కాశ్యప్ పటేల్, బాబీ జిందాల్ తదితరులకు కూడా ప్రముఖ పాత్రల్లో చేరతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..!!
Share this Article