అనకాపల్లి పుష్ప క్రైం స్టోరీలో బాగా నచ్చిన అంశం ఒకటుంది… ఆమె కాబోయే భర్త రాము నాయుడిపై దాడి చేసింది… తనకు రక్తం కారిపోతున్నా సరే, మైండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైనా సరే ఆ అబ్బాయి ఏం చేశాడు..? ఆమెపై ఎదురుదాడి చేయలేదు… ఆవేశంతో హత్యాయత్నం ఏమీ చేయలేదు… మానసిక స్థితి అదుపు తప్పిన ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి, ఆమెను సంఘటన స్థలం నుంచి వాపస్ తీసుకొచ్చాడు… తరువాత హాస్పిటల్‌లో చేరాడు…
నిజానికి వార్తల్లో ఆమె ఫోటోను బ్లర్ చేస్తున్నారు… అవసరం లేదు… పేరు దాయాల్సిన అవసరం కూడా లేదు… ఆమె నేరస్థురాలే చట్టం దృష్టిలో… జరిగింది హత్యాప్రయత్నం… అన్నింటికీ మించి ఆమె మానసిక స్థితి బాగాలేదు… రెండుసార్లు పెళ్లిచూపులు రద్దు చేయించిందట, బలవంతంగా ఒప్పించారట… సర్‌ప్రయిజ్ ఇస్తానని ఓచోటకు పిలిచి, కళ్లు మూసుకొమ్మని చెప్పి, సరిగ్గా మూసుకోవడం లేదని చున్నీతో కట్టి మరీ కత్తితో దాడి చేసింది… ఇది యుక్తాయుక్త విచక్షణరహిత స్థితి…
జరిగిన సంఘటనపై సోషల్ మీడియా వ్యంగ్య ధోరణిని తీసుకుంది… మీడియా ఓ మామూలు క్రైం యాంగిల్ తీసుకుంది… కానీ ఒక్క విషయం స్ట్రయిక్ అవుతోంది… ఆమె ఎందుకు ఈ పనిచేసింది..? దైవచింతనలో గడుపుతాను, నాకు పెళ్లి ఇష్టం లేదు అంటోంది… తన గమ్యానికి అడ్డుగా నిలబడింది, కనిపిస్తున్నది తనకు కాబోయే భర్తే కాబట్టి, కోపంలో అదుపు తప్పింది, ఆలోచన నశించింది, పిలిచి దాడి చేసింది… ఆమె మానసికంగా ఆరోగ్యంగా ఉండి ఉంటే… అక్కడికి రాగానే, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు అని స్ట్రెయిట్‌గా చెప్పేసేది… అతనిపై దాడి ఏకోణం నుంచి చూసినా సరే, ఆమెకు మానసిక ఆరోగ్య చికిత్స అవసరమనే తేలుతుంది…
Ads
ఆమె ఏం చెబుతోంది… ఓం శాంతి ఆశ్రమంలో ఉండాలని ఉందట… ఎక్కడిది ఈ ఆశ్రమం..? మిత్రుడు Srinivas Ganjivarapu చెబుతున్న వివరాల ప్రకారం… ‘‘ఆ ఆశ్రమం పేరు శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయి బాబా ఆశ్రమం… స్థానికంగా ఓం శాంతి ఆశ్రమం అని పిలుస్తారు… అనకాపల్లి జిల్లా, బుచ్చెయ్యపేట మండలం, కోమల్లపూడిలో వుంది…
ఈ ఆశ్రమం వాస్తవానికి 2011 లో చనిపోయిన జ్యోతిర్మయి బాబా సమాధి… అందుకే అమరపురి అని పేరు పెట్టుకున్నారు… సమాధిలో ‘శాంతి’ ఏమిటి అనే ప్రశ్న ఉదయించవచ్చును… అదే మ్యాజిక్కు ! బాబా బతికున్నంత కాలం… ‘‘నాకు సమాధానం ఎప్పుడు చెబుతావు, కొత్త లోకాన్ని ఎప్పుడు సృష్టిస్తావ్, నీ దగ్గరకి ఎప్పుడు రమ్మంటావ్’’ అనే టైపులో జ్యోతి మార్గం చెప్పేవాడు…
(ఏవో ఒకటీరెండు తెలుగు సినిమాల్లో పాత్రలు గుర్తొస్తున్నయ్… దేవుడి రాక మీద ఏవో హెలూసినేషన్స్… రీసెంటుగా ఆహా ఓటీటీలో ప్రియమణి నటించిన భామాకలాపంలో కూడా ఓ ప్రధాన పాత్ర కూడా…) బాబా మరణించాక భక్తులు బాబా పేరుతో ఓ ట్రస్టు పెట్టి… విరాళాలు వసూలు చేస్తూ, సమాధిని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు… ఇప్పుడు అక్కడకి చాలామంది శాంతి కోసం వెళ్తున్నారు…
సరే, ఎవరి నమ్మకం వాళ్లది… దాన్నలా వదిలేస్తే… పెళ్లి కాని యువతను కూడా ఈ ఆశ్రమం ఆకర్షిస్తోందా..? జీవితాంతం బ్రహ్మచారులుగా, బ్రహ్మచారిణులుగా బతికేంత గాఢమైన ఆధ్యాత్మికత వైపు ఆశ్రమం మరలుస్తోందా..? అసలు వార్తలో సర్‌ప్రయిజింగ్ ఫ్యాక్టర్ అదే కదా… ఏం బోధిస్తున్నారు అక్కడ..? దర్యాప్తు జరగాల్సింది పుష్ప మీద కాదు… పుష్ప అలా తయారు కావడానికి అసలు కారణాల మీద… ఇప్పుడే ఆకులు పట్టుకోవాల్సింది… ఇంకేవో చేతులు కాలాక కాదు..!!
Share this Article