.
రజాకార్ సినిమాకు అత్యున్నత పురస్కారం, అనసూయ సినిమాకు అత్యున్నత గౌరవం, అత్యుత్తమ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు రజాకార్ సినిమా ఎంపిక… ఢిల్లీలో జరిగే ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన… ఇలా 3, 4 రోజులుగా వార్తలు కనిపిస్తున్నాయి…
ఇవి చదివే పాఠకులకు అబ్బో, ఆ సినిమాకు ఎంత గౌరవం, అనసూయ నటనకు ఎంత పురస్కారం అనిపిస్తుంది… తెలుగు సినిమాకు జాతీయ ఖ్యాతి అనే తాత్కాలిక ఆనందమూ కలుగుతుంది… కానీ అసలు నిజాలు వేరు… అవే చెప్పుకోవాలి…
Ads
ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు కావు… అవి సుదీర్ఘకాలం సినిమా ఇండస్ట్రీకి సేవచేసిన లబ్దప్రసిద్దులకు ఇస్తారు… వ్యక్తులకు, సినిమాలకు కాదు… అవి కేంద్ర ప్రభుత్వమే అనౌన్స్ చేస్తుంది… అవి లైఫ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు దాదాపు… సాధారణంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలోనే ఇదీ అందిస్తారు…
మరి ఇప్పుడు చెప్పుకునేవి ఏమిటి…? ఉత్తవే… దాదా సాహెబ్ ఫాల్కే పేరును సొమ్ము చేసుకునే ఓ తరహా స్కోచ్ అవార్డులు… ఇది ‘‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్)… ఇది ఆయన పేరిట ఆయన సంబంధీకులు ఏర్పాటు చేసుకున్న వేరే దుకాణం…
(దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అని మరో సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ 2017లో డేరా బాబాకు కూడా అవార్డు ఇచ్చింది)… సో, ఈ అవార్డులు ఒక దందా… అవును, దందాయే… సో, క్లారిటీ వచ్చింది కదా… కేంద్ర ప్రభుత్వం ప్రకటించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు వ్యక్తులకు ఇచ్చేవి… ఫిలిమ్ ఫెస్టివల్స్‌కు, ఆయన పేరిట ఇచ్చే ఈ అవార్డులకూ సంబంధం లేదు…
ఈ అవార్డులు మరీ అంత మెచ్చి మేకతోలు కప్పేంత ఘనమైనవీ కావు… ప్రైవేటు కంపెనీలు కూడా ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తాయి… నాలుగైదు వేల నుండి పదివేల వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నాయి… ఇదొక కుంభకోణంలా తయారయింది… ఫిల్మ్ ఫెస్టివల్, అవార్డులు అనగానే మన తెలుగు సినిమావాళ్ళు ఉరుకుల పరుగుల మీద అప్లై చేసేస్తారు కదా…
అందుకే ఈ బోగస్ కంపెనీలు చాలా తయారయ్యాయి… ఓ వంద సినిమాల ఎంట్రీలు వచ్చినా ఐదారు లక్షల నుండి పది లక్షల వరకు దండుకుంటున్నారు…
ప్రైవేటు రంగంలో కాస్తో కూస్తో మంచి పేరున్న ‘జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’; ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ వంటి రెండు సంస్థలు నిజాయితీగా సినిమాలను జ్యూరీకి చూపించి, ఓ వారం రోజుల పాటు ఆయా సినిమాలు ప్రేక్షకులకు ప్రదర్శించి, అవార్డులు ఇస్తారు…
ఈ దొంగ కంపెనీలు ఇటీవల ‘ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో తిరుపతిలోనూ; ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో హైదరాబాదులోనూ, ఫంక్షన్లు తూతూ మంత్రంగా నిర్వహించి కొన్ని లక్షలు స్వాహా చేశారు…
ఈ దాదా సాహెబ్ ఫిల్మ్ అవార్డు కూడా అటువంటిదే… పది వేలో, ఐదు వేలో ఎంత వస్తే అంత, ఓ వెయ్యి మంది నుండి గుంజగలిగితే కోట్లలో ఇన్కమ్…
తెలుగులో ఇప్పటి వరకు….
(1) B. Nagireddy
(2) L. V. Prasad
(3) K. Vishwanath
(4) A. Nageshwara Rao
(5) D. Ramanaidu
(6) Paidi Jayaraj
(7) B. N. Reddy
వీళ్ళకు మాత్రమే భారత ప్రభుత్వం అధికారికంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చింది… (Subject to correction)
మరోసారి చెబుతున్నా… సినిమా ప్రముఖుల వ్యక్తిత్వాన్ని, భారత సినిమా రంగానికి వారు చేసిన విశేష కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డులను సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తుంది… కేవలం వ్యక్తులకు మాత్రమే ఇస్తుంది…. ఏదో ఒక సినిమాకు ఇవ్వదు…
ఎస్, రజాకార్ సినిమాకు నిజంగా ఏవైనా విశ్వసనీయ అవార్డులు వస్తే తప్పకుండా అందరమూ అభినందిద్దాం, ఆనందిద్దాం… (మిత్రులు, దర్శకుడు, రచయిత, నిర్మాత ప్రభాకర్ జైనీ ఇన్‌పుట్స్ సహకారంతో)…
Share this Article