.
నా జీవితంలో ఇక ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను… ఈ మధ్య నేను పెద్దవాళ్ళకి దగ్గర అవడం చూసి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని ఊహాగానాలు వస్తున్నాయి, అవి అన్నీ తుడిచేయండి… నేను మళ్ళీ రాజకీయాల్లోకి రానే రాను.. ఇక కళామతల్లి సేవ చేసుకుంటాను… మంచి సినిమాలు చేస్తాను…
నా టార్గెట్స్ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు … పెద్దవాళ్లను కలవడం కూడా సినిమా ఇష్యూస్ కోసమే…. రాజకీయాల్లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీలయ్యేవాడిని, రాజకీయాల్లో చేరాక నవ్వు మరిచిపోయావని నా భార్య అంటుండేది…
.
– – ఇవీ ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు….. సరే, ఏపీ సీఎంగానో, మరింత పెద్ద పదవిలోనో తమ్ముడిని చూడాలని కావచ్చు తన టార్గెట్… తప్పులేదు, మరీ కళామతల్లి సేవ, మంచి సినిమాలు వంటి పెద్ద పెద్ద పదాలు దేనికిలే గానీ… (మరీ శ్రీముఖితో నడుం చూశావ్ వంటి స్పూఫులు మంచి సినిమాలు అనబడును…)
Ads
ప్రజాజీవితం అనుకున్నంత ఈజీ కాదు… అధికారం ఉన్నా లేకపోయినా, గెలుపోటముల్లోనూ జనంలో ఉండేవాడు నిజమైన నాయకుడు… అది అందరికీ చేతకాదు… కుట్రలు, ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి… అదొక నిరంతర ప్రయాస…
విపరీతమైన తన ఫాలోయింగు చూసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు… లక్షల మంది నమ్మారు, వోట్లేశారు… కానీ చివరకు ఏమైంది..? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు… అమ్ముకున్నాడు అనలేం గానీ నమ్మిన జనాన్ని ముంచి, పార్టీని వదిలించుకున్నాడు… దాంతో తనకు పొలిటికల్ క్రెడిబులిటీ పోయింది… తనను జనం ఇక నమ్మరు…
మనం రీసెంటుగా చెప్పుకున్నట్టే…‘‘చిరంజీవి రాజకీయాల్లో లేడు, ఇక రాడు… ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాక, ఇక సినిమాలకే పరిమితమై ఏవో ఆ డాన్సులు, ఆ ఫైట్లు చేసుకుంటూ తన నటజీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు… తన లక్ష్యం కూడా తమ్ముడు పవన్ కల్యాణ్‌ను మంచి ప్లేసులో చూడాలని… ఒకవేళ చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా సరే జనం ఇక నమ్మరు… రీ- యాక్సెప్టెన్సీ కష్టం…’’
మరి మోడీ ఏమనుకున్నాడో గానీ… మొన్నటి సంక్రాంతి రోజున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో, ఢిల్లీలో మోడీ చిరంజీవికి మస్తు ప్రయారిటీ ఇచ్చాడు… కేంద్ర రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఆ పండుగ సెలబ్రేషన్‌లో చిరంజీవి ఓ విశిష్ట అతిథి… తనను ఎలా వాడుకోవాలని అనుకుని, అంత ప్రాధాన్యం ఇచ్చాడో మోడీ..? తెలియదు..!
(కేవలం సినిమా ఇష్యూస్ డిస్కస్ చేయడానికి కాదు కదా చిరంజీవిని రమ్మన్నది… చిరంజీవి వెళ్లింది… మోడీతో మాట్లాడే సినిమా ఇష్యూస్ ఏముంటాయబ్బా…!!)
ఇక్కడే మరో విషయం… మొన్న ఎక్కడో ( లైలా ఫంక్షన్‌లో ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరమే జనసేన అన్నాడు… నిజం కాదు, మరి కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రజారాజ్యం ఏమైంది..? చిరంజీవి విలీన నిర్ణయాన్ని కాదనే కదా పవన్ కల్యాణ్ సొంతంగా వేరే పార్టీ పెట్టుకున్నది..? మరి జనసేన ప్రజారాజ్యం పార్టీకి ఎక్స్‌టెన్షన్ ఎలా అవుతుంది..?
పైగా మొన్న, నిన్న రెండు ఫంక్షన్లూ సినిమాలకు సంబంధించినవి… రాజకీయ వేదికలు కావు… అక్కడ రాజకీయాల గురించి ఏం మాట్లాడినా అసందర్భమే అవుతుంది… ఇది సరైన ధోరణి కూడా కాదు… సినిమాల్ని సినిమాలుగా చూడాలని కదా పదే పదే పెద్ద తలకాయలు చెప్పేది… అవును, సినిమా ఫంక్షన్లను కూడా జస్ట్ సినిమా ఫంక్షన్లుగా మాత్రమే చూడాలి..!!
చివరికి రాంచరణ్ ఎవరిని కనాలో కూడా, నీ వారసత్వ విషయం కూడా అక్కడే చెప్పుకోవాలా..? సో, పిటి… (చివరకు ఫాఫం అంత విధేయుడిగా ఉండే బ్రహ్మానందం గురించి కూడా వేదిక మీద అలా వెటకరిస్తూ మాట్లాడాలా..?)
అవునూ… మళ్లీ అమ్మాయినే రాంచరణ్ కంటాడేమో అని భయమూ ఉందట… అమ్మాయి పుడితే భయం దేనికట..? మనమడే వారసత్వమా..? అమ్మాయిలు పనికిరారా..? వర్తమాన సమాజ పరిణతితో పోలిస్తే ఇవి మరీ దిగువ స్థాయి ఆలోచనలు… కాస్త పరిణతి పెంచుకోవాలి చిరంజీవి… మరో ఆణిముత్యం కావాలా..? ఇదుగో…. సారు గారి తాతగారు మహా రసికుడట… తనే గొప్పగా చెప్పుకున్నాడు ఇలా…
Share this Article