వారంతా ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం పార్ట్ టైం స్వీపర్లుగా ఉద్యోగంలో చేరారు. అప్పుడు వారి ‘జీతం’ నెలకు కేవలం 75 రూపాయలు మాత్రమే. దశాబ్దాలు గడిచినా వారికి నేటికీ రెగ్యులర్ స్కేల్ మంజూరు చేయలేదు. పాలకులు అప్పుడో వంద, ఇప్పుడో యాభై రూపాయలు జీతం పెంచారే తప్ప, వారిపై కనికరం చూపలేదు. సర్వీసును క్రమబద్ధీకరించలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో స్వీపర్ల సమస్యను పరిష్కరించాలని సంఘాలు ఉద్యమించలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే, స్వీపర్ల పక్షాన నిలబడి గట్టిగా కొట్లాడిన నాథుడే లేడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది రాజకీయ నేతలు వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసి, పార్ట్ టైం స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు చేస్తామని నమ్మకంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే, కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగులు ఉండరని, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని అనేక బహిరంగ సభల్లో చెప్పారు. స్పష్టమైన హామీలు ఇచ్చారు.
దాంతో స్వరాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయని స్వీపర్లు గంపెడాశలు పెట్టుకొని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. చిరుద్యోగులైనప్పటికీ సకల జనుల సమ్మె చేశారు. కానీ, ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం స్వీపర్లను పట్టించుకోకపోవడంతో వారి ఆశలన్నీ వమ్ము అయ్యాయి. రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, తమను ఆదుకోవాలని స్వీపర్లు చేస్తున్న విన్నపాలు అరణ్యరోదనగానే మిగిలిపోతున్నాయి. ఆర్ధిక సమస్యలు వెంటాడి వేధిస్తున్నా, కుటుంబాలు అతలాకుతలం అవుతున్నా ఉద్యోగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పార్ట్ టైం స్వీపర్ల (కాంటింజెంట్ ఉద్యోగుల) దీన స్థితి ఇది.
Ads
రోజుకి రూ. 173 జీతమా?
1979 నుంచి 1989 వరకు పాఠశాలల అవసరాల దృష్ట్యా స్వీపర్ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేశారు. అలా నియామకమైన వారిలో మెజారిటీ స్వీపర్లు ఇప్పటికే రిటైరయ్యారు. కొందరు సర్వీస్ లో ఉండగానే చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది వరకు పార్ట్ టైం స్వీపర్లు (పీటీఎస్) జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. 1979 లో వీరికి నిర్దేశించిన జీతం నెలకు 75 రూపాయలే.
నియామకమైన పదేళ్లకు 1989లో జీతం 150 రూపాయలు చేశారు. ఆ తర్వాత 1991 లో రూ.350, 1994లో రూ. 500, 2003లో రూ.780, 2006లో రూ.1,071 , జులై 2008 లో రూ. 1,298 కి పెంచారు. డిసెంబర్ 2010 లో రూ.1623 కి, సెప్టెంబర్ 2019 నుంచి రూ.4000 కి పెంచి, 15 జూన్, 2021 నుంచి నెలకు 5200 రూపాయలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ఆఫీస్ సబార్డినేట్స్ (అటెండర్లు)కు ఏ మాత్రం తీసిపోకుండా విధులు నిర్వహించే స్వీపర్లకు చెల్లించే వేతనం రోజుకు 173 రూపాయల 33 పైసలు. నైపుణ్యం లేని దినసరి కూలీలు సైతం రాష్ట్రంలో రోజుకు రూ.600 నుంచి రూ. 1000 పొందుతున్న ఈ రోజుల్లో పార్ట్ టైం స్వీపర్లకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీస వేతనాల చట్టం ప్రకారం చూసినా స్వీపర్లకు ఎంతో అన్యాయం జరుగుతోంది.
వర్క్ ఫుల్, సౌకర్యాలు నిల్!
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉండే ఏ సౌకర్యమూ స్వీపర్లకు లేదు. సెలవులు లేవు. అత్యవసర పరిస్థితి ఉండి లీవ్ పెడితే, ఆ మేరకు వేతనంలో కోతే! మెడికల్ రీయింబర్సుమెంట్ స్కీం, నగదు రహిత వైద్యానికి అర్హులు కారు. పీఆర్సీలు ఉండవు. కరవు భత్యం, అలవెన్సుల ఊసే లేదు. పండుగ అప్పులేనే లేదు. దురదృష్టవశాత్తు స్వీపర్ చనిపోతే, ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. జీవిత భాగస్వామి, పిల్లలకు పెన్షన్ రాదు. కారుణ్య నియామక పథకం వర్తించదు. తనపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వరు. రిటైరైతే పెన్షనరి బెనిఫిట్స్ వర్తించవు.
అసలు ప్రభుత్వం దృష్టిలో స్వీపర్లు ఎలాంటి హక్కులు లేని ఇచ్చింది పుచ్చుకునే నెల జీతగాళ్ళు మాత్రమే. ఏవిధమైన సౌకర్యాలు లేకపోయినా, అనేక ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో తమకు రెగ్యులర్ స్కేలు వస్తుందనే ఒకేఒక ఆశతో మాత్రమే వారు పనిచేస్తున్నారు. పంటి బిగువున బాధలను భరిస్తూ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్వీపర్లు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ తర్వాత వారు మరేదైనా పార్ట్ టైం పని చేసుకోవాలని ప్రభుత్వ ఉద్దేశ్యం.
పార్ట్ టైం పనులు ఎక్కడ దొరుకుతాయి? పార్ట్ టైం ఉద్యోగం చేసే సంస్కృతి, ఆ పని విధానం మన దగ్గర ఉందా? అయినా, స్వీపర్లు పేరుకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగులు కానీ, పని మాత్రం ఫుల్ టైం చేయాల్సిందే. వాస్తవానికి ఉదయం పాఠశాలల ప్రారంభానికి ముందే స్వీపర్లు స్కూల్ కి హాజరు కావాలి. పాఠశాలల సమయం ముగిసిన తర్వాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్లిపోయాకే స్వీపర్లు తమ ఇండ్లకు వెళ్ళిపోవాలి. మూడు, నాలుగు దశాబ్దాల నుంచి అరకొర జీతాలు చెల్లిస్తూ స్వీపర్లతో గొడ్డుచాకిరీ చేయిస్తున్నారు.
రెగ్యులర్ స్కేల్ ఇచ్చేదెన్నడో!?
25 నవంబర్, 1993 నాటికి 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, అటెండర్లుగా నియమించాలని 22 ఫిబ్రవరి, 1994 న ఉమ్మడి రాష్ట్రంలో 212 జీవో జారీ అయింది. ఈ జీవో ప్రకారం రెగ్యులర్ స్కేల్ పొందడానికి అర్హత కల్గిన స్వీపర్లు వెయ్యి మందికి పైగానే వివిధ జిల్లాల్లో ఉన్నారు. జీవో జారీ అయి మూడు దశాబ్దాల పుణ్యకాలం గడిచినా నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఓ వైపు వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేరు. కనీసం గంట కొట్టే దిక్కులేక పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
హెడ్మాస్టర్లు, టీచర్లే గంట కొట్టే దుస్థితి రాష్ట్రంలోని వందలాది స్కూళ్లలో ఉంది. మరో వైపు స్వీపర్లను మాత్రం అటెండర్లుగా నియామకం చేయడం లేదు. ఇంత అన్యాయం మరెక్కడైనా ఉంటుందా? పైగా, స్వీపర్లకు అటెండర్లుగా నియమించడానికి అదనపు గ్రాంటు అవసరమే లేదు. ఖాళీ అటెండర్ పోస్టులకు కూడా ప్రభుత్వం ఏటా బడ్జెట్ లోనే జీతాల గ్రాంటు కేటాయిస్తుంది కాబట్టి, ఆ గ్రాంటు నుంచే వేతనాలు చెల్లించవచ్చు.
అదనంగా ఒక్క నయా పైసా భారం పడకుండా స్వీపర్లను ఆదుకునే వీలున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం స్వీపర్లకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది. యూనివర్సిటీ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా, ఆర్థికంగా భారమైనా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, చిరుద్యోగులైన స్వీపర్ల గోడు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు.
సంఘాలు చొరవ చూపాలి
తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని స్వీపర్లు ఆవేదన చెందుతున్నారు. స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు సమస్యను ప్రభుత్వాల ముందు పెట్టి ఉద్యమాలకు ప్రజల నుంచి నైతిక మద్దతు పొందుతున్న ఉద్యోగ సంఘాలు, చర్చల సందర్భంలో తమ సమస్య పరిష్కారం కోసం ఉమ్మడి రాష్ట్రం నుంచీ గట్టిగా ప్రయత్నం చేయడం లేదనే భావన స్వీపర్లలో ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గత కొన్ని వారాలుగా స్వీపర్లు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తమకు రెగ్యులర్ స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించకూడదని స్వీపర్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టులను స్వీపర్లకు రెగ్యులర్ స్కేలు మంజూరుతో భర్తీ చేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది. అటెండర్ పోస్టులు మంజూరు లేని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. వాటికి నూతన అటెండర్ పోస్టులు శాంక్షన్ చేసి, స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరు చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది.
212 జీవో పరిధిలో లేని స్వీపర్లకు రెగ్యులర్ స్కేల్ మంజూరుకు అవసరమైతే జీవోను సవరించైనా సరే, సమస్యను పరిష్కరించాలి. ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ చర్యతో ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ల కొరత కూడా తీరుతుంది. దీంతోపాటు ఎలాంటి పెన్షన్, పెన్షనరి బెనిఫిట్స్ ఇవ్వకుండానే ఉద్యోగ విరమణ చేయించి ఖాళీ చేతులతో ఇంటికి పంపించిన స్వీపర్లపై కాస్తయినా కనికరం చూపాలి.
ఆర్ధిక సహాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. స్వీపర్ల సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకోవాలి. వారికి అండగా నిలవాలి. సమస్యను వెంటనే సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల మంది వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్ మంజూరు, నలభై మూడు వేల మంది ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కెసిఆర్, స్వీపర్ల దయనీయ స్థితిని కూడా మానవీయకోణంలో, సానుభూతితో పరిశీలించాలి. సత్వరం రెగ్యులర్ స్కేల్ మంజూరు చేసి, పార్ట్ టైం స్వీపర్లను ఆదుకోవాలి….. – మానేటి ప్రతాపరెడ్డి.
Share this Article