*జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా 50వేల జరిమానా. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు* న్యూఢిల్లీ:: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు తీర్పును ఆహ్వానిస్తున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి ఒకింత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…
ఇవి ఎందుకు, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో అర్థం కావు… ఏదో ఒక ఫాయిదా ఉండాలి కదా… అదీ లేదు ఇందులో… నిజానికి ఇలాంటి చట్టం ఒకటి మహారాష్ట్రలో తీసుకొచ్చారు మూడునాలుగేళ్ల క్రితం… జర్నలిస్టుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే మూడేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తారు దాని ప్రకారం… అంతేతప్ప సుప్రీంకోర్టు ఏ కేసు విచారణలో భాగంగా కూడా ఈ తీర్పు వెలువరించినట్టు ఎంత వెతికినా ఏ ఆధారమూ దొరకలేదు…
నిజానికి జర్నలిస్టు అంటే ఎవరు..? ఏదేని ప్రైవేటు సంస్థలో కొలువు చేసేవాడు… అందులోనూ ఫీల్డ్ మీద తిరిగే రిపోర్టర్లు వేరు, ఆఫీసుల్లో చేసేవాళ్లు వేరే… వీళ్లు గాకుండా నాన్-ఎడిటోరియల్ (ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ఎట్సెట్రా) సిబ్బంది వేరు… ఒకవేళ సుప్రీం తీర్పు చెప్పినా సరే, ఎవరిని జర్నలిస్టుగా నిర్వచించాలి… అసలు వేజ్ బోర్డులనే ఈ ప్రభుత్వం అమలు చేయించలేకపోతోంది… జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుందా..?
పైగా గతంలో లేనట్టు పరువు నష్టం దావాలను క్రిమినల్ కేసులుగా మార్చేసింది… మరొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే..? ఇప్పటికే జర్నలిస్టుల ముసుగులో సంఘవిద్రోహులు, వివిధ పార్టీల కార్యకర్తలు తమ యాక్టివిటీస్ సాగించుకుంటున్నారు… యూపీలో అరెస్టయి, వివాదం రేకెత్తిన సిద్దిఖ్ కప్పన్ కేసు ఇలాంటిదే… యూపీ ప్రభుత్వం చెప్పేది తను పీఎఫ్ఐ కార్యకర్త అని… ఎడిటర్స్ గిల్డ్, ఐజేయూ దాకా తను జర్నలిస్టే అన్నాయి… సో, ఎవరు జర్నలిస్టు..?
Ads
ఈ ప్రశ్న ఎందుకు వస్తున్నదంటే… ఒకప్పుడు పీరియాడికల్స్ వచ్చేవి, తరువాత టీవీ మీడియా… ఇప్పుడు సైట్లు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ మీడియా… జర్నలిస్టుల సంఖ్య లక్షల్లో ఉంటుంది… అందరికీ రక్షణ కల్పించాలి… నిజమే… కానీ జర్నలిస్టుగా గుర్తింపు కార్డులు ఎవరు ఇవ్వాలి…? రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికిపడితే వాళ్లకు అక్రెడిటేషన్లు ఇచ్చేస్తున్నాయి… సో, ఈ వార్తలు ఫేక్… ఒకవేళ నిజమే అయినా సరే, ఆచరణసాధ్యం కాదు… కేంద్రం అంగీకరించదు…!
Share this Article