ఊంచాయి సినిమా చూడండి… ఆ వయస్సులో… వయస్సు దాచుకోకుండా… ఆ వయస్సు వాళ్లకు కొత్త ఉత్సాహాన్నిస్తూ, బతుకు మీద ఆశల్ని పెంచుతూ… పాజిటివ్ వైబ్స్ పంచుతూ… ఒక అమితాబ్, ఒక అనుపమ్ ఖేర్, ఒక బొమన్ ఇరానీ, ఒక డేనీ… తోడుగా వెటరన్ తారలు… ఎంత ఉదాత్తమైన పాత్రలు… సినిమా రిలీజ్ సమయంలో జీరో బజ్… అయితేనేం, యాభై రోజులు నడిచి దాదాపు 50 కోట్లు వసూలు చేసింది… కలెక్షన్ పక్కనపెడితే ఆ పాత్ర ఔచిత్యానికి విలువ కట్టగలమా..?
ఎనభై ఏళ్ల అమితాబ్ గళ్ల లుంగీలు కట్టి స్టెప్పులేయడం లేదు… కత్తి పట్టి నరకడం లేదు… సేమ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా తమ వయస్సుకు తగినట్టు భిన్నమైన పాత్రలు ఎంచుకుని, ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, ఫ్యాన్స్‌కు కూడా గర్వకారణమవుతున్నారు… రజినీకాంత్, కమల్‌హాసన్ సంగతి వదిలేస్తే, ఎక్కడిదాకో ఎందుకు మన వెంకటేష్ కూడా భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటున్నాడు… ఒక నారప్ప, ఒక దృశ్యం ఎట్సెట్రా… మన స్టారాధిస్టార్లు మలయాళంలో హిట్టయిన మంచి పాత్రల్ని కూడా నానా బీభత్సం చేస్తున్నారు… అదే దృశ్యం సినిమా వీళ్ల చేతుల్లో పడలేదు నయం…
ఇంకా ఇమేజీ బిల్డప్పులు, ప్రేక్షకుడు ఇంకా ఏదో తక్కువ ఇచ్చినట్టు డబ్బుల వేట… స్టెప్పులు, ఫైట్లు, పంచులు, ఐటమ్ సాంగ్స్… చీప్ స్పూఫులు… ఒక అజిత్, ఒక విజయ్ ఏవో వేషాలు వేశారంటే, ఛల్, వాళ్లకు ఇంకా బోలెడంత వయస్సుంది, కెరీర్ ఉంది అనుకోవచ్చు… కానీ ఇదే సంక్రాంతికి వచ్చిన వీరసింహుడు, వీరయ్యలు..? యువ వీరసింహారెడ్డి మొహంలో కుర్రతనాన్ని అద్దడానికి ఫాఫం, మేకప్ మెన్ నానా కష్టాలూ పడ్డారు… మాస్ పేరిట వీరయ్యకు ఆ గళ్ల లుంగీలు, పూల చొక్కాలు, నోట్లో బీడీ… ఓహో, సగటు మత్స్యకారుడు అలా ఉంటాడా..?
Ads
పైగా ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు… ఒకరు విరమించుకోగా, మరొకరు కొనసాగుతున్నారు… ఒక పాత్ర పోషిస్తే ఎంత హుందాగా ఉండాలి..? అదేమీ లేదు… సరికదా, అవే ఐటమ్ సాంగ్స్ కూడా..! కోర్టు హాల్లో విలన్ తల నరకడాన్ని చిరంజీవి ఎలా సమర్థించుకుంటాడు..? తోడుగా ఉన్న రవితేజ తెలంగాణ భాషను గేలిచేస్తున్నట్టు ఖూనీ చేస్తుంటే దాన్నెలా సమర్థించగలరు… ఇక బాలకృష్ణ చేతిలో కత్తి ఉంటే చాలు, మందలుమందలుగా వందల శవాలు… (ముసలి హీరోలను చూసీ చూసీ విసుగెత్తి అప్పట్లో యంగ్ చిరంజీవి, సుమన్, అర్జున్‌లను అభిమానించేవాళ్లం… మరి ఇప్పుడు..?)
సంక్రాంతి బరిలో దిగిన నాలుగు సినిమాల్లో విజయ్, అజిత్‌లను పూర్తిగా పక్కన పెట్టేయండి, అవి తెలుగు సంక్రాంతి బరిలో లేనట్టే లెక్క… జీరో ఇంపాక్ట్… తమిళనాడులో కూడా కలెక్షన్లు సరిగ్గా లేకపోతే సినిమా తీసినవాడి చేతులు మూతులు కాలిపోయే దురవస్థ… కాకపోతే పోటీగా ఏ సినిమా లేకుండా చూసి, వందల థియేటర్లలో రిలీజ్ చేసి, ఎక్కువ రేట్లతో కలెక్షన్లు కుమ్మేసుకుని, అదీ మా ఘనతే అని చెప్పుకోవడం… ఇది రాసే సమయానికి వారసుడు 64.7 కోట్లు, తునివు (తెగింపు) 53 కోట్లు వసూలు చేశాయట… వీరయ్య, వీరసింహారెడ్డి ఈజీగా వంద కోట్ల క్లబ్బులో చేరిపోతాయి…
దృశ్యం-2 సినిమా గురించి ఎందుకు ప్రస్తావించానంటే… పిచ్చి ఫైటింగులు, తిక్క డాన్సులు, ఇమేజీ బిల్డప్పులు, ఐటమ్ సాంగ్స్, చీప్ జోక్స్ గట్రా ఏమీ లేకుండానే 350 కోట్లు వసూలు చేసింది… అసలైన హిట్ సినిమా అంటే అదీ… కేవలం కథ, కథనాలే హీరోలు… సంకల్పం బాగుంటే, కథ బాగుంటే, సినిమా పట్ల గౌరవం ఉంటే, ప్రేక్షకుడి పట్ల బాధ్యత ఉంటే కలెక్షన్లు అవే వస్తాయని చెప్పడానికి దృశ్యం సక్సెసే పెద్ద ఉదాహరణ… అసలే సక్సెసులు లేక వెలవెలబోతున్న బాలీవుడ్‌కు మళ్లీ ఊపిరి పోసింది ఈ సినిమా… సౌత్ నుంచి మొదలైన పాన్ ఇండియా ముప్పేట దాడిలో ముచ్చెమటలు పట్టిన హిందీ సినిమాకు ప్రాణం తీసుకొచ్చింది ఈ సినిమా… సోకాల్డ్ వింటేజీ డొల్ల ఇమేజీ, ఫార్ములా చేష్టల నుంచి ఇంకెప్పుడో బయటపడేది…!!
Share this Article