తెలంగాణలో కేసీయార్ బలం ఏమిటి..? ఓ దశ, ఓ దిశ లేని… కార్యాచరణ సరిగ్గా లేని… దూకుడుగా కేసీయార్‌ను ఢీకొట్టలేని ప్రతిపక్షాలు..! అవును, బలహీన ప్రతిపక్షమే కేసీయార్ బలం… సేమ్, మోడీ… ఎన్ని వైఫల్యాలున్నా… అసలు జనం పట్ల కొన్ని కీలకాంశాల్లో ప్రేమ చూపించలేకపోతున్నా సరే… ఎందుకు బలంగా కనిపిస్తున్నాడు..? ప్రతిపక్షాలే…! మోడీ మంచి పాలకుడు కాకపోవచ్చుగాక, కానీ వెరీ సక్సెస్ఫుల్ పొలిటిషియన్… రాజకీయాల్లో తాను సాధించిన గెలుపు సాధారణమైంది కాదు… అయితే ప్రతిపక్షాలు ఎంత దయనీయంగా ఉన్నాయంటే… ప్రధానికి ఓ పొలిటికల్ లేఖ రాస్తే… చివరకు దానికీ ఓ దశ లేదు, ఓ దిశ లేదు… వాళ్లు ఏం డిమాండ్ చేయాలనుకున్నారో వాళ్లకే స్పష్టత లేదు… అత్యంత గందరగోళంలో పడి కొట్టుకుపోతున్నయ్ ప్రతిపక్షాలు… మరి మోడీ బలసంపన్నుడిలా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది..? ఏమిటా లేఖ అంటారా..? తాజాగా మోడీకి నలుగురు బీజేపీయేతర సీఎంలు ప్లస్ కొన్ని ప్రధాన పార్టీల ముఖ్య నేతలు కలిసి (మొత్తం 12 పార్టీలు) ఓ లేఖ రాశారు…
‘ఏమయ్యా, మోడీ… తక్షణం ఆ సెంట్రల్ విస్టా (పార్లమెంటు, ప్రధాని నివాసం, ప్రభుత్వ కీలక కార్యాలయాలు గట్రా ఒకేచోట ఉండేలా నిర్మిస్తున్న ఓ బృహత్ భవనసముదాయం… కొన్ని వేల కోట్ల ఖర్చు…) నిర్మాణం ఆపేసెయ్, ఆ డబ్బుతో ఆక్సిజన్ కొను, ఆ డబ్బుతో వేక్సిన్ కొను, ఆ డబ్బుతో కరోనాపై పోరాడు’ అని ఆ లేఖ సారాంశం… ‘అంతేకాదు, ఆ వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేసెయ్, తిండిగింజల్ని ఉచితంగా పంచిపెట్టు, కరోనాతో ఉపాధి కోల్పోయినవాళ్లకు తలా 6000 నెలనెలకూ ఇవ్వు…’ అని కూడా డిమాండ్ చేశారు… ఈ లేఖ రచయితల్లో కాంగ్రెస్ సోనియాగాంధీ సహా జేడీఎస్ దేవగౌడ, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్దవ్ ఠాక్రే, టీఎంసీ మమత బెనర్జీ, డీఎంకే స్టాలిన్, జేఎంఎం హేమంత్ సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, ఎస్సీ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ తేజస్వి యాదవ్, సీపీఎం సీతారాం ఏచూరి, సీపీఐ రాజా ఉన్నారుె…
Ads
ఈ లేఖపై బీఎస్పీ, టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ తదితర బీజేపీయేతర పార్టీల సంతకాల్లేవ్… టీఆర్ఎస్, వైసీపీ మోడీ అనుకూలతనే ప్రస్తుతానికి స్థూలంగా అవలంబిస్తున్నాయి… జగన్ అయితే బీజేపీ సొంత శ్రేణులకన్నా తనే బాగా వెనకేసుకొచ్చాడు మొన్న సోరెన్ విషయంలో… బీజేడీ చాలారోజులుగా న్యూట్రల్… బీఎస్సీ ప్రస్తుతానికి చురుకుగా లేదు… నిజానికి ఈ లేఖ రాబోయే రాజకీయ కూటములకు ప్రతీక కూడా ఏమీకాదు… వీటిలో ఎన్సీపీ, శివసేన, జేఎంఎం, డీఎంకే పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి కూటమి ప్రభుత్వాల్లో ఉన్నయ్… సీపీఎం, సీపీఐ, టీఎంసీ అంత తేలికగా కాంగ్రెస్ పెత్తనాన్ని అంగీకరించే సీన్ ఇప్పుడైతే లేదు… సో, ఈ లేఖ రాజకీయ ప్రాధాన్యతను పక్కన పెడితే… అసలు డిమాండ్లకు వద్దాం…
తక్షణం సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ఆపేయాలట… దేనికి..? అసలు కరోనాకూ విస్టాకూ లింకేమిటి..? విస్టా నిర్మాణానికే నిధులన్నీ అయిపోతున్నయ్ కాబట్టి కరోనాకు డబ్బుల్లేవ్ అని చెప్పడం లేదా కదా ప్రభుత్వం… దేని ఖాతా దానిదే… వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ ఈ లేఖలో అప్రస్తుతం… అవీ ఇవీ కలిపి రాసేసరికి అసలు కరోనాపై ఫోకస్ తగ్గిపోయింది… అడగాలి, ఏమయ్యా, నువ్వు బడ్జెట్లో కరోనా పోరుకు, వేక్సిన్లకు 36 వేల కోట్లు ఇస్తానన్నవ్, పీఎం కేర్ డబ్బులొచ్చినయ్, అవన్నీ ఖర్చు చేయి, వేక్సిన్లకు అసలు నీ విధానం ఏమిటి..? అందరికీ ఫ్రీగా వేక్సిన్ ఎందుకు ఇవ్వవు..? ప్రజల బతికే హక్కును నువ్వు గుర్తించవా..? కరోనా కోరల్లోకి నెట్టేస్తావా..? ఇప్పుడు గాకపోతే ఇక ప్రభుత్వం ప్రజల్ని కాపాడేది ఎప్పుడు..? నీకసలు చలనం ఉందా..? ఆత్మనిర్భరం అన్నావ్, ఏం ఖర్చు చేశావో చెప్పు, నువ్వు విస్టా కడతావో, దాని తాతను కడతావో… ముందుగా ప్రజల్ని ఈ కరోనా పీడ నుంచి కాపాడు… కదులు… అని డిమాండ్ చేయాల్సింది… స్ట్రెయిట్‌గా… ఫోకస్డ్గా… విస్టాను ఆపేసి డబ్బులు తెస్తాడా..? ఆర్బీఐని మళ్లీ ముంచి డబ్బులు పట్టుకొస్తాడా..? అవన్నీ మోడీ తలనొప్పులు… వేక్సిన్ పాలసీ మీద నిలదీస్తే మోడీ దగ్గర సమాధానాల్లేవు… కేంద్రంలోని ఏ కీలక మంత్రి కూడా కిక్కుమనడం లేదు… జనంలో కూడా మోడీ ప్రతిష్ట బాగా దిగజారింది… దాన్ని ఫోకస్ చేస్తూనే…. తిండిగింజలు, నెలనెలా ప్రజల ఖాతాల్లోకి కొంత డబ్బు, ఫ్రీ వేక్సిన్, ఆక్సిజన్, సరైన డ్రగ్ పాలసీ ఇవీ కదా అడగాల్సింది… సెంట్రల్ విస్టాను టార్గెట్ చేయడం అనేది ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ధిని కూడా ఏమీ చేకూర్చదు… అసలు సగటు మనిషి బుర్రలోకి ఆ సబ్జెక్టు పోనేపోదు… మోడీని దించాలంటే ఈ గ్రహాలతో అయ్యే పనిలా లేదు…!! చివరగా ఒక మాట :: సెంట్రల్ విస్టా అంటే మోడీ సొంత ఇంటి నిర్మాణం కాదు, రేప్పొద్దున ఇదే కూటమిలోని దేవగౌడ మళ్లీ ప్రధాని అయినా సరే, అక్కడే ఉంటాడు…!!
Share this Article