ఒక వార్త… సైంధవ్ సినిమాలో హీరో వెంకటేష్ తప్ప ఇంకెవరూ తెలుగు నటులు లేరట… మన మీద మనమే జాలిపడాల్సిన వార్త… మాట్లాడితే మన తెలుగు జాతి, మన తెలుగు వాళ్లం, మన నేల, మన ప్రజలు అని బోలెడు నీతులు ఉచ్చరిస్తూ… తెలుగు ప్రేక్షకుల జేబులే కొల్లగొడుతూ… మన ఖజానా నుంచే రాయితీలతో స్టూడియోలు కట్టుకుంటూ… చివరకు తమ సినిమాల్లో నాలుగు పాత్రలు తెలుగు నటీనటులకు ఇవ్వలేని దౌర్భాగ్యమా..?
అంటేనేమో అన్నామంటారు… కన్నెర్ర చేస్తారు… తాటతీస్తామంటారు… ఎందుకీ దరిద్రం అనడిగితే మాత్రం ఎవ్వడి వద్దా జవాబు ఉండదు… తెలుగులో నటీనటులకు కొరత ఉందా..? సరే, తెల్లతోలు, చెప్పినట్టు తెర మీద ఆరబోయడానికి నటన బేసిక్స్ కూడా తెలియని దేభ్యం మొహాలు హీరోయిన్లుగా కావాలి… హీరో పక్కన స్టెప్పులేయాలి, తెలుగు హీరో వేసే వెధవ జోకులకు సినిమా ఫంక్షన్లలో పళ్లు ఇకిలించాలి, కమిట్మెంట్లు సరేసరి… మరీ కొంతకాలంగా విదేశీ హీరోయిన్లను కూడా వెతుకుతున్నారు… అవును మరి, తెలుగు తెర మీద తెలుగు మొహాలు కనిపిస్తే ఎంత నామర్దా..? ఎంత నామోషీ..?
అబ్బే, తెలుగులో తేటగా ఉన్న హీరోయిన్ల మొహాలు లేవండీ అంటారుట… మరి మొన్న బేబీ సినిమాలో మెరిసిన వైష్ణవికి ఏం తక్కువ..? పక్కా హైదరాబాదీ… డాన్స్, నటన ఇరగేసింది కదా… వెతికితే అలాంటి వాళ్లు బోలెడు మంది… సరే, హీరోయిన్లను పక్కన పెడితే విలన్లకూ పక్క చూపులే… అంతెందుకు..? ఓ మోస్తరు ప్రధాన పాత్రలు వేయడానికి మరీ మురళీశర్మను రప్పిస్తారు… బోలెడు ఖర్చు, డిమాండ్లు… ఐనాసరే తనే కావాలి, ఏం..? ఒక రావు రమేష్ పనికిరాడా..? జస్ట్, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం…
Ads
తెలుగు టీవీ సీరియళ్లలో మొత్తం కన్నడ హీరోయిన్లే… చివరకు ప్రధాన పాత్రలకు కూడా వాళ్లనే తెచ్చుకుంటున్నారు… కనీసం టీవీ సీరియళ్లకు కూడా మన ఆడ లేడీస్ పనికిరారా..? టీవీ ప్రోగ్రాముల్లో జడ్జిలు కూడా ఇతరులే… ప్చ్… చివరకు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టులకు కూడా తెలుగేతర సరుకేనా..? అలాగైతే మరి మనవాళ్లు ఏమైపోవాలి..? ఒక్క కథానాయకుడు మాత్రం తెలుగువాడు ఉంటే చాలు, అది తెలుగు సినిమా… దీన్ని తప్పుపట్టలేం గానీ, మన నటీనటులకు జరిగే అన్యాయం ఖచ్చితంగా ప్రశ్నార్హమే కదా…
ఈమధ్య మరీ పాన్- ఇండియా పేరిట ఇతర భాషల నటులను ఓ మోస్తరు పాత్రలు కూడా ఇస్తున్నారు,.. అదేమంటే, ఆయా భాషల ఫ్లేవర్ ఉంటే ఆయా భాషల్లో మార్కెటింగ్ ఈజీ అవుతుందనట… అదొక పిచ్చిసాకు… మన నటుల్ని జాతీయ స్థాయికి పెంచాలి గానీ, వేరే ఎవడినో తెచ్చుకుని మనం గిరాకీ పెంచి, మన డబ్బులే కట్టబెట్టడం ఏమిటి..? మన కథానాయకులు జాతీయ హీరోలు అవుతారు తప్ప మన ఇతర నటులకు అంత సీన్ లేదా..? అసలు చాన్సులంటూ ఇస్తే కదా…
ఆమధ్య ఏదో బూతులతో ఏదో వెబ్ సీరీస్‌లో విజృంభించి పరువు పోగొట్టుకున్న వెంకటేశ్ సినిమా సైంధవ్ ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉంది… పెద్దగా బజ్ ఏమీ లేదు… కానీ అందులో అందరూ తెలుగేతరులే అనే విమర్శ ఇప్పుడు సినీ సర్కిళ్లలో సాగుతోంది… శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా పాలేకర్ వీళ్ళందరూ తెలుగువాళ్లు కాదు… పోనీ మేల్ పురుష్ నటులనైనా పెట్టుకున్నారా అంటే నవాజుద్దీన్ సిద్దిఖీ, జిషు సేన్ గుప్త, ముకేష్ ఋషి, ఆర్య, జయప్రకాశ్ ఇంకా మరికొంతమంది…
అందరూ పరభాషా నటులే… మెరిట్ అనేది అర్థరహితమైన సాకు, సమర్థన… మనవాళ్లలో మంచి నటులు బోలెడు మంది… కాకపోతే ఒకరిద్దరు జబర్దస్త్ బాపతు నటులకు మాత్రమే చిన్నాచితకా పాత్రలు ఇస్తున్నారు… కానీ మొత్తానికి ఈ పరభాషా పైత్యం వల్ల బతుకుతున్నది ఎవరయ్యా అంటే, వాళ్లకు తెలుగు డబ్బింగ్ చెప్పే మన కళాకారులు…
పోనీ, వాళ్లకు తక్కువ పారితోషికాలు ఇస్తే సరిపోతుంది, అందుకుని వాళ్లను తెచ్చుకుంటున్నారంటే ఓ అర్థముంది… కానీ అదీ లేదు… మస్తు డబ్బు ఇస్తున్నారు… విమానాల టికెట్లు, స్టార్ హోటళ్లలో వసతి, కార్లు, బార్లు, పబ్బులు, మన్నూమశానం… సంగీత దర్శకుడు కావాలంటే తమిళ్ ఆర్ కన్నడ… ఫైట్ మాస్టర్ కావాలంటే వాళ్లే… అసలు తెలుగు సినిమా కథల్లో, కథనాల్లో తెలుగుతనం ఎలాగూ ఉండటం లేదు, కనీసం క్యాస్టింగైనా తెలుగుతనం ఏడ్చిందా అంటే అదీ ఉండటం లేదు…
కానివ్వండర్రా… ఇకపై హీరో తప్ప అందరూ తెలుగేతరులే ఉండాలి… దర్శకుడితో సహా… లైట్ బాయ్ దగ్గర నుంచీ…!! ఒక పొన్నియన్ సెల్వన్, ఒక కాంతారా, ఒక కేజీఎఫ్… వాళ్ల భాషానటులు, 24 క్రాఫ్ట్స్… వేరేవాళ్లు ఉండరు… మరి జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఆదరించడం లేదా..? మరి మనకే ఎందుకీ దరిద్రం..? అరె, మామూలుగానే అడుగుతున్నాం సార్… అలా కోపంగా చూడకండి, తాటతీస్తాను అని కత్తి తీయకండి…!!
Share this Article